Pawan Kalyan: అలాంటి పాలకుడు కోటలో ఉన్నా, పేటలో ఉన్నా ఒకటే.. సీఎం జగన్‌పై పవన్‌ కల్యాణ్‌ విసుర్లు

జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ తాడేపల్లి ఘటనపై స్పందించారు. అంధురాలి హత్య పూర్తిగా శాంతి భద్రతల వైఫల్యమేనని మండిపడ్డారు. 'రాష్ట్రంలో ఆడబిడ్డలకు అసలు రక్షణ ఉందా?.. సీఎం నివాసం దగ్గరలోనే ఘాతుకాలు జరిగినా మౌనమేనా? అని ప్రశ్నించారు.

Pawan Kalyan: అలాంటి పాలకుడు కోటలో ఉన్నా, పేటలో ఉన్నా ఒకటే.. సీఎం జగన్‌పై పవన్‌ కల్యాణ్‌ విసుర్లు
Cm Jagan, Pawan Kalyan

Updated on: Feb 13, 2023 | 9:23 PM

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఎన్టీఆర్‌ కట్ట ప్రాంతంలో ఓ యువతి దారుణ హత్యకు గురైన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. సీఎం జగన్‌ నివాసానికి సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న అంధురాలైన యువతిపై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే లోగా ప్రాణాలు కోల్పోయింది. కాగా నిందితుడు గంజాయి మత్తులోనే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలో జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ తాడేపల్లి ఘటనపై స్పందించారు. అంధురాలి హత్య పూర్తిగా శాంతి భద్రతల వైఫల్యమేనని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో ఆడబిడ్డలకు అసలు రక్షణ ఉందా?.. సీఎం నివాసం దగ్గరలోనే ఘాతుకాలు జరిగినా మౌనమేనా? అని ప్రశ్నించారు. తాడేపల్లి అసాంఘిక శక్తులకు, గంజాయి, మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారిపోయిందని దుయ్యబట్టారు పవన్.

దిశా చట్టం ఏమైపోయింది?

‘ ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసానికి సమీపంలో అంధ యువతి హత్యకు గురైన ఘటన కలిచివేసింది. కంటి చూపునకు నోచుకోని ఆ యువతిని వేధింపులకు గురిచేసి కిరాతకంగా నరికి చంపిన మృగాడిని కఠినంగా శిక్షించాలి. గంజాయి మత్తులో సదడు వ్యక్తి నేరానికి ఒడిగట్టాడని, గతంలోనూ పోలీసులపైనా, మహిళలపైనా దాడులకు తెగబడ్డాడని పోలీసులు చెబుతున్నారు. ఈ హత్యను శాంతిభద్రతల వైఫల్యంగా చూడాలి. ముఖ్యమంత్రి ఇంటి పరిసరాల్లో పటిష్టమైన పోలీసుల పహారా, నిఘా వ్యవస్థలు పనిచేస్తాయి. అయినా తాడేపల్లి ప్రాంతం అసాంఘిక శక్తులు, గంజాయికి అడ్డాగా మారింది. అంటే లోపం ఎక్కడుంది? ఏడాదిన్నర క్రితం ఆ ప్రాంతంలోనే ఓ యువతి అత్యాచారం చేసిన ఘటనలో నిందితుల్ని ఒకరిని ఇప్పటికీ పట్టుకోలేకపోయారంటే వైఫల్యం ఎవరిది? తన నివాస పరిసరాల్లో పరిస్థితులను సమీక్షించుకుండా మౌనంగా ఉండే పాలకుడు కోటలో ఉన్నా, పేటలో ఉన్నా ఒకటే. పోలీసు శాఖకు అవార్డులు వచ్చాయి, దిశా చట్టం చేశామని చెప్పుకోవడమే తప్ప రాష్ట్రంలో ఆడబిడ్డలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి’ అని పవన్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్  చేయండి..