మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ కోనేరుకు మహర్దశ రాబోతోంది. మరుగున పడిన చరిత్ర మరోసారి వెలుగులో వస్తోంది. పెద్ద కోనేరును అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో.. శ్రీచక్రం ఆకారంలోనున్న కోనేరు దర్శనమిస్తోంది. కోనేటిలోని నీటిని తోడే కొద్దీ.. ఆలయ నిర్మాణాలు బయటపడుతున్నాయి.
గుంటూరు జిల్లా మంగళగిరి అనగానే ఠక్కున లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గుర్తుకు వస్తుంది. ఇక్కడి స్వామివారి విగ్రహాన్ని పాండవులు ప్రతిష్టించారని ప్రతీతి. ఆ తర్వాత శ్రీక్రిష్ణదేవరాయల కాలంలో ఆలయాన్ని నిర్మించగా.. సదాశివరాయల హయాంలో ఆయన మేనల్లుడు రాజయ్య దక్షిణాన పెద్ద కోనేరు నిర్మించినట్లు చరిత్ర చెప్తోంది. 464 ఏళ్ల క్రితం ఆ కోనేటిని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. 1970 వరకూ ఈ కోనేటిలో స్వామివారి తెప్పోత్సవం నిర్వహించేవారు. స్వామివారిని దర్శించుకునే వారు పుష్కరిణిలో స్నానమాచరించేవారు. అయితే.. కొన్నేళ్ల తర్వాత కోనేరు శిథిలావస్థకు చేరి డంపింగ్ యార్డుగా మారిపోయింది. కోనేటి నిర్మాణాలు కూలిపోయాయి. నీరు కూడా పైవరకూ చేరుకుంది.
వాస్తవానికి.. 30 ఏళ్ల క్రితం కోనేరు అభివృద్ధికి ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యపడలేదు. ఈ క్రమంలో పెద్ద కోనేరును పునర్నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సంకల్పించారు. గత ఏడాది డిసెంబర్‌లో పనులు మొదలు పెట్టారు. మొత్తం నీటిని తోడటానికే నాలుగు నెలల సమయం పట్టింది. అయితే.. నీళ్లు తగ్గిపోతున్న కొద్దీ అనేక నిర్మాణాలు బయటపడుతున్నాయి. మొదట కోనేరు పడమర గోడపై ఆంజినేయ స్వామి దేవాలయం బయటపడింది. ఆలయం ఎదుట ధ్వజ స్తంభం కూడా ఉంది. ఈశాన్య మూలలో రెండు శివలింగాలు బయటపడ్డాయి. తూర్పు మెట్లపై శివలింగాకార తోరణాల మెట్లు వెలుగు చూశాయి. వీటిని తిలకించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇప్పటికే 120 అడుగుల వరకూ వెళ్ళారు. ఇంకా అడుగున బావి ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే.. కోనేరు చతుర్భుజా, షడ్బుజా అర్థం కావటం లేదు. కానీ.. భక్తులు మాత్రం శ్రీ చక్రం ఆకారంలో కోనేరును నిర్మించారని చెబుతున్నారు భక్తులు.
మొత్తంగా.. మరో రెండు నెలల్లో పునర్‌నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు. కోనేరును వాడుకలోకి తీసుకురావడమే కాకుండా స్వామివారి తెప్పోత్సవం నిర్వహించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..