AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్కూల్‌లో ఉపాధ్యాయురాలి వింత ప్రవర్తణ.. విద్యార్థులు పేరెంట్స్ ఏం చేశారంటే?

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు వారిపై దుర్భాషలాడుతూ, అసభ్యంగా ప్రవర్తిస్తుండటం స్టార్ట్ చేసింది. ఈ విషయం తెలిసిన విద్యార్థుల పేరెంట్స్.. ఇదేంటని ప్రశ్నించడానికి వస్తే వారిపై కూడా దాడికి ప్రయత్నించింది. దీంతో విసిగిపోయిన తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేసి నిరసనకు దిగిన ఘటన కడప జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.

స్కూల్‌లో ఉపాధ్యాయురాలి వింత ప్రవర్తణ.. విద్యార్థులు పేరెంట్స్ ఏం చేశారంటే?
Kadapa School Protest
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Aug 25, 2026 | 8:34 PM

Share

కడప జిల్లా రాజంపేట మండలం గుండ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రశాంతి అనే ఉపాధ్యాయురాలు హిందీ పండిట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆమె విద్యార్థులతో పాటు తోటి ఉపాధ్యాయులతో సైతం తీవ్ర అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. విద్యార్థులను దూషించడమే కాకుండా వారిపై చేయి చేసుకుంటున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

పాఠాలు సరిగ్గా చెప్పకుండా పిల్లలను అసభ్య పదజాలంతో తిడుతున్న విషయాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన తల్లిదండ్రులపై కూడా ఆ ఉపాధ్యాయురాలు దాడికి దిగినట్లు తెలిసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు పాఠశాల గేటుకు తాళం వేసి బైఠాయించారు. సదరు ఉపాధ్యాయురాలిపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు తాళాలు తీసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

గతంలోనూ వివాదాలు:

సదరు టీచర్ ఇలా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదని స్థానికులు చెబుతున్నారు. గతంలో తోటి ఉపాధ్యాయులతో గొడవపడి వారిపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తనను వేధిస్తున్నారంటూ గతంలో ఫిర్యాదు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. గత ఎనిమిది నెలలుగా పాఠశాలలో ఇలాంటి ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పటికీ, ఉన్నతాధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే పరిస్థితి ఇక్కడివరకు వచ్చిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని వివరణ కోరగా.. ప్రశాంతి తోటి ఉపాధ్యాయులతో సఖ్యతగా ఉండటం లేదని తెలిపారు. నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని సూచిస్తే తమపైనే తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us