తెలంగాణ ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. అడ్మిషన్ పొందే ముందే ఇవి చూసుకోండి!
రాష్ట్రంలోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి కీలక సూచనలు జారీ చేసింది. పిల్లలను కాలేజ్‌లలో చేర్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరింది. గుర్తింపు లేని, అక్రమంగా నిర్వహిస్తున్న కళాశాలల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.అడ్మిషన్ పొందే ముందే సదరు కళాశాలకు బోర్డు అఫిలియేషన్ (గుర్తింపు) ఉందో లేదో అధికారిక మార్గాల ద్వారా క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని సూచించింది

తెలంగాణలో అనధికార అడ్మిషన్లు, నిబంధనలకు విరుద్ధంగా నడిచే ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి ఉక్కుపాదం మోపుతోంది. గుర్తింపు లేని, అక్రమంగా నిర్వహిస్తున్న కళాశాలల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులు అడ్మిషన్ పొందే ముందే సదరు కళాశాలకు బోర్డు అఫిలియేషన్ (గుర్తింపు) ఉందో లేదో అధికారిక మార్గాల ద్వారా క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ అడ్మిషన్లను అరికట్టేందుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడటమే తమ ప్రాధాన్యత అని మండలి స్పష్టం చేసింది.
గత కొన్ని నెలలుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బృందాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జూనియర్ కళాశాలల్లో బోర్డు పలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని అనేక కాలేజీలపై రూ. లక్ష నుండి రూ. 10 లక్షల వరకు భారీ ఆర్థిక జరిమానాలు విధించినట్లు బోర్డు వెల్లడించింది. అంతేకాకుండా తగినంత మౌలిక వసతులు, అగ్నిమాపక భద్రత మరియు అకడమిక్ ప్రమాణాలు పాటించడంలో విఫలమైన కాలేజీలకు సంబంధించి ప్రస్తుత విద్యాసంవత్సరం (2026-27) అఫిలియేషన్లను తత్కాలికంగా నిలిపివేత చేసినట్లు పేర్కొంది. జూనియర్ కాలేజీ యాజమాన్యాలు నిబంధనలు పాటించేలా చూసేందుకు రాబోయే రోజుల్లో కూడా ఈ టాస్క్ ఫోర్స్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేసింది.
విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని, నిర్దేశిత నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలిన ఏ విద్యాసంస్థపైనైనా కఠినమైన క్రమశిక్షణా చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని ఇంటర్ బోర్డు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా బోర్డు నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. తల్లిదండ్రులు మోసపోకుండా అడ్మిషన్లకు ముందే కళాశాల అఫిలియేషన్ స్థితిని అధికారిక వెబ్‌సైట్ www.tgbie.cgg.gov.in లో సరిచూసుకోవాలని బోర్డు మరోసారి విజ్ఞప్తి చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
