గణనాధుని ఉత్సవాలపై 2 దశాబ్దాలుగా నిషేధం.. ఎన్ని సార్లు అనుమతి కోరినా నో అంటున్న అధికారులు.. కారణం ఏమిటంటే..?

| Edited By: శివలీల గోపి తుల్వా

Sep 15, 2023 | 11:27 AM

Kurnool District News: అన్ని పండుగలను ఏ ఇంట్లోని వారు ఆ ఇంట్లోనే జరుపుకున్నా.. వినాయక చివితిని మాత్రం ఊరు ఊరంతా ఏకమై ఆకాశాన్ని తలపించే పందిర్లు వేసి గ్రాండ్‌గా నిర్వహించుకుంటారు. వినాయక చవితి సందర్భంగా దేశంలోని ప్రతి చోటా ఇదే జరుగుతుంది. అయితే ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం వినాయక చవితిపై నిషేధం ఉంది. పండుగ ఉత్సవాలు జరుపుకుంటామని అనుమతి అడిగితే ఏ అధికారీ అంగీకరించడు. అసలు అక్కడ రెండు దశాబ్దాలుగా వినాయక చవితి సంబరాలు ఎందుకు నిషేధించబడ్డాయి..?ఉత్సవాలకు అసలు అనుమతులే ఎందుకు ఇవ్వడం లేదు..? తెలుసుకుందాం.. 

గణనాధుని ఉత్సవాలపై 2 దశాబ్దాలుగా నిషేధం.. ఎన్ని సార్లు అనుమతి కోరినా నో అంటున్న అధికారులు.. కారణం ఏమిటంటే..?
Vinayaka Chavithi Celebrations
Follow us on

కర్నూల్ జిల్లా, సెప్టెంబర్ 15: అది సెప్టెంబర్ 3, 2003వ సంవత్సరం. నంద్యాల జిల్లా ప్యాపిలి మండల కేంద్రంలో జోరుగా, ఉత్సాహంగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతోంది. అంతలోనే ఉన్నట్లుండి ఒక్కసారిగా అలజడి అల్లర్లు దాడులు చెలరేగాయి. ఒకరి ఆస్తులను మరొకరు ధ్వంసం చేసుకున్నారు. బైకులు, కార్లు, దుకాణాలను తగలబెట్టారు. ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే.. దళిత, అగ్ర వర్ణాల మధ్య విభేదాలు. ఈ విభేధాలే ఉత్సవాల్లో అల్లర్లకు ఆజ్యం పోశాయి. దళితులు ప్రతిష్టించిన వినాయక విగ్రహాలను అగ్ర వర్ణాలు ఉన్న వీధులలో తిప్పరాదని, దళితుల వీధులలోకి వెళ్లి బ్రాహ్మణులు పూజలు చేయరాదని అగ్రవర్ణాలు ఆగ్రహించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇదే విధంగా దళితులు కూడా కవ్వింపు చర్యలకు పాల్పడినట్లు అప్పట్లో జోరుగానే ప్రచారం సాగింది. ఉత్సవాలలో రెండు వర్గాల వారి మధ్య జరిగిన ఉద్రిక్తతలు, దాడులు నేపథ్యంలో.. అప్పటి ఉమ్మడి కర్నూలు జిల్లా ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది.

అక్కడకు వచ్చిన ఎస్పీ స్వయంగా గాలిలోకి కాల్పులు జరిపాడు అంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సాధారణంగా వినాయక చవితి ఉత్సవాలు అంటే పిల్లల నుంచి వృద్ధుల వరకు భక్తి భావంతో గంతులు వేస్తారు, చేయి చేయి జత కలుపుతారు. అన్నీ మరిచి చిందులేస్తారు. అలాంటి ఉత్సవం, సంబరాలు రెండు దశాబ్దాలుగా అక్కడ దూరమయ్యాయి. మరో సారి ఉద్రిక్తతలకు తావీయకూడదు అని అసలు అనుమతులనే రద్దు చేశారు అధికారులు. ఉత్సవాలను నిషేధించారు. కేవలం పండుగ మాత్రమే జరుపుకునేందుకు అనుమతి.

అయితే ఈ సారి అయినా వినాయక చవితి సందర్భంగా ఉత్సవాలకు, సంబరాలకు అనుమతులు ఇవ్వాలని ప్యాపిలి వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం అనుమతులు ఇచ్చేందుకు సాహసించడం లేదు. ప్రస్తుతం ప్యాపిలి ప్రశాంతంగా ఉంది, ఎలాంటి అల్లర్లు అలజడులు లేవు. దళితులు, అగ్రవర్ణాలు అనే బేధం లేకుండా అందరూ కలిసి మెలిసి ఉంటున్నారు. ఎక్కడా కూడా చిన్న అవాంఛనీయ సంఘటన రెండు దశాబ్దాలలో చోటు చేసుకోలేదు. ఇలాంటి పరిస్థితులలో ఉత్సవాల ద్వారా మళ్లీ విభేదాలకు తావియ్యకుండా చేసేందుకు.. పోలీసులు అంగీకరించడం లేదని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..