AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1921లో ఏలూరులో గాంధీ తాత నాటిన మొక్క ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

1921 ఏప్రిల్ 3న మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ ఏలూరులో పర్యటించారు. ఆ సందర్భంగా గాంధీజీ మేడి మొక్క నాటారు. వందేళ్లకు పైగా పెరిగిన ఆ చారిత్రక చెట్టు 2022లో ఎండిపోయింది. అయితే అదే ప్రదేశంలో మొలిచిన వేపచెట్టు ఇప్పుడు విద్యార్థులకు నీడనిస్తూ, బాపూజీ జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతోంది.

1921లో ఏలూరులో గాంధీ తాత నాటిన మొక్క ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
Gandhi Tree Eluru
B Ravi Kumar
| Edited By: |

Updated on: Aug 14, 2026 | 9:34 AM

Share

శాంతి, అహింసా మార్గంలో భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని నడిపిన జాతిపిత మహాత్మా గాంధీ అడుగుపడిన ప్రతి చోటుకు ఒక ప్రత్యేక ఉంది. శతాబ్దం కిందట ఆంధ్ర ప్రాంతంలో ఆయన పర్యటించిన ప్రతి ప్రదేశం ఒక చారిత్రక ఘట్టంగా మారిపోయింది. అందులోనూ పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు నగరం గాంధీజీ పర్యటనతో సరికొత్త చైతన్యాన్ని పులుముకుంది. 1921 ఏప్రిల్ 3న ఏలూరుకు వచ్చిన గాంధీజీ దంపతులు, స్థానిక అగ్రహారం ప్రాంతంలో జాతీయోద్యమానికి నాంది పలుకుతూ ఒక మేడి మొక్కను నాటారు. ఆ మొక్క వృక్షమై, వందేళ్లపాటు తరతరాల విద్యార్థులకు, పౌరులకు శాంతి పరిమళాలను, చల్లని నీడను అందించింది. కాలక్రమంలో ఆ చారిత్రక మేడిచెట్టు ఎండిపోయినప్పటికీ, అదే స్థలంలో దాని చెంతనే మొలకెత్తిన వేపచెట్టు నేడు విద్యార్థులకు ఆశ్రయమిస్తూ, బాపూజీ స్మృతులను సజీవంగా నిలబెడుతోంది.

గాంధీజీ ఏలూరు పర్యటన 1921

1921 మార్చి ఆఖరులో విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాల అనంతరం, ఏప్రిల్ 3న మహాత్మా గాంధీ తన సతిమణి కస్తూర్బాతో కలిసి ఏలూరు రైల్వే స్టేషన్‌లో దిగారు. ఆ చారిత్రక ఘడియల్లో మోతే గంగరాజు, సోమంచి సీతారామయ్య, వల్లూరి రామారావు, ఎర్రమిల్లి మంగయ్య, వారణాసి శ్రీరామ్మూర్తి, బడేటి వెంకట్రామయ్య నాయుడు వంటి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు వారికి అపూర్వ స్వాగతం పలికారు. పట్టణ ప్రజలు, మహిళలు, యువకులు వేలాదిగా వీధుల్లోకి వచ్చి బాపూజీకి పూలమాలలతో జయ జయధ్వానాలు చేశారు. ఆ పర్యటనలో భాగంగానే ఏలూరు లో భారీ బహిరంగ సభ నిర్వహించి తిలక్ స్వరాజ్య నిధికి పిలుపునిచ్చారు. స్వదేశీ విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ఏలూరు అగ్రహారం ప్రాంతంలో మార్కండేయస్వామి ఆలయం సమీపంలో ‘ఆంధ్ర జాతీయ మహా విద్యాలయం’ (శ్రీ గాంధీ జాతీయ విద్యాలయం) శంకుస్థాపన కార్యక్రమాన్ని గాంధీజీ చేతుల మీదుగా నిర్వహించారు.

అదే శుభముహూర్తాన కస్తూర్బా గాంధీ ఆలయ ప్రాంగణంలో స్థానిక చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి విద్యాభ్యాసానికి ఆశీస్సులు అందించారు. ఈ చారిత్రక ఘట్టానికి గుర్తుగా గాంధీజీ తన సొంత చేతులతో అక్కడే ఒక మేడి మొక్కను నాటారు. నాటిన నాటి నుంచి అది ఆ ప్రాంతంలో జాతీయ చైతన్యానికి, విద్యా వికాసానికి జీవ చిహ్నంగా నిలిచింది.

శతాబ్దపు శాంతి వృక్షం

గాంధీజీ నాటిన ఆ మేడి మొక్క కాలక్రమంలో మహా వృక్షంగా విస్తరించింది. వందేళ్లకు పైగా కొమ్మలు చాచి, ఎందరో విద్యార్థులకు చల్లని నీడను, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచింది. బాపూజీ స్పర్శ తగిలిన ఆ చెట్టు కింద కూర్చుని చదువుకోవడం స్థానిక విద్యార్థులు ఎంతో గర్వంగా భావించేవారు. అయితే, కాలక్రమేణా వయోభారంతో, ప్రకృతి మార్పుల కారణంగా 2022 నాటికి ఆ చారిత్రక మేడిచెట్టు ఎండిపోయింది. వందేళ్ల సుదీర్ఘ చరిత్రకు సాక్షిగా నిలిచిన చెట్టు ఎండిపోవడం స్థానికులను, పూర్వ విద్యార్థులను కొంత నిరాశకు గురిచేసినా, ఆ ప్రదేశపు ప్రాధాన్యం మాత్రం తగ్గలేదు.

మేడిచెట్టు ఎండిపోయినప్పటికీ, కాలం స్థబ్దంగా ఉండిపోలేదు. సరిగ్గా అదే ప్రాంగణంలో, ఎండిన మేడిచెట్టు చెంతనే ఒక వేపచెట్టు సహజంగా మొలకెత్తి దట్టమైన కొమ్మలతో విస్తరించింది. నేడు ఆ వేపచెట్టు కింద ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మెపై సాయంత్ర వేళల్లో విద్యార్థులు వరుసగా కూర్చుని శ్రద్ధగా చదువుకుంటున్నారు. గాంధీజీ నాటిన మేడిచెట్టు స్థానంలో రూపుదిద్దుకున్న ఈ వేపచెట్టు, జాతీయ విద్యాలయ ప్రాంగణంలో చదువుల వెలుగులను, పర్యావరణ చైతన్యాన్ని నిరంతరం కొనసాగిస్తూ ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది.

Follow Us