సుప్రీ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండడం అంటే ఒత్తిడికి లోనవడం సహజం. కొన్ని సందర్భాలలో నిద్ర కూడా సరిగా పట్టదు. అలాంటి సమయంలో తాను ‘సిరివెన్నెల’ పాటలను విని తన ఒత్తిడిని తగ్గించుకునేవాడినని మాజీ సీజేఐ ఎన్‌వీ రమణ తెలిపారు. విశాఖపట్నంలో తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆ సందర్భంగా సిరివెన్నెల సమగ్ర సాహిత్యం ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ రెండు, మూడు సంపుటాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్‌వీ రమణ మాట్లాడుతూ సినీ రంగంలో శ్రీశ్రీ, ఆరుద్ర, సినారె వంటి కవుల తర్వాత తెలుగు భాషను తన రచనలు, సాహిత్యంతో బతికించి, గుర్తింపు తెచ్చినవారు సిరివెన్నెల సీతారామశాస్త్రి అని కొనియాడారు. ‘ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన సమయంలో తీవ్రమైన పని ఒత్తిడిలో ఉండేవాడిని. రాత్రిళ్లు నిద్ర కూడా సరిగా పట్టేది కాదు. ఉదయం వేళ నడక సమయంలో సీతారామశాస్త్రి పాటలు ఫోన్‌లో వింటుండేవాడిని.. అప్పుడే మనసు కాస్త ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించేది’ అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి. రమణ తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘గురజాడ అప్పారావు, శ్రీశ్రీ, రావిశాస్త్రి వంటి కవుల నుంచి స్ఫూర్తిని పొందినవాడిని నేను. శ్రీశ్రీ, రావిశాస్త్రి నాకు వ్యక్తిగతంగా తెలుసు. అనేక ఉద్యమాల్లో వారితో కలిసి నేను పనిచేశాను. అవన్నీ గొప్ప మధుర స్మృతులు. తెలుగు సాహిత్యం కోసం సినిమాలు చూడాలనే కోరికను సీతారామశాస్త్రి తీసుకువచ్చారు. తెలుగుపాట ఏదో వెతుక్కోవాల్సిన పరిస్థితి నుంచి తెలుగు భాషకు ఇంత గొప్ప సాహిత్యం, చరిత్ర, మాధుర్యం రుచి చూపింది సీతారామశాస్త్రే’ అని అన్నారు. ‘మహిళలను కించపరిచేలా, యువత పెడదోవపట్టేలా పాటలు రాయకూడదని సీతారామశాస్త్రి నిర్ణయించుకున్నారు. సమాజం పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం అది’ అని వివరించారు.
‘తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ప్రత్యేకించి తెలుగు సాహిత్యం, భాష, కళల మీద సభలు, సమావేశాలు జరిపే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. మాతృభాషాభివృద్ధికి మీలాంటి పెద్దలు సభలు, మహాసభలు పెట్టండి. మీకు ఆర్థికంగానైనా నేను సహకరిస్తా’ అని జస్టిస్ ఎన్.వి.రమణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం సందర్భంగా జస్టిస్ రమణను తానా, సిరివెన్నెల కుటుంబ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్, అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, ప్రముఖ అవధాని డా.బేతవోలు రామబ్రహ్మం, సినీ గేయ రచయిత రామజోగయ్యశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..