
ఆంధ్రప్రదేశ్ తాజా మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం రాకపై భగ్గుమంటున్నాయి గుంతకల్లు టీడీపీ శ్రేణులు. గుమ్మనూరు రాకను వ్యతిరేకిస్తూ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. గుమ్మనూరుకు టికెట్ ఇస్తే ఊరుకునేదే లేదని హెచ్చరిస్తున్నారు. ఇంతకూ “గుంతకల్లులో గుడుగుడు గుంజం”కు కారణం ఏంటి..?
ఊహాగానాలు, రాజకీయ చర్చలకు ఎట్టకేలకు తెరదించారు ఆలూరు ఎమ్మెల్యే, తాజా మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం. జయహో బీసీ సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిపోయారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జయరాంతో పాటు ఆయన అనుచరులకు పసుపు కడువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ ఎన్నికల్లో గుంతకల్లు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు గుమ్మనూరు. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నుంచి హామీ లభించిందని స్పష్టం చేశారు. తద్వారా తాను పుట్టిన ఊరుకి సేవ చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు. అయితే గుమ్మనూరు రాక, గుంతకల్లు టీడీపీలో కాక పుట్టిస్తోంది. జయరాం రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు స్థానిక తెలుగు తమ్ముళ్లు. వైసీపీ వద్దనుకున్న వ్యక్తి టీడీపీకి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. గుమ్మనూరు రాకతో పార్టీకి నష్టమే తప్ప ఏమాత్రం ప్రయోజనం లేదని తేల్చిచెబుతున్నారు. ఈ మేరకు గుంతకల్లు టీడీపీ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ వర్గీయులు ఆందోళన చేపట్టారు. జయరాంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చంద్రబాబుతో పాటు కుటుంబ సభ్యులను తీవ్రంగా దూషించిన జయరామ్‌ను ఏవిధంగా పార్టీలో చేర్చుకున్నారని ప్రశ్నిస్తున్నారు..తెలుగు తమ్ముళ్లు. జయరాం గనక గుంతకల్లు బరిలో దిగితే ఓడించి తీరుతామంటున్నారు. మరి చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి..!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…