టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu Naidu) పై ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వరద వస్తే సంబరాలు చేసుకునే ప్రభుత్వం తమది కాదని వ్యాఖ్యానించారు. ఏదో ఒకటి చేసి, వైసీపీ ప్రభుత్వం పై విషం చల్లాలని ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. ఈ నెల 21 వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానన్న వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వరదలు (Godavai Floods) తగ్గాక అక్కడికి వెళ్లి ఏం చేస్తారని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో, కొన్ని పత్రికలు, ఛానళ్లలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. 1986 తరువాత ఇంత ఎక్కువ వరదలు ఇప్పుడే వచ్చాయని అంబటి రాంబాబు చెప్పారు. జూలైలో వరదలు వచ్చినా గోదావరి పరీవాహక ప్రాంతాలలో జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. పునరావాస కేంద్రాలకు పంపించి, సహాయ కార్యక్రమాలు అందించామని వెల్లడించారు. వరద ప్రభావిత జిల్లాలు ఇప్పుడు ఆరు జిల్లాలుగా పునర్విభజన జరిగిందన్న మంత్రి అంబటి.. గతంలో ఇద్దరు కలెక్టర్లు ఉన్న వరద ప్రభావిత ప్రాంతాలకు ఇప్పుడు ఆరుగురు కలెక్టర్లు, ఎస్పీలు ఉన్నారని పేర్కొన్నారు.
సీఎం జగన్ ఆదేశాలతో చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు జరిగాయి. తెలంగాణలోని భద్రాచలం దాదాపు మునిగిపోయింది. సీఎం జగన్ వరద ప్రాంతాలకు వెళ్ళి ఫొటోలు దిగి ఆర్భాటాలు చేయలేదు. పోలవరంలో కాఫర్ డ్యాం 28లక్షల క్యూసెక్కుల వరకే డిజైన్ చేసి నిర్మాణం చేపట్టారు. 30 లక్షల వరద వచ్చినా పోలవరం దెబ్బ తినకుండా ఉండేలా వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విషపు రాతలతో ప్రభుత్వం రాదు. ప్రజల మనోభావాలు పట్టించుకునే ప్రభుత్వం మాది. వరదల్లో రాజకీయం చేసి లాభం పొందాలనుకునే చంద్రబాబును ప్రజలే గమనిస్తున్నారు.
– అంబటి రాంబాబు, ఆంధ్రప్రదేశ్ మంత్రి
కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సీఎం ఏరియల్ సర్వే చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కాలికి బురద అంటకుండా హెలికాప్టర్‌లో తిరిగితే ప్రజల కష్టాలు తెలుస్తాయా అని ప్రశ్నించారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజల కష్టాలు తెలుసుకోడానికి ఈ నెల 21, 22 తేదీల్లో తానే.. ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు చెప్పారు.
ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లోని టీడీపీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద నేపథ్యంలో ఒక్క రోజులో పోలవరం (Polavarm Dam) కాఫర్ డ్యాం ఎత్తు పెంచుతామని కొత్త డ్రామా మొదలు పెట్టారని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. పోలవరం పునరావాస కాలనీలను ఈ మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే ముంపు గ్రామాలకు ఈపరిస్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.