Chandrababu Naidu: సొంత వారిని కలవనీయకుండా పైశాచిక ఆనందం.. ఓటమి భయంతో తప్పుడు కేసులు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తీరుపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో ఏం జరుగుతుందో ప్రపంచంలోని తెలుగు వారంతా చూశారన్న చంద్రబాబు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తీరుపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో ఏం జరుగుతుందో ప్రపంచంలోని తెలుగు వారంతా చూశారన్న చంద్రబాబు.. తాను సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ కుటుంబం పాదయాత్ర, మీటింగ్ లు పెట్టారని గుర్తు చేశారు. ఎక్కడా ఆటంకం కలిగించలేదన్నారు. జీవో నెంబర్ 1 ను తనపై ప్రయోగించారని మండిపడ్డారు. సొంత నియోజకవర్గం కుప్పంలో సొంత వారిని కలుసుకునేందుకు వీలు లేకుండా చేశారని ఆక్షేపించారు. ఇలా చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ప్రచార రథాల వాహనాలను సీజ్ చేసి భయబ్రాంతులకు గురిచేశారన్న చంద్రబాబు.. కేసులు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. జగన్ కు పిరికితనం, ఓటమి భయంతో తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కొందరు పోలీసుల తీరు ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసేలా ఉందని ఫైర్ అయ్యారు. పోలీసు వ్యవస్థ వాహనానికి మైక్ పర్మిషన్ ఇస్తుందా లేదా అని అడుగుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
మరోవైపు.. చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. రోడ్లపై అనుమతి లేకుండా రోడ్‌షోలు, సభల నిర్వహణకు వీలు లేదంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన తరుణంలో రోడ్ షోను పోలీసులు అడ్డుకున్నారు. నిర్వహణకు అనుమతి లేదంటూ డిఎస్పీ నోటీసులు అందజేశారు. దీనిపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గానికి ఎందుకు వెళ్లొద్దంటూ ప్రశ్నించారు. సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజమహేంద్రవరంలో రోడ్‌షో, సభ నిర్వహించారని విమర్శించారు. అధికార పార్టీలకు, ప్రతిపక్షాలకు నిబంధనల్లో తేడాలెందుకని నిలదీశారు.
కాగా.. కుప్పం పర్యటనపై నెల రోజుల ముందే డీజీపీకి లేఖ రాసినట్లు చంద్రబాబు చెప్పారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తన నియోజకవర్గ ప్రజలతో తాను మట్లాడవద్దా అంటూ ప్రభుత్వాన్ని, పోలీసుల్ని నిలదీశారు. శాంతిపురం మండలం గుడ్డురు క్రాస్ వద్ద ఉద్రిక్తత జరిగింది. చంద్రబాబు నాయుడు సభకు వెళ్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. చంద్రబాబు సభకు అనుమతి లేదని, ఎవరూ సభకు వెళ్లవద్దనడంతో పోలీసులకు, టీడీపీ లీడర్స్ మధ్య వాగ్వాదం జరిగింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..