పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఆంధ్రప్రదేశ్ నిప్పుల కొలిమిలా మారింది. బయటకు అడుగు పెట్టాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వడదెబ్బ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏపీలో వడదెబ్బతో 12 మంది మరణించగా. తాజాగా ప్రకాశం జిల్లాలో మరొకరు వడదెబ్బతో మరణించారు. దీంతో ఏపీలో వడదెబ్బతో మరణించిన వారి సంఖ్య 13కి చేరింది. ప్రకాశం జిల్లాలోని కంభం పట్టణంలో వడదెబ్బకు గురై కొండేటి గురవయ్య అనే వ్యక్తి మృతి చెందాడు.
కంభం పట్టణంలో నడిచి వెళ్తూ గురవయ్య అకస్మాత్తుగా కుప్పకూలాడు. స్థానికులు గురువయ్యను హుటాహుటిన కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గురువయ్యను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. వడదెబ్బ వల్లే గురవయ్య మృతి చెందినట్లు వెల్లడించారు. గురువయ్య బేల్దారిగా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దీంతో గురువయ్య కుటుంబంలో విషాదం నెలకొంది.
కాగా.. ఎండలతో కోస్తా, రాయలసీమ జిల్లాలు భగ భగ మండిపోతున్నాయి. ప్రకాశం జిల్లా పెద్దారవీడులో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. నెల్లూరులో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు అన్ని జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు పేర్కొంటున్నారు.
కాగా.. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని.. అవసరమైతేనే బయటకు రావాలంటూ ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చరించింది. మధ్యాహ్నం వేళల్లో దాదాపుగా బయటకు రావొద్దని పేర్కొంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..