ఇద్దరు అధికారుల సస్పెండ్‌కు కారణమైన ఎలుకలు..! ఎలాగంటే..?
ఎలుకల బెడదతో ముగ్గురు విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. పదేపదే ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. 20 మంది విద్యార్థులు వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు. పాఠశాల నిర్వహణలోని నిర్లక్ష్యాన్ని ఈ ఘటన బట్టబయలు చేసింది. విద్యార్థుల తల్లిదండ్రులు మెరుగైన సౌకర్యాల కోసం డిమాండ్ చేస్తున్నారు.

ఎలుకలు ఓ ఇద్దరు అధికారుల సస్పెండ్‌కు కారణం అయ్యాయి. అయ్యో పాపం.. అనుకునేరు. నిజానికి వారి సస్పెండ్ వెనుక ఎలుకల కంటే కూడా వారి నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా నిలిచింది. అసలు విషయం ఏంటంటే.. ఉండవల్లి మండలంలోని మహాత్మా జ్యోతిభా ఫూలే గురుకులానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఎలుకలు కుట్టడంతో ఆస్పత్రిలో చేరారు.
ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో ఎలుకల బెడద గురించి విద్యార్థులు పదేపదే ఫిర్యాదు చేసినప్పటికీ వారి ఆందోళనలను పట్టించుకోకపోవడంతో నిర్లక్ష్యం బయటపడింది. ఎలుకల సమస్యతో పాటు దాదాపు 20 మంది విద్యార్థులు వైరల్ జ్వరాలతో అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం విద్యార్థులు ప్రాథమిక సౌకర్యాలు, సరైన పారిశుద్ధ్యం డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు, అయినప్పటికీ సిబ్బంది ఎటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. తనిఖీ తర్వాత, జిల్లా కలెక్టర్ బి సంతోష్ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసి, మరో ముగ్గురు సిబ్బందికి మెమోలు జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటికైనా విద్యార్థులను ఎలుకల బెదడ నుంచి రక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
