అదో ఏజెన్సీ ప్రాంతం.. ఏజెన్సీలో ఎన్ని జలపాతాలు ఉన్నా అది కాస్త ప్రత్యేకం. ఎందుకంటే.. కాలాలతో సంబంధం లేకుండా పుష్కలంగా నీరు.. అది కూడా అత్యంత శీతలమైన జలం.. అందులో దిగితే గడ్డ కట్టేస్తామా అన్నంతగా ఉంటుంది ఆ చల్లదనం. అందుకే దాన్ని ఐస్ గడ్డ జలపాతం అని పేరు. పర్యాటకులను ఎట్రాక్ట్ చేస్తున్న ఐస్ గడ్డ జలపాతం విశేషాలను ఈ రోజు తెలుసుకుందాం..
ప్రకృతి సహజ సిద్ధ అందాలకు కేరాఫ్ అల్లూరి ఏజెన్సీ. ఎత్తైన కొండలు, లోయలతో పాటు జలపాతాలు ఈ ప్రాంతానికి మరింత వన్నె తెచ్చాయి. ముఖ్యంగా పాడేరు ఏజెన్సీలో.. జలపాతాల సోయగాలు అన్ని ఇన్నికావు. ఏజెన్సీలో ఎన్ని జలపాతం ఉన్న ఆ జలపాతం ప్రత్యేకతే వేరు. అదే ఐస్ గడ్డ జలపాతం.
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం సీలేరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఐస్ జలపాతం. ఈ జలపాతం లో నీరు ఏడాది పొడవునా ఉంటాయి. వేసవికాలంలో చాలా జలపాతాల్లో నీరు ఎండిపోతున్నా.. ఇక్కడ మాత్రం నీరు జలజలా జారుతూనే ఉంటుంది. అందులోకి దిగితే.. గడ్డ కట్టేంత చల్లగా ఉంటుంది. అందుకే దానికి ఐస్ గడ్డ జలపాతం అని పేరు వచ్చింది. ఒకసారి దిగితే అక్కడ నుంచి మరి తిరిగి రావాలనిపించదు. కానీ.. ఐటిడిఏ పర్యటక శాఖ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే.. పర్యటనకు మరింత సౌలభ్యంగా ఉంటుందంటున్నారు స్థానికులు.
ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో ఉన్న ఈ జలపాతం విశాఖ నుంచి చింతపల్లి, జీకే వీధి మీదుగా భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిలో ఉంది. సాధారణ సమయంలో ఇక్కడ అడపాదడపా పర్యాటకులు వస్తూనే ఉంటారు. కానీ కార్తీక మాసంలో ఈ జలపాతం వద్ద పర్యాటకుల సందడి విపరీతంగా పెరిగిపోతుంటుంది. ఏఓబి లో ఉండడంతో పాటు రెండు రాష్ట్రాల నుంచి.. తెలంగాణ వెళ్లే ప్రయాణికులు కూడా ఇక్కడ కాసేపు ఆగి సేద తీరి తిరిగి వెళుతూ ఉంటారు. ఇదండీ అల్లూరి ఏజెన్సీలో ఐస్ గడ్డ జలపాతం విశేషాలు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..