ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు సోమవారం (జూన్ 12) నుంచి పునఃప్రారంభమయ్యాయి. పిల్లలందరూ బడిబాటపట్టారు. వేసవి సెలవులు ముగిసినా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జూన్ 17వ తేదీ వరకూ ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో జూన్ 17 వరకు ప్రతి రోజూ ఉదయం 7:30 గంటలకే బడి గంట మోగుతోంది. ఇక తరగతులు 11:30 గంటల వరకే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్‌కుమార్ అన్ని పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8:30 నుంచి 9 గంటల మధ్య రాగి జావ, ఆ తర్వాత11.30 నుంచి 12 గంటల మధ్య మధ్యాహ్న భోజనం పంపిణీ చేయాలని ఆ ఉత్తర్వుల్లో వివరించారు.
దీంతో నేటి మొదలు వచ్చే శనివారం వరకు ఇదే రీతిలో ఒంటిపూట బడులు జరుగుతాయి. మరోవైపు వచ్చే నాలుగైదు రోజుల్లో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సైతం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అన్ని బోర్డుల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు ఆ ఆదేశాలు తప్పక పాటించాలని సూచించారు. వచ్చే సోమవారం నుంచి అంటే జూన్ 19వ తేదీ నుంచి 2023-24 విద్యా ప్రణాళికలోని షెడ్యూల్ ప్రకారం పాఠశాలలు యథాతథంగా పనిచేస్తాయని ఆయన తెలిపారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.