నాగబాబు కోసం పవన్ కల్యాణ్ సరికొత్త గేమ్ ఫ్లాన్.. మంత్రి పదవికి బదులు ఎంపీ పదవి..!

రాజ్యసభ వచ్చేలోపు కేబినెట్ హోదా ఉండే కార్పొరేషన్ పదవిని నాగబాబుకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రం మొత్తం తిరుగుతూ, పర్యావరణానికి అనుకూలంగా ఉండే పదవిని నాగబాబుకు ఇవ్వమని ముఖ్యమంత్రి చంద్రబాబును పవన్ కళ్యాణ్ కోరినట్టు సమాచారం. త్వరలో ఈ విషయంలో స్పష్టత రానుంది.

నాగబాబు కోసం పవన్ కల్యాణ్ సరికొత్త గేమ్ ఫ్లాన్..  మంత్రి పదవికి బదులు ఎంపీ పదవి..!
Chandrababu Nagababu Pawan Kalyan

Edited By:

Updated on: Mar 05, 2025 | 8:54 AM

మెగా బ్రదర్ నాగబాబుకు ముఖ్యమైన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరిక మేరకు ఆయన్ను ఎమ్మెల్సీని చేసి కేబినెట్‌లోకి తీసుకోవాలని భావించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల్లో ఒక స్థానం ఇస్తారనుకున్నారు. మారిన పరిస్థితులతో నాగబాబుకు కేబినెట్‌ హోదా ఉండే కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి అయితే బావుంటుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎంపీ పదవి వచ్చేలోపు.. రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించేలా కీలకమైన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవిలో నియమించనున్నట్లు సమాచారం.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక కీలక రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. ఆయన సోదరుడు నాగబాబు ఎమ్మెల్సీ కాకుండా రాజ్యసభకు పంపాలనే నిర్ణయానికి వచ్చారు. మొదట ఆయనకు ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని కూటమి అంగీకరించినా, పవన్ తన ఆలోచన మార్చుకున్నారు. భవిష్యత్ రాష్ట్ర రాజకీయ సమీకరణలను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పార్టీ భవిష్యత్ వ్యూహాన్ని దృష్టిలో ఉంచుకుని, ముఖ్యంగా జనసేనకు సామాజిక సమతుల్యతను అందించేందుకు ఈ మార్పు అవసరమని పవన్ భావించినట్టు తెలుస్తోంది.

ఖాళీ అయిన ఎంపీ స్థానంలో..

గతంలోనూ నాగబాబు రాజ్యసభ స్థానాన్ని ఆశించారు. కానీ అప్పటి పరిస్థితులు అనుకూలించకపోవడంతో, ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మంత్రివర్గంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మరో మలుపు తిరిగాయి. రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారాయి. ఇటీవల వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తారనేనే ప్రచారం మొదలైంది. అయితే జనసేన వర్గాల్లో మాత్రం నాగబాబుకు ఆ అవకాశం ఇవ్వాలనే వాదన బలంగా వినిపిస్తోంది.

సీఎంకు వివరించిన పవన్

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన తుది నిర్ణయం తీసుకున్నారు. నాగబాబును ఎమ్మెల్సీ కాకుండా రాజ్యసభలోనే కొనసాగించడం బెటర్ అని భావించారు. కూటమిలోని ఇతర పార్టీలకు కూడా ఈ నిర్ణయాన్ని పవన్ తెలియచేసినట్టు సమాచారం. ఇదే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్చించినట్లు తెలుస్తోంది. ఒకవేళ నాగబాబు కు రాజ్యసభ స్థానం ఇస్తే, ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీకి కేటాయించే అవకాశాలను కూటమి పరిశీలిస్తోంది.

త్వరలో ఈ విషయంలో స్పష్టత రానుంది. కూటమి సమావేశంలో ఎవరు రాజ్యసభకు వెళ్తారో తేలిపోనుంది. కానీ ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం నాగబాబును రాజ్యసభకే పంపాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. జనసేన భవిష్యత్ రాజకీయ వ్యూహానికి ఇది కీలక మలుపుగా మారనుంది.

ఈలోపు కార్పొరేషన్ చైర్మన్ పదవి

రాజ్యసభ వచ్చేలోపు కేబినెట్ హోదా ఉండే కార్పొరేషన్ పదవిని నాగబాబుకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రం మొత్తం తిరుగుతూ, పర్యావరణానికి అనుకూలంగా ఉండే పదవిని నాగబాబుకు ఇవ్వమని ముఖ్యమంత్రి చంద్రబాబును పవన్ కళ్యాణ్ కోరినట్టు సమాచారం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..