AP News: ఏనుగుల తరలింపు ఇక లేనట్లేనా? అధికారుల ప్రతిపాదనలు అందుకేనా?
పార్వతీపురం మన్యం జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పినట్లే చెప్పి ఇప్పుడు వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ కుంకీ ఏనుగుల ప్రతిపాదన ఏమైంది? జిల్లాలో ఏనుగులు శాశ్వతంగా ఉండటం ఏంటి? అనుకుంటున్నారా? అయితే ఇది చూడండి.
పార్వతీపురం మన్యం జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పినట్లే చెప్పి ఇప్పుడు వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తుంది. కుంకీ ఏనుగుల సహాయంతో ఏనుగులను శాశ్వతంగా జిల్లా నుండి పంపిస్తారని అంతా అనుకుంటే అధికారులు మాత్రం జిల్లాలోనే ఏనుగులను శాశ్వతంగా ఉంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఏనుగులను తమ జిల్లా నుండి ఇతర ప్రాంతానికి ఎప్పుడు తరలిస్తారో అని ఎదురుచూపులు చూసిన జిల్లావాసులకు అధికారుల ప్రతిపాదనలు ఇప్పుడు షాక్ ఇస్తున్నాయమే చెప్పాలి. ఇంతకీ కుంకీ ఏనుగుల ప్రతిపాదన ఏమైంది? జిల్లాలో ఏనుగులు శాశ్వతంగా ఉండటం ఏంటి? అనుకుంటున్నారా? అయితే ఇది చూడండి.
పార్వతీపురం మన్యం జిల్లాలో జిల్లా వాసులను ఏనుగుల సమస్య ఏళ్ల తరబడి వేధిస్తుంది. ఏనుగుల సమస్యతో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. ఏనుగుల గుంపు సంచారంతో స్థానికులకు కంటి మీద కునుకు ఉండటం లేదు. ఇంట్లో నుండి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. సాయంత్రం ఐదు అయితే గ్రామాల్లో ఆందోళన మొదలవుతుంది. ఏనుగులు గుంపు ఎప్పుడు ఎటు వచ్చి ఎవరి పై దాడి చేస్తుందో తెలియని పరిస్థితి. చీకటి పడుతుందంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని భయానక వాతావరణం. అర్థరాత్రి గ్రామాల్లోకి ప్రవేశించి పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురి చేస్తుంది ఏనుగుల గుంపు.. ఏనుగుల ఘీంకారాలతో ఇంట్లో నుండి బయటకు రావాలంటేనే గ్రామస్తులు వణికిపోతున్నారు. పలు గ్రామాల్లో గ్రామస్తులు కొంత ధైర్యం తెచ్చుకొని ఇళ్లలో నుండి బయటికి వచ్చి కాగడాలు, దండోరాలతో శబ్దాలు చేస్తూ ఏనుగులను గ్రామం నుండి బయటకు పంపించే ప్రయత్నం చేస్తుంటారు. మరి కొన్నిచోట్ల ఏనుగుల పరిస్థితి చూసి ట్రాకర్స్ చుట్టుపక్కల గ్రామాల వారిని అప్రమత్తం చేస్తుంటారు. పలు సందర్భాల్లో ఏనుగులు రెచ్చిపోయి రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారుల పై దాడికి యత్నిస్తుంటాయి. ఏనుగుల దాడిలో పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఇలా ఏనుగులు పేరు ఎత్తితేనే ఉలిక్కిపడుతున్నారు జిల్లావాసులు..
ఈ నేపథ్యంలోనే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జిలావాసులకు తీపి కబురు చెప్పింది. ఏనుగుల సమస్య పై ప్రత్యేక దృష్టి సారించామని, త్వరలో శాశ్వత పరిష్కారం కల్పిస్తామని ప్రకటించారు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్.. ఏనుగుల సమస్య పరిష్కారం కోసం కర్ణాటక నుండి నాలుగు కుంకీ ఏనుగులను మన రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కూడా చేసుకుంది ఏపి ప్రభుత్వం.. అలా మన రాష్ట్రానికి వచ్చే నాలుగు కుంకీ ఏనుగుల్లో రెండు ఏనుగులను మన్యం జిల్లాకు తీసుకువచ్చి వాటి సహాయంతో జిల్లాలో ఉన్న ఏడు ఏనుగుల గుంపును ఇతర ప్రాంతానికి తరలించేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు కూడా తెలియజేశారు. అయితే ఆ రెండు కుంకీ ఏనుగులను తీసుకువచ్చి మన్యం జిల్లాలో ప్రత్యేకమైన షెల్టర్ ఇచ్చేందుకు అధికారులు కూడా ముమ్మర కసరత్తు చేశారు. అయితే కుంకీ ఏనుగుల షెల్టార్ ఏర్పాటు పలు సాంకేతిక కారణాలతో సాధ్యం అవ్వడం లేదు. దీంతో కుంకీ ఏనుగుల సహాయంతో ఏనుగులను తరలించే ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే జిల్లావాసులను వేధిస్తున్న ఏనుగుల సమస్య పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో గుంపు నుండి రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ బి లోకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. జిల్లాలో ఉన్న ఏనుగుల గుంపు కోసం ప్రత్యేకంగా ఒక షెల్టర్ జోన్ ఏర్పాటు చేయాలని ఆ షెల్టర్ జోన్ లోనే ఏనుగులు ఉండేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అందుకోసం సీతానగరం మండలం గుచ్చిమి సమీపంలో సుమారు 400 హెక్టార్ల భూమిని గుర్తించి, ఆ భూమిలో షెల్టర్ జోన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అలా షెల్టర్ జోన్ ఏర్పాటు చేసి ఏనుగులను పూర్తిగా ఆ షెల్టర్ జోన్ కే పరిమితం చేసి జిల్లా వాసుల ప్రాణాలకు కానీ, పంట, ఆస్తి నష్టం జరగకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. అధికారుల ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే ఏనుగులు శాశ్వతంగా జిల్లాలో ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆ ప్రతిపాదనలు జిల్లావాసుల సమస్యకు చెక్ పడుతుందనే చెప్పాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి