Janasena About Raghu Ramakrishna: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఏపీ ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన నేతలందరూ మూకుమ్మడిగా ఖండించారు. ఇక తాజాగా జనసేన పార్టీ కూడా రఘు రామకృష్ణ విషయంలో ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండించింది. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నరసాపురం ఎం.పి. శ్రీ రఘు రామకృష్ణ రాజు విషయంలో వ్యవహరించిన తీరును ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ గర్హించాలన్నారు. ప్రజలు ఎన్నుకున్న చట్టసభ సభ్యుడి పట్ల అధికారుల తీరును జనసేన పార్టీ ఖండిస్తోందని తెలిపారు. డా. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి లోబడి వ్యవహరించడం అధికారుల బాధ్యత అని.. ఒక ఎం.పి. కావచ్చు ఒక సాధారణ పౌరుడు కావచ్చు.. ఎవరి పట్లా విచారణ పేరుతో అనుచితంగా వ్యవహరించకూడదని చట్టం చెబుతోందని పేర్కొన్నారు. రఘు రామకృష్ణ రాజుకి లోక్ సభ సభ్యుడిగా ఉండే హక్కులను కాలరాసినట్లు అర్థం అవుతోంది. ఒక లోక్ సభ సభ్యుడి విషయంలోనే హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు అంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రఘు రామకృష్ణ రాజు విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును లోక్ సభ స్పీకర్ సుమోటోగా తీసుకొని విచారణకు ఆదేశించాలని జనసేన పార్టీ కోరుతుందన్నారు. బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ గా లోక్ సభ స్పీకర్ గుర్తించాలని.. ఇందుకు కారకులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకొనే విశేష అధికారం పార్లమెంటుకు ఉందని వివరించారు. ఈ అధికారాన్ని ఉపయోగించకపోతే చట్ట సభలకు ఉన్న ప్రాధాన్యత, విశిష్టతకు భంగం వాటిల్లే అవకాశం ఉందని తెలిపిన నాదేండ్ల… ఈ అంశాలపై పార్లమెంట్ సభ్యుల సహకారంతో లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారికి జనసేన లేఖ రాస్తుందని చెప్పుకొచ్చారు.
Also Read: భోజనం చేశాక ఈ పనులు అస్సలు చేయకూడదు..! చాలా డేంజర్.. తెలుసుకోండి..?