చాలా రకాలుగా మిల్క్ కల్తీ..? కల్తీ పాలను ఇంటి వద్దనే ఎలా గుర్తించాలంటే
ప్రస్తుత ప్రపంచంలో ప్రతిదీ కల్తీమయం అయిపోయింది. నిత్యావసరాలు అన్నీ కల్తీ అవుతున్నాయి. ముఖ్యంగా డైలీ పిల్లల నుంచి పెద్దల వరకు అవసరం అయ్యే పాలలో నీరు, యూరియా, డిటర్జెంట్లు వంటి హానికర పదార్థాలు కలుపుతారు. ఇంటి వద్ద సాధారణ పరీక్షలతో కల్తీని గుర్తించవచ్చు. కల్తీ పాలు తాగడం వల్ల జీర్ణ సమస్యలు, కిడ్నీ, కాలేయ నష్టాలు కలుగుతాయి. అనుమానం వస్తే స్థానిక ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేయాలి.

పాల కల్తీ అనేది నేటి సమాజంలో ఒక తీవ్రమైన సమస్యగా మారింది. పాలను సాధారణంగా సంపూర్ణ ఆహారంగా భావిస్తారు. అయితే, మనకు అందుతున్న పాలు ఎంతవరకు స్వచ్ఛంగా, నాణ్యంగా ఉన్నాయనే సందేహాలు రోజురోజుకు తీవ్రం అవుతున్నాయి. పాలను ఎలా కల్తీ చేస్తారు, కల్తీని ఎలా గుర్తించాలి, ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఎవరికి ఫిర్యాదు చేయాలి అనే అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం. ఆర్థిక లాభం కోసం కొందరు పాల వ్యాపారులు పాలలో నాసిరకం లేదా హానికర పదార్థాలను కలుపుతున్నారని నిపుణులు చెబుతున్నారు. పాల కల్తీ అనేక రకాలుగా జరుగుతుందని, వాటిని కొన్ని సాధారణ పరీక్షలతో గుర్తించవచ్చని ఆయన వివరించారు. సాధారణంగా పాలలో నీరు, యూరియా, డిటర్జెంట్లు, ఫార్మలిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటివి కలుపుతారు. పాల పరిమాణం పెంచడానికి నీరు, తాజాగా కనిపించడానికి ఫార్మలిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్, ప్రొటీన్ ఎక్కువగా కనిపించడానికి యూరియా, కొవ్వు ఎక్కువగా చూపడానికి చౌక నూనెలు, నురుగు ఎక్కువగా కనిపించడానికి డిటర్జెంట్లు వాడుతారు. ఇంట్లోనే పాలు కల్తీ అయ్యాయో లేదో గుర్తించడానికి కొన్ని చిట్కాలున్నాయి.
నీరు కలిపారా?
కొద్దిగా పాలను ప్లేట్ లేదా టైల్స్‌పై పోసి గమనించాలి. స్వచ్ఛమైన పాలు మందంగా, నెమ్మదిగా ప్రవహిస్తాయి. నీరు కలిపిన పాలు వేగంగా జారిపోతాయి.
డిటర్జెంట్ ఉందా?
బాటిల్లో పాలు తీసుకుని తక్కువ నీటితో షేక్ చేయాలి. స్వచ్ఛమైన పాలు పలుచగా, తక్కువ నురుగు వస్తాయి. డిటర్జెంట్ కలిపిన పాలు ఎక్కువ నురుగును ఉత్పత్తి చేస్తాయి.
స్టార్చ్ కలిపితే?
కొన్ని పాలలో రెండు చుక్కల అయోడిన్ వేస్తే స్వచ్ఛమైన పాలు రంగు మారవు. స్టార్చ్ కలిసిన పాలు నీలం లేదా నలుపు రంగులోకి మారతాయి.
యూరియా కలిసిందా?
పాలలో సోయాబీన్ పొడి కలిపి చూసినప్పుడు స్వచ్ఛమైన పాల వాసనలో మార్పు ఉండదు. కానీ యూరియా కలిసిన పాలు అమోనియా వాసన వస్తాయి.
సింథటిక్ పాలు?
అరచేతిలో కొన్ని పాలు పోసి రుద్దినప్పుడు స్వచ్ఛమైన పాలు మృదువుగా, సహజంగా ఉంటాయి. సింథటిక్ పాలు సబ్బులా జారుడుగా, అసహజ ఫీలింగ్‌ను ఇస్తాయి.
ఇవి ప్రాథమిక సూచనలు మాత్రమేనని, కచ్చితమైన నిర్ధారణకు ల్యాబ్ పరీక్షలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. లాక్టోమీటర్ ద్వారా పాల నాణ్యతను త్వరగా తెలుసుకోవచ్చని, ఇది పాల సాంద్రతను కొలుస్తుందని వివరిస్తున్నారు. నీరు కలిపితే సాంద్రత తగ్గుతుంది, ఘన పదార్థాలు కలిపితే సాంద్రత పెరుగుతుంది. అయితే, రసాయనాల కల్తీని లాక్టోమీటర్ నేరుగా గుర్తించదు. పూర్తి నిర్ధారణకు ల్యాబ్‌లో కొవ్వు శాతం, ఘన పదార్థాలు (సాలిడ్స్ నాట్ ఫ్యాట్), మైక్రోబయాలజికల్ పరీక్షలు చేయాల్సి ఉంటుంది.
కల్తీ పాలను తాగడం లేదా వాటితో తయారైన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. జీర్ణ సమస్యలు, హానికర సూక్ష్మజీవుల పెరుగుదల, దీర్ఘకాలిక కిడ్నీ, కాలేయ సమస్యలు వీటిలో ప్రధానమైనవి. నీరు కలిపిన పాలు జీర్ణ సమస్యలకు, యూరియా కిడ్నీపై ఒత్తిడికి, నష్టానికి, డిటర్జెంట్లు పేగుల వాపు, గ్యాస్ట్రైటిస్‌కు దారితీస్తాయి. ఫార్మలిన్ విషపూరితమై, కాలేయం, కిడ్నీలకు ప్రమాదకరం. స్టార్చ్ విరేచనాలు కలిగిస్తుంది, మధుమేహ రోగులకు మరింత ప్రమాదకరం. హైడ్రోజన్ పెరాక్సైడ్ తీవ్రమైన జీర్ణ సమస్యలకు కారణమవుతుంది.
పాలలో కల్తీ జరిగిందని అనుమానం వస్తే, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలియక ఎవరైనా తీసుకుంటే వాంతులు, విరేచనాలు, తలనొప్పి వంటి లక్షణాలను గమనించాలి. పిల్లలు, గర్భిణులు అయితే వెంటనే వైద్యులను సంప్రదించడం తప్పనిసరి. కల్తీ అనుమానం ఉంటే ఆ పాలను సీల్ చేసి, వెంటనే స్థానిక ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేయాలి. వినియోగదారుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసే ఈ కల్తీ చర్యలను ఆహార మోసంగా పరిగణిస్తారు.
