CM Jagan: ఒక్క ఎమ్మెల్యేనూ వదలుకోం, అందర్నీ గెలిపించుకుటాం: ఏపీ సీఎం జగన్
ఒక్క ఎమ్మెల్యేనూ వదలుకోం, అందర్నీ గెలిపించుకుటామని ఎమ్మెల్యేలతో భేటీలో జగన్ భరోసా ఇచ్చారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామని టీడీపీ గొప్పలకు పోతుందని, ఎమ్మెల్యేలతో భేటీలో ఎమ్మెల్సీ ఫలితాలపై సీఎం జగన్ స్పష్టతనిచ్చారు. 21 స్థానాల్లో.. 17 స్థానాలు వైసీపీ గెలిచిందని, ఉన్నది లేనట్టుగా మారీచులు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒక ఎమ్మెల్సీ స్థానం అంటే 34 నుంచి 39 నియోజకవర్గాల పరిధి ఉంటుందని, 80లక్షల ఓట్లలో కేవలం రెండున్నర లక్షలమంది మాత్రమే పట్టభద్రులు ఉన్నారని ఆయన తెలిపారు. పట్టభద్రుల ఓటర్లలో రకరకాల యూనియన్లు ఉన్నాయని, అందులో 87% మాతోనే ఉన్నారని సీఎం జగన్ తేల్చి చెప్పారు. కేవలం 20% మంది మాత్రమే డీబీటీలో ఉన్నారని, వచ్చే ఎన్నికలకు ఇది ఏమాత్రం శాంపిల్ కాదంటూ ఎమ్మెల్యేలతో భేటీలో ఎమ్మెల్సీ ఫలితాలపై సీఎం స్పష్టత నిచ్చారు.
ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఒక్క ఎమ్మెల్యేనూ వదలుకోమని, అందర్నీ గెలిపించుకుటామని అన్నారు. కానీ, ఎమ్మెల్యేలంతా క్రియాశీలకంగా ఉండాలని, సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకోవాలని సూచించారు. గడప గడపకు త్వరగా పూర్తి చేయాలని, నెలకు 25రోజులు సచివాలయాల్లో తిరగాలని, సెప్టెంబరు నుంచి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని సీఎం జగన్ ఉద్ఘాటించారు.
ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోనని, అందరితో పనిచేయించి గెలిపించుకునేందుకే ప్రయత్నాలు చేస్తానని, ఎవరు చేయాల్సిన పని వాళ్లు చేస్తే 175 సీట్లు గెలుస్తామంటూ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ భరోసా అందించారు.