AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: సర్పంచ్‌గా ఏకగ్రీవం చేయండి.. గ్రామానికి రూ.70 లక్షలు ఇస్తా!

సర్పంచ్‌గా తన భార్యను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ.70 లక్షలు విరాళంగా ఇస్తానని కడప జిల్లా రాయవరం గ్రామానికి చెందిన జనసేన నేత లక్ష్మీనారాయణ ప్రకటించారు. తన భార్య తుమ్మల వెంకటలక్ష్మిని సర్పంచ్‌గా ఎన్నుకోవాలని గ్రామస్తులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఈ ప్రతిపాదనపై గ్రామంలో ఆసక్తికర చర్చ మొదలైంది.

Andhra: సర్పంచ్‌గా ఏకగ్రీవం చేయండి.. గ్రామానికి రూ.70 లక్షలు ఇస్తా!
Lakshmi Narayana Venkata La
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Nov 13, 2026 | 1:14 PM

Share

పురపోరు ముగిసింది.. ఇక పంచాయతీ పోరుకు రంగం సిద్ధమవుతోంది. గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలవుతుండగా.. అప్పుడే ఏకగ్రీవాల కోసం నేతలు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం.. సమస్యలు పరిష్కరిస్తాం అనే హామీలకు భిన్నంగా ఓ నేత ఏకంగా రూ.70 లక్షల బంపర్ ఆఫర్ ప్రకటించారు. తన భార్యను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ.70 లక్షలు విరాళంగా ఇస్తానని ప్రకటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

భార్యను సర్పంచ్‌గా ఏకగ్రీవం చేయండి..

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని టి.సుండుపల్లి మండలం రాయవరం గ్రామంలో ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జనసేన పార్టీకి చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి గ్రామ ప్రజల ముందు ఈ ప్రతిపాదన ఉంచారు. తన సతీమణి తుమ్మల వెంకటలక్ష్మిని సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే.. గ్రామాభివృద్ధి కోసం రూ.70 లక్షలు విరాళంగా అందిస్తానని ప్రకటించారు. గ్రామపంచాయతీకి వచ్చే సాధారణ నిధులతో పాటు తాను ఇచ్చే రూ.70 లక్షలతోనూ గ్రామాన్ని అభివృద్ధి చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఈ మొత్తాన్ని వినియోగిస్తానని హామీ ఇచ్చారు.

నాలుగుసార్లు పోటీ.. మరోసారి బరిలోకి!

లక్ష్మీనారాయణ గతంలో నాలుగుసార్లు సర్పంచ్ పదవికి పోటీ చేసినట్లు తెలిపారు. మరోసారి ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈసారి తన భార్యను అభ్యర్థిగా నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు. గెలుపోటముల కంటే గ్రామాభివృద్ధే ముఖ్యమని, గ్రామం కోసం ఆలోచించే ప్రతి ఒక్కరూ తన ప్రతిపాదనకు సహకరించాలని కోరారు. తన ఆఫర్‌కు గ్రామస్తులంతా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. తన భార్య తుమ్మల వెంకటలక్ష్మిని ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకుంటే ఇచ్చిన మాట ప్రకారం రూ.70 లక్షల విరాళాన్ని అందజేస్తానని స్పష్టం చేశారు.

గ్రామస్తులు ఎలా స్పందిస్తారో?

సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేస్తే గ్రామానికి రూ.70 లక్షల అదనపు నిధులు వస్తాయన్న లక్ష్మీనారాయణ ప్రతిపాదన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఆఫర్‌పై గ్రామస్తులు ఎలా స్పందిస్తారు? ఇతర రాజకీయ పార్టీల నేతలు, ఆశావహులు ఏ విధంగా వ్యవహరిస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. చివరకు రాయవరం పంచాయతీలో ఏకగ్రీవం సాధ్యమవుతుందా? లేక ఎన్నికల పోరు తప్పదా? అనేది వేచి చూడాలి.

Follow Us