Andhra: ఏపీకి ఉరుములాంటి వార్త.. 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఈ జిల్లాలకు
బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. అది 36 గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఈ ప్రభావంతో కోస్తాకు మూడు రోజులపాటు వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ రేపు మధ్యాహ్ననికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు ఆనుకుని ఉన్న నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా రూపాంతరం చెందుతుందన్నారు. ఆ తదుపరి 24 గంటల్లో మరింత బలపడేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. దీని ప్రభావంతో రానున్న ఐదు రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. రేపు, ఎల్లుండి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు, శుక్ర, శని, ఆదివారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ప్రభావం చూపే జిల్లాల యంత్రాంగాన్ని అలెర్ట్ చేశామని ప్రఖర్ జైన్ తెలిపారు.
ప్రజలు అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్, శిధిలావస్థలో ఉన్న నిర్మాణాల వద్ద ఉండరాదని సూచించారు. లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని పొంగిపోర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదాన్నారు. రానున్న రెండు రోజులు వాతావరణం ఈ విధంగా ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ వెల్లడించారు.
బుధవారం(22-10-25):
ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
గురువారం(23-10-25):
బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి బారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతి(జి) చిలమనూరులో 79మిమీ, నెల్లూరు(జి) ఆత్మకూరులో 77.2మిమీ, తిరుపతి(జి) మన్నారుపోలూరులో 69.7మిమీ, గొల్లగుంటలో 68.5మిమీ, పాపమాంబాపురంలో 64.5మిమీ, కొండూరులో 63మిమీ, వెంకటగిరిలో 57మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని తెలిపారు




