Paladu: ఖాకీ కొడుకు ఆకృత్యానికి.. ఐదుగురు బలి.. అతని నేరాల చిట్టా చూస్తే..

పల్నాడు జిల్లా చిలకలూరిపేట జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం వెనుక దోపిడీ కుట్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ట్రాక్టర్ ట్రాలీని బెదిరించి డబ్బులు దోచుకునే ప్రయత్నంలో హైవేలో కారు అడ్డుగా నిలపడంతో ప్రమాదం జరిగి ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో డీఎస్పీ కార్యాలయంలో పనిచేసే ఏఎస్ఐ కుమారుడు వెంకట్ నాయుడుతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Paladu: ఖాకీ కొడుకు ఆకృత్యానికి.. ఐదుగురు బలి.. అతని నేరాల చిట్టా చూస్తే..
Venkat Naidu

Edited By: Ram Naramaneni

Updated on: Dec 13, 2025 | 7:41 PM

జల్సాలకు అలవాటు పడ్డాడు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ పద్దతుల్లో దోచుకోవడం రివాజుగా మార్చుకున్నాడు. ఏం చేసినా ఎవరూ ఏం చేయలేరన్న ధీమా పెరిగింది. వరసగా ఆకృత్యాలకు పాల్పడినా పోలీసులకు చిక్కకపోవడంతో మరింత ధైర్యం వచ్చింది. దీంతో హైవేపై దోపిడికి వేసిన ప్లాన్ వికటించి ఐదుగురు విద్యార్ధుల ప్రాణాలు తీసింది. దీంతో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు సహరించిన వారిని కూడా కటకటాల వెనక్కి పంపించారు.

ఈ నెల నాలుగో తేదిన రాత్రి ఏడు ఎనిమిది గంటల సమయంలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు ట్రాక్టర్ల లోడ్‌తో వెలుతున్న ట్రాలీని వెనక నుండి కారు వేగంగా ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్ధుల్లో నలుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇంకొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మొదట ఈ ప్రమాదం కారు అతి వేగంగా రావడంతో జరిగిందని భావించారు. అయితే  ఆ తర్వాత RTA వాళ్లు ట్రాలీని హైవేపై నిలిపివేయడంతో ప్రమాదం చోటు చేసుకుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో రవాణా శాఖాధికారులు రంగంలోకి దిగి ట్రాలీని నిజంగా హైవేపై ఆపారా.. ఆపితే ఎవరూ ఆపారంటూ పల్నాడు జిల్లా డిటివో సంజీవ్ కుమార్ వివరాలు సేకరించారు. ఈ దర్యాప్తులో తమ శాఖకు చెందిన ఉద్యోగులెవరూ ట్రాలీని ఆపలేదని… సిసి కెమెరాల్లో రికార్డైన కారు నంబర్ కూడా తమ ఉద్యోగులది కాదని చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.  సిసి కెమెరా విజువల్స్ పరిశీలించగా ట్రాలీకి ఛేజ్ చేసి వచ్చిన కారులోని వ్యక్తులు ట్రాలీని ఆపుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. ట్రాలీ పక్కకు తీసే సమయంలోనే సడన్ బ్రేక్ వేయడం ఆ తర్వాత ప్రమాదం జరగడం వెంటనే వెంటనే చోటుచేసుకున్నాయి.

దీంతో ఆ ముందు వచ్చిన కారులో ఉన్న వాళ్లు ఎవరా అని పోలీసులు ఆరా తీశారు. ఈ దర్యాప్తులో కారులో ఉన్న వ్యక్తి వెంకట్ నాయుడు నర్సరావుపేట డిఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్న ఏఎస్ఐ శ్రీనివాస్ కొడుకుగా తేల్చారు. అతనితో పాటు మరో నలుగురు వ్యక్తులు కారులో ఉన్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసకొని ప్రశ్నించగా ట్రాక్టర్ల ట్రాలీ వారిని బెదిరించి డబ్బు దోపిడి చేయాలని ప్లాన్ వేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే ట్రాలీని వెంబడించిన వెంకట్ నాయుడు ముఠా హైవేలో కారు నిలిపివేసింది. అయితే వెంకట్ నాయుడు గతంలోనే అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తక్కువ ధరకే బంగారం ఇస్తానంటూ నలభై లక్షల రూపాయలతో ఉడాయించిన కేసులోనూ వెంకట్ నాయుడు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇవే కాకుండా నకిలీ ఆర్టివో అధికారుల పేరుతో హైవేలో వాహానాలు ఆపి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నారు. ట్రాలీని ఆపడానికి వినియోగించిన కారును కూడా దొంగలించారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ ముఠా అక్రమాలపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదం కేసులో అరెస్ట్ చేశామని తర్వాత పోలీస్ కస్టడికీ తీసుకొని ఇతర ఆరోపణలపై దర్యాప్తు చేస్తామని నర్సరావుపేట ఇంఛార్జి డిఎస్పీ హనుమంతరావు తెలిపారు. ఐదుగురు విద్యార్ధుల మరణానికి కారణమైన వెంకట అనుజ్న నాయుడు, మహేష్, గోపి, నబీ బాషా, వెంకట రావు అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Police With Accused