కాకినాడ, జులై 19: దేవతలు వ్యవసాయం చేస్తారా.. ఒకవేళ దేవుళ్లంతా దిగవచ్చి సేద్యం చేస్తే ఎలా ఉంటుంది. నిజమైన దేవుళ్ళు కాదు కానీ దేవుని రూపాలలో వేషాలు కట్టి పూజలు చేసి పరమ పవిత్రంగా వ్యవసాయం చేస్తున్నారు కాకినాడ జిల్లాలో ఈ రామభక్తులు. ఇంతకీ ఈ దేవుళ్ళ వ్యవసాయం ఎందుకు అనుకుంటున్నారా.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.. అంతా రాములోరికోసమే.. అవును, భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణానికి తలంబ్రాలు ఈ కాకినాడ నుంచే వెళ్తాయి. ప్రతి సంవత్సరం వేసవిలో సీతారాముల కల్యాణ మహోత్సవం భద్రాద్రిలో కన్నుల పండుగగా జరుగుతుంది. వేలాదిమంది ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి తరలి వస్తారు. ఇదే భద్రాద్రి కల్యాణంలో తలంబ్రాలు కూడా చాలా ఫేమస్. నాలుగు తలంబ్రాలు దొరికితే చాలని భక్తులు అమూల్యంగా ఇంటికి తెచ్చుకుంటారు. అలాంటి శ్రీ సీతారామ కళ్యాణంలో వాడే తలంబ్రాలను ఇలా దేవుళ్ళ వేషధారణలో దుక్కి దున్ని, నారు వేసి, కోత చేసి అంతే పవిత్రంగా భద్రాచలం తరలిస్తారు.
భద్రాచలం చేరుకున్న ధాన్యపు రాశులను కూడా గోర్లతో తీసి బియ్యంలా తయారు చేయడం మరో ప్రత్యేకత. ఇలా గోర్లతో వలచి బియ్యాన్ని తయారు చేయడానికి వందలాది మంది భక్తులు భద్రాచలం వచ్చి సేవలందిస్తారు. అయితే వేసవిలో జరిగే కల్యాణోత్సవానికి ఇప్పుడే పంట మొదలుపెడతారు. ప్రత్యేక పూజలు చేసి హనుమంతుడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు, భరతుడు ఇలా రామాయణంలో ఉన్న పాత్రల వేషధారణలో వ్యవసాయం చేయడం దశాబ్దాలుగా వస్తున్న ఆచారం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..