AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీళ్ళు కదా నిజమైన స్నేహితులు.. చనిపోయిన దోస్త్ జ్ఞాపకార్థం ఏం చేశారో తెలుసా?

స్నేహం అంటే కలిసి తిరగడం, సరదాగా గడపడమే కాదు.. ఒకరి కష్టసుఖాలలో తోడుండటం, ఒకరు దూరమైతే వారి జ్ఞాపకాలను సమాజానికి ఉపయోగపడేలా సజీవంగా ఉంచడం. సరిగ్గా ఇదే నిరూపించారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన కొందరు యువకులు. రోడ్డు ప్రమాదంలో తమ ప్రియమైన స్నేహితుడిని కోల్పోయిన ఆ మిత్ర బృందం, ఆ బాధలోంచి సమాజానికి మేలు చేసే ఒక గొప్ప సంకల్పానికి శ్రీకారం చుట్టింది.

వీళ్ళు కదా నిజమైన స్నేహితులు.. చనిపోయిన దోస్త్ జ్ఞాపకార్థం ఏం చేశారో తెలుసా?
Memory Of Deceased Friend
Nalluri Naresh
| Edited By: |

Updated on: May 29, 2026 | 11:45 AM

Share

స్నేహం అంటే కలిసి తిరగడం, సరదాగా గడపడమే కాదు.. ఒకరి కష్టసుఖాలలో తోడుండటం, ఒకరు దూరమైతే వారి జ్ఞాపకాలను సమాజానికి ఉపయోగపడేలా సజీవంగా ఉంచడం. సరిగ్గా ఇదే నిరూపించారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన కొందరు యువకులు. రోడ్డు ప్రమాదంలో తమ ప్రియమైన స్నేహితుడిని కోల్పోయిన ఆ మిత్ర బృందం, ఆ బాధలోంచి సమాజానికి మేలు చేసే ఒక గొప్ప సంకల్పానికి శ్రీకారం చుట్టింది.

కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన బోయ శ్రీనివాసులు అనే యువకుడు ఏడాది క్రితం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన సమయంలో అతను హెల్మెట్ ధరించకపోవడమే అతని మరణానికి ప్రధాన కారణమైంది. కండ్ల ముందే తమ స్నేహితుడు ప్రాణాలు కోల్పోవడంతో అతని మిత్రులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అయితే, కేవలం బాధపడుతూ కూర్చోకుండా, తమ స్నేహితుడికి జరిగిన ఘోరం ఇంకే కుటుంబంలోనూ జరగకూడదని వారు ఒక దృఢ నిశ్చయానికి వచ్చారు.

శ్రీనివాసులు ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని, అతని జ్ఞాపకార్థం సమాజంలో మార్పు తీసుకురావాలని భావించారు. ఈ క్రమంలోనే “ఒక ప్రాణం పోయింది… ఇంకో ప్రాణం పోకూడదు” అనే నినాదంతో రోడ్డు భద్రత, హెల్మెట్ ప్రాముఖ్యతపై ఒక వినూత్న అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.

స్థానిక పోలీసుల సహకారంతో ఈ మిత్ర బృందం పట్టణంలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. వాహనదారుల్లో చైతన్యం తేవడమే లక్ష్యంగా, పట్టణంలోని వాల్మీకి సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు యువతతో కలిసి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పాల్గొన్న యువకులంతా హెల్మెట్లు ధరించి, రోడ్డు భద్రతా నియమాలను పాటించాలంటూ ప్లకార్డులతో ప్రజలకు సందేశం ఇచ్చారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. క్షణిక నిర్లక్ష్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, ప్రతి ఒక్కరి ప్రాణం వారి కుటుంబానికి ఎంతో విలువైనదని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమం కేవలం ర్యాలీకే పరిమితం కాలేదు. హెల్మెట్ లేని వంద మంది వాహనదారులను గుర్తించి, వారికి ఉచితంగా 100 హెల్మెట్లను పంపిణీ చేశారు. హెల్మెట్ కొనలేకనో, లేదా నిర్లక్ష్యంతోనో ప్రాణాలను పణంగా పెట్టే వారికి ఈ పంపిణీ ద్వారా కనువిప్పు కలిగించారు.

తమ స్నేహితుడు హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయాడో, అదే తప్పు మరెవరూ చేయకూడదనే వారి ఆరాటం, సమాజం పట్ల వారికున్న బాధ్యతను చాటిచెప్పింది. స్నేహితుడిపై ఉన్న ప్రేమను ఇలా సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించిన ఈ యువతను, వారి వినూత్న ఆలోచనను కళ్యాణదుర్గం ప్రజలతో పాటు పోలీసులు కూడా అభినందించారు. వీరు కదా నిజమైన స్నేహితులు అంటూ స్థానికులు కొనియాడారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us