Vijayawada – Radha: వంగవీటి రాధా వ్యాఖ్యల్లో నిజం లేదా? అసలేం జరుగుతోంది.. ఉత్కంఠగా విజయవాడ రాజకీయాలు..
Vijayawada - Radha: తనపై హత్యకు కుట్ర జరుగుతుందంటూ టీడీపీ నేత వంగవీటి రాధా చెసిన వ్యాఖ్యల్లో నిజం లేదా? రాజకీయ కోణంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా?

Vijayawada – Radha: తనపై హత్యకు కుట్ర జరుగుతుందంటూ టీడీపీ నేత వంగవీటి రాధా చెసిన వ్యాఖ్యల్లో నిజం లేదా? రాజకీయ కోణంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా? లేక రెక్కీపై రాధాకు క్లారిటీ ఉందా? మరోవైపు రాధా వ్యాఖ్యల వెనుక ఎలాంటి నిజం లేదంటున్నారు పోలీసులు. ఇంతకీ ఏది నిజం? ఏం జరుగుతోంది? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..
తనపై హత్యకు కుట్ర జరుగుతుందంటూ వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. గత నెల 26న తన తండ్రి రంగా వర్ధంతి రోజే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపాయి. త్వరలోనే అన్ని విషయాలు బయటికొస్తాయంటూ రాధా మీడియా ముందు వ్యాఖ్యానించారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమక్షంలోనే ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
అసలింతకీ రెక్కీ చేసిందెవరు..? రాధాను చంపేయాలనే కక్ష ఎవరికి ఉంది..? ప్రభుత్వంతో పాటు పోలీసులు కూడా రాధా కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్నారు. మంత్రి కొడాలి నాని జరిగిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కాస్త ఆలస్యం కూడా లేకుండా సీఎం జగన్ వెంటనే గన్ మెన్ లు కేటాయించాలంటూ ఇంటిలిజెన్స్ డీజీని ఆదేశించారు. ముందు జాగ్రత్తగా టూ ప్లస్ టూ గన్ మెన్ లను కేటాయించాలని ఉన్నతాధికారులకు సూచించారు. అక్కడి నుంచే అసలు స్టోరీ మొదలైంది. తన కార్యాలయానికి వచ్చిన గన్ మెన్ ను అవసరం లేదంటూ తిరిగి పంపించేసారు రాధా. తాను ప్రజల మనిషినని, ఎప్పుడూ జనం మధ్యలో ఉండే తనకు గన్ మెన్ లు అవసరం లేదని పంపించేసారు.
ఓవైపు గన్ మెన్ లు కేటాయించడంతో పాటు పోలీసులు కూడా దీనిపై దృష్టి పెట్టారు. రాధా కార్యాలయంలో వ్యక్తులను విచారించారు. రాధాకృష్ణ దగ్గర కూడా సమాచారం తీసుకున్నారు పోలీసులు. ఇదే సమయంలో సీన్ లోకి ఓ కార్పొరేటర్ పేరు తెరపైకి వచ్చింది. వీఎంసీలో వైసీపీ ఫ్టోర్ లీడర్ గా ఉన్న అరవ వెంకట సత్యనారాయణ కుట్ర పన్నారంటూ ప్రచారం జరిగింది. ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో ఐసీయూలో చికిత్స పొందుతున్న సత్యనారాయణ పేరు తెరపైకి రావడం కూడా చర్చకు దారి తీసింది. ఆ వెంటనే సత్యనారాయణ కుమారుడు తేజ మీడియా ముందుకొచ్చి పూర్తి వివరణ ఇవ్వడంతో కాస్త సద్దుమణిగింది.
అరవ సత్యనారాయణ పై జరిగిన ప్రచారాన్ని పోలీసులు కూడా ఖండించారు. అలాంటిదేమీ లేదని తేల్చేసారు. రాధా వ్యాఖ్యలపై విచారణ జరిపామన్న విజయవాడ సీపీ.. ఇంతవరకూ ఒక్క ఆధారం దొరకలేదన్నారు. ఇప్పటికే సీసీ ఫుటేజి పరిశీలించామన్నారు. రాధాను కలిసి వివరాలు తీసుకున్నామన్నారు సీపీ కాంతిరాణా. ఘటనపై జీరో FIR నమోదు చేయలేమని స్పష్టం చేశారు. అలాగే పోలీసులపై చంద్రబాబు చేసిన ఆరోపణలను ఖండించారయన.
ఇంతకీ చంద్రబాబు ఏం అన్నారంటే.. డిసెంబర్ 26న రాధా కామెంట్స్ చేస్తే.. ఐదు రోజుల పాటు సొంతపార్టీ నేతల నుంచి ఎలాంటి స్పందనా లేదు. వైసీపీ నాయకుల పేర్లు తెరపైకి రావడంతో టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా బయటికొచ్చారు. గద్దె రామ్మెహన్, కొల్లు రవీంద్రలు రాధాను ఫాం హౌస్ లో కలిసారు. ఆ తర్వాత ఈనెల 1న చంద్రబాబు.. తాడేపల్లిలోని రాధా ఇంటికెళ్లారు. అక్కడే చాలాసేపు చర్చించిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ పోలీసులపై విమర్శలు చేసారు. పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు చంద్రబాబు. చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇదంతా పొలిటికల్ డ్రామా అంటూనే టీడీపీ పై విమర్శలు గుప్పిస్తున్నారు. రాధా భద్రత కోసం సీఎం గన్ మెన్ లు కేటాయిస్తే ఎందుకు వెనక్కి పంపించేసారని మండిపడ్డారు మంత్రి వెల్లంపల్లి. గతంలో రంగా భద్రత అడిగితే చంద్రబాబు ఇవ్వలేదని, చంద్రబాబు ట్రాప్ లో రాధా పడొద్దన్నారు మంత్రి వెల్లంపల్లి. చంద్రబాబు వల్లే రాధాకు ప్రాణహాని ఉంటుందన్నారు వెల్లంపల్లి.
కాగా, పది రోజులు గడిచినా.. రాధా కూడా ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో విజయవాడ ప్రజల్లో చర్చ జరుగుతుంది. రాజకీయ కారణాలతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసారా? లేక ఇంకేమైనా కారణాలున్నాయా? అని కూడా చర్చ జరుగుతుంది. వీటన్నింటికి ఫుల్ స్టాప్ పడాలంటే వంగవీటి రాధా మౌనం వీడాల్సి ఉంది. రెక్కీకి సంబంధించి ఆధారాలపై సరైన వివరాలు ఇస్తేనే పూర్తి క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది.
Also read:
Maoist Letter: అతనికి శిక్ష తప్పదు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ మావోల లేఖ.. కారణం ఏంటంటే..!
Money Deposits: అకౌంట్‌లో పడ్డ 170 మిలియన్ డాలర్ల డబ్బు.. అంతలోనే ట్విస్ట్ ఇచ్చిన బ్యాంక్..!
Pakistan PM Ex-Wife: ఇదేనా నయా పాకిస్తాన్?.. ప్రధాని ఇమ్రాన్‌పై దుమ్మెత్తిపోసిన మాజీ భార్య..