Andhra News: 2029 ఆస్ట్రోనాట్ అభ్యర్థి కైవల్యారెడ్డికి అభినందనలు వెల్లువ – ఇంతకూ ఎవరీ కైవల్యారెడ్డి..?
అవకాశం వస్తే ఆకాశమే తమకు హద్దు అంటున్నారు నేటి తరం యువతులు.. ఊహకందని రంగంలోకి అడుగుపెట్టి తమప్రతిభను కనబరుస్తున్నారు. అకుంఠిత దీక్ష పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమి లేదని అని నిరూపిస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి వ్యోమగామిగా ఎంపిక కాగా తాజాగా తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణానికి చెందిన కుంచాల కైవల్యారెడ్డి(17) 2029 లో టైటాన్ స్పెస్ ఇండస్ట్రీస్ సంస్థ చేపట్టబోయే అంతరిక్ష యాత్రకు ఎంపిక అయ్యారు.

ప్రతిష్టాత్మకమైన నాసా వ్యామగామి కావాలనే తన లక్ష్యం చేరుకునేందుకు నాసా అందెంచే ఇంటెర్నేషనోల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం ను తన 15 వ యేటనే పూర్తి చేశారు. ఈ కోర్స్ కు ప్రపంచ వ్యాప్తంగా 50 మందిని ఎంపిక చేస్తారు . 2023 లోనే ఈ కోర్స్ కి ఎంపిక అయిన కైవల్యా రెడ్డి విజయవంతంగా ఈ కోర్స్ ను పూర్తి చేశారు. వ్యోమగామి కావాలనే ఆమె లక్ష్యం దిశలో నాసా కోర్సు పూర్తి చేసి ఒక అడుగు ముందుకేసింది. నాసా అందిస్తున్న ఐఏఎస్పీ (ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్) కోర్సును పిన్న వయస్సులోనే విజయవంతంగా పూర్తి చేసింది కైవల్యారెడ్డి. ఔత్సాహిక విద్యార్థులను ప్రోత్సహించేందుకు అమెరికాలోని ఎ స్పేస్ అండ్ రాకెట్ సెంటర్, నాసా సంయుక్త ఆధ్వర్యంలో ఏటా నవంబర్లో ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం (ఐఏఎస్పీ) శిక్షణ అందిస్తోంది.
విద్యార్థులకు 10 రోజుల పాటు వ్యోమగామికి సంబంధించిన పలు ఆంశాలపై అవగాహన కల్పించ డంతో పాటు శిక్షణ ఇస్తారు. 2023లో భారత్ నుంచి ఎంపికైన వారిలో కైవల్యరెడ్డి కూడా ఒకరు. ఆమె తన ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువున్నపుడే ఈ కోర్స్ పూర్తి చేసి అతి చిన్న వయసులో ఐఏఎస్పీకి ఎంపికై శిక్షణ పూర్తి చేస్తున్న భారతీయురాలిగా రికార్డు సైతం నమోదు చేసింది. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు ముందస్తుగా ఇచ్చే శిక్షణను నాసా ద్వారా అందించారు. ఇందులో భాగంగా సొంతంగా విమానం నడపడం, మల్టీ యాక్సెస్ ట్రైనింగ్, జీరో గ్రావిటీ, స్కూబా డైవింగ్ తదితర ఆంశాలల్లో కైవల్య శిక్షణ తీసుకుంది.
అంతరిక్ష పరిశోధన రంగంలో ఏపీ తరఫున చిన్న ప్రాయంలోనే గుర్తింపు తెచ్చుకున్న కైవల్యరెడ్డిని పలువురు ప్రముఖులు అభినందించారు. కైవల్య రెడ్డి ఇటీవల అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ అస్ట్రానమి, ఆస్ట్రో ఫిజిక్స్ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆన్లైన్ ప్రతిభా పోటీలలో కైవల్యరెడ్డి మూడు రౌండ్లలో ప్రతిభ కనబరిచి సిల్వర్ సాధించింది. వ్యోమగామి కావడమే లక్ష్యంగా నాసా ఐఏఎస్పీ కోర్సును విజయవంతంగా పూర్తి చేశాను అని తన లక్ష్యానికి ఇది తొలి మెట్టు అని.. ఈ స్ఫూర్తితో భవిష్యత్లో ఖగోళ శాస్త్రవేత్తగా ఎదగాలన్నదే తన లక్ష్యమని కైవల్యారెడ్డి చెప్పుకొచ్చింది. ఆమె కృషిని అభినందిస్తూ ప్రభుత్వం నుంచి రూ.6.70 లక్షలు మంజూరు చేసింది.
అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ సంస్థ 2029లో చేపట్టబోయే అంతరిక్ష యాత్రలో ఆస్ట్రోనాట్ అభ్యర్థిగా ఎంపికైన సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆమెను అభినందిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కైవల్య రెడ్డి సాధన తూర్పు గోదావరి జిల్లా మాత్రమే కాకుండా రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. అంతరిక్ష రంగంలో మహిళగా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం అభినందనీయమని పేర్కొన్నారు. కైవల్య రెడ్డి భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ కలెక్టర్ కీర్తి చేకూరి శుభాకాంక్షలు తెలియజేశారు.
కైవల్యారెడ్డి ప్రస్తుతం ఇంటర్ మీడియట్ పూర్తి చేశారు . ఆమె తండ్రి శ్రీనివాస్ రెడ్డి సమిశ్రీ గూడెం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు . తల్లి విజయలక్ష్మి గృహిణి. తమ్ముడు తపస్వి రెడ్డి ప్రస్తుతం 8 వతరగతి చదువుతున్నాడు. ఆమె జర్మనీలో డిగ్రీ ఆస్ట్రో ఫిజిక్స్ అభ్యసించాలని భావిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
