డబ్బులు ఊరికే రావు..! ఈ మాట ఈ మధ్యకాలంలో అందరూ వినే ఉంటారు. కానీ విశాఖలో మాత్రం కొందరు ఊరికే డబ్బులు వచ్చేస్తాయని ఆశపడ్డారు. లాభాల మాట సరే కదా.. ఉన్నదంతా పోగొట్టుకున్నారు. అసలు విషయం తెలుసుకునేసరికి జరగాల్సింది జరిగి లబోదిబోమంటున్నారు. విశాఖలో మరో వైట్ కాలర్ మోసం వెలుగులోకి వచ్చింది. షేర్ మార్కెట్లో పెట్టుబడుల పేరిట వసూలు చేసి ముఖం చాటేసాడు రాహుల్ సింగ్ అనే వ్యక్తి రెండు కోట్లకు పైగా కుచ్చు టోపీ పెట్టి పారిపోయాడు. దీంతో ఆలస్యంగా గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాహుల్ సింగ్ అనే వ్యక్తి.. ఈక్విటీ నాక్స్ ఛాయిస్ స్టాక్ మార్కెట్ పేరుతో విశాఖలోని సత్యం జంక్షన్ లో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అందరిని ఆకర్షించాడు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించాడు. విశాఖలోని పారిశ్రామికవేత్తలు ఉండే బిజినెస్ ఇంటర్నేషనల్ గ్రూపులో చేరి వాళ్లతో పరిచయాలు పెంచుకున్నాడు. ఇలా.. అధిక లాభాలను ఆశ చూపి వసూళ్లు ప్రారంభించాడు. కొందరికి డైరెక్ట్ గా షేర్ మార్కెట్లో లాభాలు చూపిస్తానని, మరికొందరికి తన దగ్గర పెట్టుబడి పెడితే దానికి తగ్గట్టు వడ్డీ చెల్లిస్తానని చెప్పుకొచ్చాడు. ఇలా పెట్టుబడులు సేకరించిన తర్వాత చెల్లిస్తూ వచ్చాడు. విషయం ఆనట ఈ నోట పగడంతో మరికొంతమంది రాహుల్ సింగ్ మాటల్లో పడిపోయారు. కొన్నాళ్లపాటు అందరికీ నెలనెల చెల్లింపులు చేశాడు. ఇలా ఒక్కొక్కరు రెండు లక్షల నుంచి 48 లక్షలు చెల్లించిన వాళ్లు కూడా ఉన్నారు.
పెట్టుబడులు సేకరించిన తరువాత కొంతకాలం వరకూ బాగానే ఉంది. ఆ తర్వాత చెల్లింపుల్లో జాప్యం జరగడంతో.. బాధితులకు అనుమానం వచ్చి రాహుల్ సింగ్ ను ప్రశ్నించారు. అయితే తాను ముంబైలోనే స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నానని లాభాల్లో కొంత జాప్యం జరుగుతుందని.. కాస్త వేచి చూస్తే లాభాలు మన సొంతమని నమ్మ బలిగాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు రాహుల్ సింగ్ కనిపించకుండా పోయాడు. దీంతో అతడి కోసం పెట్టుబడులు పెట్టిన వారంతా ఆరా తీసారు. అప్పటికే రాహుల్ తన కుటుంబంతో విశాఖ నుంచి పరారైనట్లు గుర్తించిన బాధితులు.. మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్నారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మోసంపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
రెండు కోట్ల వరకు మోసం జరిగింది: డిసిపి విద్యాసాగర్ నాయుడు..
‘బాధితులు మోసగించిన వ్యక్తి అంతా తెలిసిన వాళ్ళే. కొంతమందికి మార్చి వరకు చెల్లింపులు చేసాడు. ప్రస్తుతానికి ఇద్దరు బాదితులు పోలీసుల వద్దకు వచ్చినప్పటికీ.. 10 నుంచి 15 మంది ఉన్నట్టు ప్రాథమికంగా తెలిసింది. రెండు కోట్ల రూపాయల వరకు మోసం జరిగి ఉంటుందని అంటున్నారు. బాధితుల నుంచి మరిన్ని ఆధారాలు సేకరించి కేసు నమోదు చేస్తున్నాం’ అని అన్నారు డిసిపి విద్యాసాగర్ నాయుడు.
ప్రాథమికంగా రెండు కోట్ల వరకు అంచనా వేస్తున్నప్పటికీ.. బాధితులు, డిపాజిట్లు సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చూశారుగా డబ్బులు ఊరికే రావు… బి అలర్ట్..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం