
అమరావతి, ఆగస్ట్ 26: పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్యకొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మంగళవారం (ఆగస్ట్ 26) ఉదయం నాటికి అల్పపీడనంగా మారింది. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడినట్లు APSDMA ప్రకటన వెలువరించింది. ఇది రాబోయే 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.
శ్రీకాకుళంజిల్లా కేంద్రంలో సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. ఆర్టీసీ కాంప్లెక్స్, రైతు బజార్,పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇలిసిపురం జంక్షన్, ఫారెస్ట్ ఆఫీస్, బొందిలిపురం రోడ్ లలో మోకాళ్ళ లోతులో రోడ్లపై నీరు ప్రవహిస్తుంది. ఇక ఈ రోజు కూడా శ్రీకాకుళంతోపాటు విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
అల్లూరి జిల్లా ఏజెన్సీలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడి వాగులు పొంగి పొర్లుతున్నాయి. జలపాతాలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో జలపాతాల వద్ద అధికారులు ఆంక్షలు విధించారు. ముందు జాగ్రత్త చర్యగా చాపరాయి జలపాతం, సరియా జలపాతలకు టూరిస్టుల సందర్శనకు నిషేధం విధించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.