AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ప్రాణాల మీదకు తెచ్చిన పునుగులు.. ఆస్పత్రిలో 11మంది.. అసలేం జరిగిందంటే..?

మనం తినే ఆహారమే మన ప్రాణాల మీదకు తెస్తుందని ఎవరూ ఊహించరు. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఒక దురదృష్టకర ఘటన దీనిని నిజం చేసింది. పునుగులు తిన్న రెండేళ్ల బాలుడు సహా 11మంది ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిపాలయ్యారు. అస్సలు ఏం జరిగింది? పునుగులు విషంగా ఎలా మారాయి? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Andhra Pradesh: ప్రాణాల మీదకు తెచ్చిన పునుగులు.. ఆస్పత్రిలో 11మంది.. అసలేం జరిగిందంటే..?
11 Hospitalized After Eating Punugulu
Krishna S
|

Updated on: May 14, 2026 | 8:05 AM

Share

పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలంలోని ఎస్. కొండేపాడు గ్రామంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కలుషిత ఆహారం తిని ఒకే కుటుంబానికి చెందిన వారితో పాటు మరికొందరు కలిపి మొత్తం 11 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో రెండేళ్ల పసిబాలుడు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఏడాది కాలంగా నిల్వ ఉంచిన పిండితో చేసిన పదార్థాలు తినడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ గీతాబాయి తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్. కొండేపాడు గ్రామంలోని ఒక ఇంట్లో బుధవారం ఉదయం 9 గంటల సమయంలో అల్పాహారంగా పునుగులు తయారు చేసుకున్నారు. అయితే ఈ పునుగుల కోసం ఏడాదికి పైగా నిల్వ ఉంచిన పిండిని ఉపయోగించినట్లు గుర్తించారు.

ఈ పునుగులు ఆహారం తిన్న సుమారు మూడు గంటల తర్వాత అంటే మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బాధితులకు వరుసగా వాంతులు ప్రారంభమయ్యాయి. పరిస్థితి విషమించడంతో కొందరు స్పృహ కోల్పోయి పడిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. బాధితులను తక్షణమే భీమవరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందించారు. జిల్లా కలెక్టర్ నాగరాణి ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. రోగుల పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న ఆమె, మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఆహార పదార్థాల నిల్వ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. మరోవైపు అధికారులు పునుగుల నమూనాలను, ఆ ఇంట్లో ఉన్న పిండి శాంపిల్స్‌ను సేకరించి విశ్లేషణ నిమిత్తం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపారు. నివేదిక వచ్చిన తర్వాత అసలు ఏ రకమైన బ్యాక్టీరియా లేదా విషతుల్యాలు చేరాయనేది స్పష్టమవుతుందని అధికారులు తెలిపారు.

నిల్వ ఉంచిన పిండి ఎందుకు ప్రమాదకరం?

సాధారణంగా పిండి పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచినప్పుడు అందులో తేమ చేరి మైకోటాక్సిన్స్ అనే విషపూరితమైన ఫంగస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఏడాది కాలం నాటి పిండిలో బ్యాక్టీరియా వృద్ధి చెంది అది ప్రాణాంతక విషంగా మారుతుంది. వాంతులు, విరోచనాలు, కడుపునొప్పి, నాడీ వ్యవస్థపై ప్రభావం పడి స్పృహ కోల్పోవడం వంటివి జరుగుతాయి. కాబట్టి ఆహార పదార్థాల రంగు లేదా వాసనలో మార్పు వస్తే వాటిని వెంటనే పారేయాలి. వర్షాకాలం, తేమ ఎక్కువగా ఉన్న సమయాల్లో ఆహారం త్వరగా కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

Follow Us