Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDP: గుడివాడ టీడీపీలో క్రిస్మస్‌ ఉచితాల ఉత్సవాలు.. చంద్రబాబుకు మొదలైన కొత్త తలనొప్పి..

ఆ నియోజ‌క‌వర్గం టీడీపీలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ్వ‌రికీ తెలియ‌దు....అధికార పార్టీ ఎమ్మెల్యేని ఢీకొట్ట‌డానికి నానా తంటాలు ప‌డుతుంది సైకిల్ పార్టీ...బ‌రిలో నిలిచేదెవ‌రో చెప్ప‌క‌పోయినా ఇద్ద‌రు నేత‌లు మాత్రం అప్పుడే ఓట‌ర్ల‌కు గాలం వేసేస్తున్నారు.ఒక‌రు అధికారికంగా పార్టీ త‌ర‌పున‌...మ‌రొక‌రు టిక్కెట్ వ‌స్తుంద‌నే ఆశతో పోటాపోటీ పందేరాలు పెట్టేసారంట‌.ఇంత‌కీ ఎక్క‌డా నియోజ‌క‌వ‌ర్గం..ఎవ‌రా నేత‌లు.

TDP: గుడివాడ టీడీపీలో క్రిస్మస్‌ ఉచితాల ఉత్సవాలు.. చంద్రబాబుకు మొదలైన కొత్త తలనొప్పి..
Gudivada Tdp
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 20, 2022 | 8:23 PM

కృష్ణా జిల్లా గుడివాడ‌ టీడీపీలో క్రిస్మస్ సందర్భంగా… ఉచితాల ఉత్సవం ప్రారంభ‌మైంద‌ట‌. ప్రభుత్వంలో ఉన్నామా..? అన్నంత రేంజ్‌లో.. జోరుగా దూసుకెళ్తున్నారు నేతలు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ సైకిల్‌ మీద సవారీ చేసేందుకు… ఉత్సాహం చూపిస్తున్న నేతల మధ్య పోటీ ఎక్కువైనట్టు కనిపిస్తోంది. ఎమ్మెల్యే కొడాలి నానిని ఎదుర్కొనేందుకు స‌రైన అభ్యర్ధి ఎవరా? అని ఇప్పటికే డైలమాలో ఉన్న అధినేత చంద్రబాబుకు.. కొత్త తలనొప్పి మొదలైనట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం గుడివాడలో టీడీపీకి ఇంచార్జిగా మాజీ ఎమ్మెల్యే రావి వెంక‌టేశ్వర్రావు ఉన్నారు. అప్పుడప్పుడు ఎమ్మెల్యే కొడాలి నానికి కౌంటర్లిస్తూ… ఇదిగో నేనున్నానంటూ… ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇటీవలె అమెరికా నుంచి వ‌చ్చిన వెనిగండ్ల రాము… నియోజకవర్గ టీడీపీ మీద ఫోకస్‌ పెట్టారు. అప్పుడే సామాజికవ‌ర్గాల వారీగా.. లెక్కలు వేసుకుంటున్నారు.

రామూది క‌మ్మ సామాజికవర్గం అయినప్పటికీ… ఆయన భార్య ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి. దీంతో, ఆ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలెట్టారు. అధికారికంగా ప్రకటించనప్పటికీ.. తానే టీడీపీ అభ్యర్థినన్నట్టుగా… సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకెళ్తోంది రాము అండ్‌ ఫ్యామిలీ. వెనిగండ్ల ఫౌండేష‌న్ పేరుతో ఇటీవ‌ల… దాదాపు 40 వేల మందికి క్రిస్మస్ గిఫ్టులు పంపిణీ చేశారు.

క్రైస్తవుల మార్కులు కొట్టేయాలనే ఆలోచనలో వెనిగండ్ల 

గుడివాడలో టీడీపీ సీటు తనకే వస్తుందన్న ఆశతోనే.. వెనిగండ్ల రాము ఈ స్థాయిలో కార్యక్రమాలు చేపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. క్రైస్తవ కుటుంబాల్లోని అంద‌రికీ కొత్త బ‌ట్టలు పంపిణీ చేసి… మార్కులు కొట్టేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. అందుకే అమెరికా నుంచి వ‌చ్చీ రావ‌డంతోనే.. అలా జనాల్లో కలిసిపోయేలా పెద్ద ప్లాన్‌ వేశారనే ముచ్చట వినిపిస్తోంది. వెనిగండ్ల హ‌డావుడి చూసిన .. గుడివాడ టీడీపీ ఇంచార్జి రావి వెంక‌టేశ్వర‌రావు సైతం… దెబ్బకు డైల‌మాలో ప‌డిపోయార‌ని తెలుగు త‌మ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు.

వెనిగండ్లకు పోటీగా రావి ఉచితాల పంపిణీ 

వామ్మో.. ఇదేదో కొంపకొల్లేరయ్యేలా ఉందని భావించిన రావి… తానేం తక్కువ తిన్లేదంటూ… ప్రి క్రిస్మస్ సెల‌బ్రేష‌న్స్ లో సందడి చేస్తున్నారట. పాస్టర్‌ల‌కు, క్రిస్టియన్లకు దుస్తులు పంపిణీ చేస్తున్నారట. రాము ఇచ్చిన షాక్‌తో… రావి వెంకటేశ్వర్రావు దిక్కుతోచని స్థితిలో పడ్డారని.. ఆయన అనుచరులే బాహాటంగా చెప్పుకుంటున్న పరిస్థితి. ఇప్పటిదాకా టీడీపీతో ఎలాంటి సంబంధంలేని వెనిగండ్లకి పోటీగా… వెంక‌టేశ్వర్రావు కూడా ఉచితాలంటూ ముందుకు రావ‌డం పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. ఒకే పార్టీలో ఉంటూ… ఈ పోటాపోటీ పంపకాలేంటో అర్థం కాక… తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారట.

ఎవరెన్ని పంచినా.. తనకు ఎదురే లేదంటున్న కొడాలి!

ఇక, త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్రత్యర్థి వర్గంలో జ‌రుగుతున్న ఈ ప‌రిణామాల‌ను.. ఎమ్మెల్యే కొడాలి నాని ఆస‌క్తిగా గమనిస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ అంటేనే ఇంతెత్తున లేచే కొడాలి… ఎవరు ఎన్ని పంప‌కాలు చేసినా ఎన్నికల్లో త‌న‌కు తిరుగేలేద‌నే ధీమాతో ఉన్నారట. ప్రతీసారి నాని గెలుపులో కీలక పాత్రపోషిస్తున్న ఎస్సీ, ఎస్టీలను… త‌మ‌వైపు తిప్పుకునేందుకు టీడీపీ నేత‌లు పోటీప‌డుతుండ‌టంతో… మున్ముందు రాజకీయం ఎలా ఉండబోతోందన్న ఆసక్తి ఏర్పడింది. బలమైన ప్రత్యర్థిని ఒక్కటిగా ఎదుర్కోవాల్సిన చోట… టీడీపీ నేతలు ఎవరికివారుగా చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎవరికి లాభం చేస్తాయి? ఎవరిని నష్టపరుస్తాయి? అన్నదే ప్రస్తుతం గుడివాడలో నడుస్తున్న పొలిటికల్‌ గుసగుస.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం