ఒకవైపు అమరావతి జేఏసీ ఆందోళనలకు సిద్ధమవుతుంటే, మరోవైపు ఇతర ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది ప్రభుత్వం. ప్రత్యేకించి సచివాలయ ఉద్యోగ సంఘం నేతలతో మంత్రి బొత్స సమావేశమై చర్చించారు. ఉద్యోగ సంఘాల నేతలైన బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డి, ఇతర నాయకులతో విడివిడిగా మాట్లాడారు బొత్స. మొత్తం 94 ఆర్ధిక, ఆర్ధికేతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా అనేకవాటిపై హామీలు లభించాయ్. ముఖ్యంగా 13వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. పదేళ్ల సర్వీస్ దాటిన వాళ్లందరినీ రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం ఒప్పుకుందన్నారు. అలాగే, పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఉద్యోగులపై నమోదైన 16వందల కేసులను కూడా మాఫీ చేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ఒప్పుకుందని, వాళ్లకు సర్వీస్ రూల్స్, జాబ్ ఛార్ట్ సిద్ధం చేస్తామని హామీ ఇచ్చిందన్నారు వెంకట్రామిరెడ్డి.
అయితే, ఇది అనధికారిక సమావేశం అంటున్నారు ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు. తాము సీఎస్‌కి నోటీస్ ఇవ్వడం వల్లే చర్చలకు పిలిచారని చెప్పుకొచ్చారు. జీతాలు ఎందుకు ఆలస్యంగా ఇస్తున్నారని అడిగామన్న బొప్పరాజు, ఆర్ధిక అంశాల్లో రాజీపడే ప్రసక్తే లేదని ప్రభుత్వానికి తెగేసి చెప్పామన్నారు.
వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలకు భిన్నంగా మాట్లాడారు బొప్పరాజు. ప్రభుత్వం చెప్పిన ఒక్క హామీ కూడా నెరవేరలేదన్నారు. ఉద్యమ కార్యాచరణ నుంచి వెనక్కి తగ్గేదే లేదంటోన్న బొప్పరాజు, ఈనెల 9నుంచి యథాతథంగా పోరాటంలోకి వెళ్తామని తేల్చిచెప్పారు. అయితే, మళ్లీ ఏడో తేదీన సీఎస్‌తో మీటింగ్ ఉందంటున్నారు మరో ఉద్యోగ సంఘం నేత బండి శ్రీనివాస్. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించే అవకాశం ఉందని చెబుతున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..