Konaseema Row: కోనసీమలో కుట్ర రాజకీయమా! అమలాపురంలో అగ్గి పెట్టిందెవరు?

Konaseema District Renaming Row: కోనసీమంటే కొబ్బరిచెట్లు.. పచ్చటి పంటపొలాలు.. సంక్రాంతొస్తే కోళ్లపందేలు, సరదాగా సాగే చతుర్ముఖోపారాయణాలు. అలాంటి ప్రశాంత గోదావరి సలసలా కాగుతోంది. మలమలా మాడుతోంది.

Konaseema Row: కోనసీమలో కుట్ర రాజకీయమా! అమలాపురంలో అగ్గి పెట్టిందెవరు?
Amalapuram Incident

Edited By:

Updated on: May 25, 2022 | 2:09 PM

Amalapuram Incident: కోనసీమంటే కొబ్బరిచెట్లు.. పచ్చటి పంటపొలాలు.. సంక్రాంతొస్తే కోళ్లపందేలు, సరదాగా సాగే చతుర్ముఖోపారాయణాలు. అలాంటి ప్రశాంత గోదావరి సలసలా కాగుతోంది. మలమలా మాడుతోంది. రాజకీయం తలుచుకుంటే నీళ్లలోనూ నిప్పు పుట్టించగలదు. అమలాపురం అరాచకం దీన్ని కళ్లకు కడుతోంది. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పేరుని జిల్లాకు పెడితే ఇంత నిరసన ఎందుకు? అందరి మెదళ్లనీ తొలిచేస్తున్న ప్రశ్న ఇది. ఎవరో నాయకుడు తన తండ్రిపేరో తాతపేరో పెడితే, వివాదాస్పద వ్యక్తులకు పెద్దపీట వేస్తే వ్యతిరేకత వస్తుంది. ఆగ్రహం పెల్లుబుకుతుంది. కానీ ఇప్పటికీ ఊరూవాడా నిలువెత్తు విగ్రహాలతో నివాళులు అందుకుంటున్న మహానుభావుడి పేరు పెడితే ఎందుకింత ప్రతిఘటన?

అమలాపురం విధ్వంసం ప్రమాదకర పెడధోరణులకు సంకేతం. కులమతాల మధ్య, సంఘటితంగా బతుకుతున్న ప్రజలమధ్య చిచ్చురేపే దుష్టప్రయత్నం. అంగన్‌వాడీలు ధర్నాకు దిగితేనో, ఉద్యోగులు నిరసనకు దిగుతామంటేనో ముందస్తు అరెస్టులతో మోహరించే పోలీసులు చేతులెత్తేసే పరిస్థితి ఎందుకొచ్చిందన్నదే ప్రశ్న. మంత్రి ఇంటికే మూక నిప్పుపెట్టింది. మరో ఎమ్మెల్యే ఇంటిని నిలువెల్లా తగలెట్టింది. జిల్లా పాలనా కేంద్రం కూడా విధ్వంసకారులకు లక్ష్యంగా మారింది. మంట చల్లారకుండా చూసేందుకు రాజకీయం తనవంతు ఆజ్యంపోస్తోంది.

అమలాపురం విధ్వంసం టీడీపీ-జనసేన కుట్రంటోంది అధికారపక్షం. అందరి ఆమోదంతో తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారన్నది వైసీపీ వెర్షన్‌. ఇక చీమ చిటుక్కుమన్నా రోడ్డెక్కుతున్న టీడీపీ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది. అమలాపురం విధ్వంసం అధికార పార్టీ స్పాన్సర్‌ చేసిందేనంటోంది. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ మర్డర్‌ ఎపిసోడ్‌ని పక్కదోవ పట్టించేందుకే కోనసీమలో వైసీపీ అగ్గి రాజేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణ చేశారు. అమలాపురం విధ్వంసం వెనుక పెద్ద కుట్రే ఉందని వైసీపీ చెబుతుంటే..పోలీసులు మాత్రం అప్పటికప్పుడు ఉద్రిక్తత చెలరేగిందంటున్నారు.

ఇవి కూడా చదవండి

దేశంలో స్వాతంత్య్రానికి పూర్వంనుంచీ ఉన్న ఊళ్లపేర్లే మారిపోతున్నాయి. తరాలుగా ఉన్న కట్టడాల పేర్లు మార్చాలనే డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. మసీదు-మందిర్‌లాంటి సున్నిత వివాదాలు సెగలు పుట్టిస్తున్నాయి. మొన్నటిదాకా జిల్లాకేంద్రాల విషయంలో ఏపీలో జరిగిన రగడ సద్దుమణుగుతున్న సమయంలో అమలాపురం రాజుకుంది. నిప్పు ఎవరు అంటించారో తెలియకుండా పోదు. అగ్గిపెట్టడం సులువే. కార్చిచ్చును ఆర్పేయడమే కష్టం. ఎవరికోసమో పెట్టే మంటలో ఏదోరోజు మనం కూడా మాడిపోతామన్న నిజాన్ని ఎవరూ మరిచిపోకూడదు.

-షఫీ, సీనియర్ జర్నలిస్ట్, టీవీ9 తెలుగు

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..