అది గుంటూరులోని సురక్ష ఆసుపత్రి. ఆసుపత్రిలో పనిచేసే ఖాసిం ఉదయాన్నే ఫిజియోథెరపిస్టు సీతారామాంజినేయులకు ఫోన్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతుంది గాని లిఫ్ట్ చేయడం లేదు. దీంతో అనుమానం వచ్చిన ఖాసిం ఆసుపత్రి సమీపంలోనే ఉండే ఫిజియోథెరపిస్టు ఇంటికి వెళ్లాడు. తలుపు ఓరగా తెరిచి చూడగా సీతారామాంజినేయులు మంచం పక్కనే.. చలనం లేకుండా కూలబడి ఉన్నాడు. అనుమానం వచ్చిన ఖాసిం దగ్గరికి వెళ్లి చూడగా సీతారామాంజినేయులు చనిపోయి ఉన్నాడు. తలపై గాయాలున్నాయి. దీంతో ఖాసిం పోలీసులకు ఫోన్ చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఫిజియోధెరపిస్టు హత్య వెనుక హంతకులు ఎవరా అంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు. కూపీ లాగగా అసలు విషయం బయటపడింది.
పల్నాడు జిల్లాకు చెందిన సీతారామాంజినేయులు మొదట అక్క కూతురినే వివాహం చేసుకున్నాడు. అయితే కొద్ది రోజుల తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో విడాకులు కూడా తీసుకున్నారు. అనంతరం సురక్ష ఆసుపత్రిలో పని చేసే స్వాతి రెడ్డితో ఫిజియోథెరపిస్టుకి పరిచయం అయింది. ఫార్మా డి చదువుకున్న స్వాతి రెడ్డి కూడా అదే ఆసుపత్రిలో పనిచేస్తుంది. ఆ పరిచయం ప్రేమగా మారి రిజిష్టర్ మ్యారేజ్ చేసుకునేంత వరకూ వెళ్లింది. అయితే ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావడం, ఫిజియోథెరపిస్టు విడాకులు తీసుకొని ఉండటంతో స్వాతి రెడ్డి తల్లిదండ్రులు ప్రేమను, వివాహాన్ని అంగీకరించలేదు. దీంతో ఆమెను ఉన్నత చదువలు కోసం అమెరికాకు పంపారు.
అయితే ఆమె ఈ నెలలోనే ఇండియాకు తిరిగి వస్తుంది. స్వాతి రెడ్డిని ఈ నెలలో ఇండియాకు రావద్దని వచ్చే నెలలో ఇక్కడకు వస్తున్న సోదరుడితో కలిసి రావాలని స్వాతి రెడ్డి తండ్రి శ్రీనివాసరెడ్డి కోరాడు. అయితే అందుకు స్వాతి రెడ్డి అంగీకరించలేదు. సీతారామాంజినేయులు చెబితేనే తాను వింటానని చెప్పింది. దీంతో శ్రీనివాసరెడ్డి సీతారామాంజినేయులపై పగ పెంచుకున్నాడు. అతడిని ఖతం చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇనుప సుత్తిని, కారంపొడిని బ్యాగ్ లో పెట్టుకొని సీతారామాంజినేయులు ఇంటికి వచ్చాడు. తన కూతురిని ఇప్పుడే ఇండియాకు రావద్దని చెప్పమని అడిగాడు. అందుకు సీతారామాంజినేయులు ససేమిరా అన్నాడు. దీంతో తన వెంట తెచ్చుకున్న సుత్తితో సీతారామాంజినేయులను కొట్టి చంపాడు. అనంతరం కాంర పొడి చల్లి అక్కడ నుండి పారిపోయాడు. అన్ని ఆధారాలతో నిందితుడిని గుర్తించిన పోలీసులు శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి