Andhra Pradesh: జిల్లా పేరు మార్పు వివాదం అమలాపురంలో హైటెన్షన్ క్రియేట్ చేసింది. ప్రశాంతంగా ఉండే అమలాపురం ఒక్కసారిగా అట్టుడుకిపోయింది. అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల తలలు పగిలాయి, వాహనాలు ధ్వంసమయ్యాయి. స్వయంగా జిల్లా ఎస్పీ రంగంలోకి దిగినా పరిస్థితి అదుపులోకి రాలేదు. నిరసనకారుల రాళ్ల దాడిలో 20 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. ఈ ఘర్షణలో అమలాపురం డీఎస్పీ సొమ్మసిల్లిపడిపోయారు. ఎస్పీ గన్‌మెన్, ఎస్సై, సీఐకి తీవ్ర గాయాలయ్యాయి.
కోనసీమ జిల్లా పేరు మార్చవద్దని చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కోనసీమ జిల్లా పేరును అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చుతూ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, దీన్ని వ్యతిరేకిస్తూ కోనసీమ సాధన సమితి భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు వందల సంఖ్యలో జనాలు రోడ్లపైకి తరలిరావడంతో పరిస్థితి అదుపు తప్పింది. కలెక్టరేట్ ముట్టడికి యువకులు, నిరసనకారులు ప్రయత్నించారు. కోనసీమే ముద్దు, వేరే పేరు వద్దని యువకులు నినాదాలు చేశారు.
ఇక, జిల్లా పేరు మార్చవద్దని డిమాండ్ చేస్తూ కోనసీమ సాధన సమితి ర్యాలీకి పిలుపివ్వడంతో అమలాపురంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అమలాపురాన్ని అష్టదిగ్బంధం చేశారు. పట్టణంలో ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి నిరసనకారులను నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయినప్పటికీ తగ్గని నిరసనకారులు అమలాపురం కలశం నుంచి కలెక్టరేట్ వరకు కోనసీమ సాధన సమితి ర్యాలీ నిర్వహించింది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అమలాపురం కలెక్టరేట్ వద్ద స్కూల్ బస్సు దగ్ధం చేశారు నిరసనకారులు. అలాగే, పోలీసులు ఏర్పాటు చేసిన టెంట్ లకు నిప్పు పెట్టారు.