Guntur: ఓ కేసు విచారణ చేస్తుంటే.. మరో కేసు గుట్టు వీడింది.. భలే చిక్కార్రా..
ఒక మహిళా మరొక నలుగురితో కలిసి ఒక ముఠాను ఏర్పాటు చేసింది. ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి దొంగతనాలు చేసేందుకు ముఠాను ప్రేరేపించింది. అందరూ కలిసి స్కెచ్ వేసి చేసిన చోరి గుట్టు రట్టైంది. పోలీసులకు దొరికి పోవడంతో ముఠాను జైలుకు పంపించారు.

పాత గుంటూరుకు చెందిన మద్దు అనిత విబేధాల నేపథ్యంలో పదిహేనేళ్ల క్రితమే.. భర్తను వదిలేసి విడిగా జీవిస్తోంది. ఒక ప్రవేటు ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తుంది. అయితే ఆదాయం సరిపోకపోవడంతో బస్టాండ్ వద్ద వ్యభిచారం చేసుకుంటూ జీవిస్తుంది. ఈ క్రమంలోనే ఆమెకు కరిముల్లా అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. వీరిద్దరికి సాయి సంతోష్, గోపి, చందునాయక్‌లు తోడయ్యారు. అందరూ కలిసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అనిత తనకు పరిచయస్థురాలైన మద్రాసు సరస్వతి ఇంటిపై కన్నేసింది. ఆమె దగ్గర బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలిసిన అనిత సరైన సమయంలో చోరి చేసేందుకు ఎదురు చూస్తుంది. ఒక రోజు మద్రాసు సరస్వతి ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లింది. ఈ విషయాన్ని పసిగట్టిన మద్దు అనిత తన గ్యాంగ్‌తో స్కెట్ వేసి ఇంట్లో చోరికి పాల్పడింది. పది లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను అపహరించింది. ఊరు నుంచి తిరిగి వచ్చిన మద్రాసు సరస్వతి ఇంట్లో చోరి జరిగినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే చోరి గ్యాంగ్‌ను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. దాదాపు నాలుగు నెలల పాటు శ్రమించిన పోలీసులు తెలిసిన వాళ్ల పనే అని గుర్తించారు. సరస్వతి పరిచయస్థులపై దృష్టి పెట్టారు. ఒక కేసు విచారణలో భాగంగా నిందితుల్లో ఒకరు పోలీసులకు దొరికారు. ఆ కేసు దర్యాప్తు చేస్తుండగా సరస్వతి ఇంట్లో చోరి విషయం కూడా చెప్పేశాడు. దీంతో ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది.
చోరి చేసిన వెంటనే అనిత.. తస్కరించిన ఆభరణాలను మేడికొండూరులోని రెండు బ్యాంకుల్లో తాకట్టు పెట్టింది. ఒక బ్యాంక్‌లో 2.75 లక్షలు రుణం తీసుకోగా.. మరొక బ్యాంక్‌లో 2.25 లక్షల రూపాయలను పొందారు. వీటిని తమ సొంత అవసరాల కోసం వినయోగించుకున్నారు. నాలుగు నెలల తర్వాత పోలీసులు ఎట్టకేలకు చోరి కేసును చేధించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
