Andhra Pradesh: అయ్యో దేవుడా.. ఏం రాత రాశావయ్యా.. మరికొన్ని గంటల్లో పెళ్లి.. అంతలోనే..
కళ్లనిండా కొత్త జీవితంపై కోటి ఆశలు.. చుట్టూ నవ్వులు పూయిస్తున్న స్నేహితులు.. కానీ ఆ కాసేపటి సరదాయే నిండు నూరేళ్ల ఆయుషును దూరం చేస్తుందని ఆ యువకుడు ఊహించలేకపోయాడు. పెద్దదోర్నాల మండలంలో పెళ్లికి ఒక్క రోజు ముందు జరిగిన ఈ ఊహించని విషాదం రెండు కుటుంబాలను కన్నీటి సంద్రంలో ముంచేసింది. అసలేం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మరికొన్ని గంటల్లో పెళ్లి.. భాజాభజంత్రీలు మోగాల్సిన వేళ.. బంధుమిత్రుల రాకతో ఆ ఇల్లంతా పండుగ వాతావరణం నెలకొంది. మరికొద్ది గంటల్లో నూరేళ్ల బంధంలోకి అడుగుపెట్టాల్సిన పెళ్లికొడుకు సరదాగా స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. కానీ ఆ సరదాయే ఊహించని విషాదాన్ని మిగిల్చింది. కొత్తగా విడుదలైన కృష్ణా జలాల పరవళ్లను చూసేందుకు వెళ్లి, ఈత కొట్టేందుకు కాలువలోకి దిగిన వరుడితో పాటు మరో బంధువు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. ఈ హృదయ విదారక ఘటన మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం పరిధిలోని పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కాలువ వద్ద చోటుచేసుకుంది. పెద్దదోర్నాల మండలం కటకానిపల్లి గ్రామానికి చెందిన పుప్పాల పెద్ద ఆవులయ్య కుమారుడు పుప్పాల రాజ్‌కుమార్ స్థానిక మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు. రాజ్‌కుమార్‌కు అర్ధవీడు మండలం మావుటూరు గ్రామానికి చెందిన యువతితో సోమవారం వివాహం జరగాల్సి ఉంది. ఆదివారం కావడంతో బంధువులు, స్నేహితులు ఒక్కొక్కరుగా పెళ్లింటికి చేరుకుంటున్నారు.
ఇటీవలే వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కాలువకు కృష్ణా జలాలను విడుదల చేయడంతో తమ ప్రాంతానికి తొలిసారి వచ్చిన నీటి ప్రవాహాన్ని చూడాలని రాజ్‌కుమార్ తన స్నేహితులు, బంధువులతో కలిసి అక్కడికి వెళ్లాడు. కాలువ వద్ద ఉత్సాహంగా గడిపిన యువకులు, సరదాగా ఈత కొట్టాలనే ఆలోచనతో ర్యాంప్ వద్ద నీటిలోకి దిగారు. కాలువలో నీటి ప్రవాహం అత్యంత వేగంగా ఉండటంతో పాటు లోతు ఎక్కువగా ఉండటాన్ని వారు గమనించలేకపోయారు. నీటిలోకి దిగిన రాజ్‌కుమార్‌తో పాటు అతని బంధువు పుప్పాల విజయ్‌కుమార్ క్షణాల్లో ప్రవాహ ధాటికి కొట్టుకుపోయారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో యువకుడు రాజు నీటి ఉధృతిని తట్టుకోలేక అతికష్టమ్మీద సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు. కళ్లముందే పెళ్లికొడుకు నీటిలో మునిగిపోతుండటం చూసిన మిత్రులు దిగ్భ్రాంతికి గురై, వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించారు.
రంగంలోకి అధికారులు.. గాలింపు చర్యలు ముమ్మరం
విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన రాజ్‌కుమార్, విజయ్‌కుమార్‌ల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకైన రాజ్‌కుమార్ పెళ్లి పీటలు ఎక్కాల్సిన రోజే ఇలా కాలువలో గల్లంతవ్వడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అటు వరుడి గ్రామం కటకానిపల్లిలో, ఇటు వధువు స్వగ్రామమైన మావుటూరులో పెళ్లి సందడి స్థానంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
