AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: విమర్శలకు చెక్ పెట్టేలా.. ఆంధ్రప్రదేశ్‌లో అమర్ రాజా గ్రూప్ పెట్టుబడులు.. కొత్తగా యువతకు ఉద్యోగాలు..

ఇటీవల తెలంగాణలో 9,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు అమర్ రాజా గ్రూప్ ముందుకురావడంతో.. ఆ సంస్థపై పలు విమర్శలు వచ్చాయి. అమర్ రాజా గ్రూప్ సహా వ్యవస్థాపకులు గల్లా జయదేవ్.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎంపీగా ఉంటూ.. సొంత రాష్ట్రంలో..

Andhra Pradesh: విమర్శలకు చెక్ పెట్టేలా.. ఆంధ్రప్రదేశ్‌లో అమర్ రాజా గ్రూప్ పెట్టుబడులు.. కొత్తగా యువతకు ఉద్యోగాలు..
Mangal Industries
Amarnadh Daneti
|

Updated on: Dec 13, 2022 | 9:09 AM

Share

ఇటీవల తెలంగాణలో 9,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు అమర్ రాజా గ్రూప్ ముందుకురావడంతో.. ఆ సంస్థపై పలు విమర్శలు వచ్చాయి. అమర్ రాజా గ్రూప్ సహా వ్యవస్థాపకులు గల్లా జయదేవ్.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎంపీగా ఉంటూ.. సొంత రాష్ట్రంలో కాకుండా.. పక్క రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారంటూ అనేకమంది విమర్శలు చేశారు. ఈ అంశం రాజకీయంగానూ పెద్ద దుమారానికి కారణమైంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైఖరి కారణంగానే పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే.. పెట్టుబడిదారులకు తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో తమ సంస్థపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ లో అమర్ రాజా గ్రూపునకు చెందిన అనుబంధ సంస్థ తన కార్యకలాపాలను విస్తరించనుంది. దాదాపు రూ.250 కోట్ల రూపాయలు దీని కోసం పెట్టుబడి పెట్టనున్నారు. ఎంపీ గల్లా జయదేవ్‌ సొంత జిల్లా చిత్తూరులో దీన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. అమర రాజా బ్యాటరీస్‌కు అనుబంధ సంస్థ మంగళ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. తిరుపతి సమీపంలోని కరకంబాడి వద్ద ఇప్పటికే మంగళ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యూనిట్ కొనసాగుతోంది. దీన్ని మరింత విస్తరించడానికి కంపెనీ ముందుకు వచ్చింది. జిల్లాలోని తేనేపల్లిలో దీన్ని నెలకొల్పబోతోన్నట్లు ప్రకటించింది. రూ. 250 కోట్ల పెట్టుబడితో కొత్తగా 2.15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో యూనిట్‌ను స్థాపించనున్నట్లు సంస్థ ప్రకటించింది.

మంగళ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏర్పాటుచేయనున్న ఈ యూనిట్‌లో మంగళ్ ఇండస్ట్రీస్ ఆటో కాంపోనెంట్స్, మెటల్ ఫ్యాబ్రికేషన్, బ్యాటరీ కాంపోనెంట్స్, టూల్ వర్క్స్, స్టోరేజీ సొల్యూషన్స్, కస్టమ్ ఫ్యాబ్రికేషన్‌లో ఉత్పత్తులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అశోక్ లేలాండ్, బోర్గ్‌వార్నర్, బాష్, ఏబీబీ, అల్‌స్ట్రామ్, ఫాక్స్‌కాన్, మాండో వంటి అతిపెద్ద బ్రాండ్‌లకు తమ ఉత్పత్తులను ఈసంస్థ సరఫరా చేస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీకి చెందిన తయారీ కేంద్రాల్లో మూడువేల మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా ప్రాంతంలో తమ తయారీని పెంచడానికి, స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించడానికి తాము కట్టుబడి ఉన్నామని, కొత్తగా ప్రతిపాదించిన మంగళ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ద్వారా మరింత మందికి ఉద్యోగాలను కల్పించనున్నామని అమర్ రాజా గ్రూప్ సహా వ్యవస్థాపకులు గల్లా జయదేవ్ తెలిపారు. దీని ద్వారా కనీసం వెయ్యి నుంచి 15వందల మందికి ఉద్యోగాలు లభించనున్నాయన్నారు. తేనేపల్లిలో కొత్తగా నెలకొల్పదలిచిన ఈ ప్లాంట్‌లో సోలార్ పవర్‌తో పాటు ఇతర కస్టమ్ ఫ్యాబ్రికేషన్ ఉత్పత్తుల వంటి పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించిన విడి భాగాలను తయారు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు రాగానే కొత్త ప్లాంట్ పనులు వెంటనే ప్రారంభమవుతాయని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఇదివరకు పెట్టుబడులు పెట్టే విషయంలో గల్లా జయదేవ్ పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొ న్నారు. తెలంగాణలో రూ.9,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. తాజాగా ఏపీలోనూ తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ప్రకటించడంతో.. ఆ విమర్శలకు చెక్ పెట్టినట్లైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..