AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుక్క చెవిపై ‘V’ ఆకారం మార్క్ ఉందా? అయితే దానికి ఫ్యామిలీ ప్లానింగ్ అయినట్లే!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వీధి కుక్కల సమస్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ వంటి మెట్రో నగరాల నుంచి పల్లెటూళ్ల గల్లీల వరకు శునకాల సంచారం, వాటి దాడులు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. కుక్కల కాటుకు గురై ఎంతో మంది తీవ్ర గాయాలపాలవుతుండగా, మరికొందరు చిన్నారులు ప్రాణాలు సైతం కోల్పోతున్న ఉదంతాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి..

కుక్క చెవిపై 'V' ఆకారం మార్క్ ఉందా? అయితే దానికి ఫ్యామిలీ ప్లానింగ్ అయినట్లే!
Stray Dogs Sterilization
B Ravi Kumar
| Edited By: |

Updated on: Jun 05, 2026 | 8:48 PM

Share

ఏలూరు, జూన్‌ 5: ఈ నేపథ్యంలో వీధి కుక్కల జనాభాను శాస్త్రీయంగా నియంత్రించడం స్థానిక సంస్థలకు సవాలుగా మారింది. ఏటా క్రమం తప్పకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించడం, అందుకు తగిన నిధులను కేటాయించడం ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పురపాలక సంఘం వీధి కుక్కల జనాభాకు బ్రేకులు వేసేందుకు ఒక వినూత్న ప్రణాళికతో ముందడుగు వేసింది.

రోడ్లపై ‘కాలభైరవుల’ హల్‌చల్.. బెంబేలెత్తుతున్న జనం

తణుకు పట్టణ పరిధిలో వీధి కుక్కల సంచారం ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. వాహనదారులు, ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే వారు రోడ్లపైకి రావాలంటేనే జంకుతున్నారు. కాలభైరవుల రూపంలో పొంచి ఉన్న ఈ ముప్పు నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు తణుకు మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. మున్సిపాలిటీ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం పట్టణ వ్యాప్తంగా సుమారు 750 వీధి కుక్కలు ఉన్నట్లు గుర్తించారు. వీటి జనాభాను అదుపు చేయడమే లక్ష్యంగా ప్రత్యేక నిధులు, కార్యాచరణతో అధికారులు నడుం బిగించారు.

ప్రత్యేక బోన్లలో బంధించి.. రాజమర్యాదలతో ఆపరేషన్ కేంద్రానికి!

కుక్కల నియంత్రణ ప్రాజెక్టులో భాగంగా మున్సిపల్ సిబ్బంది ప్రతిరోజూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. రోజుకు సుమారు 10 నుంచి 12 కుక్కలను ప్రత్యేకంగా రూపొందించిన బోన్ల ద్వారా సురక్షితంగా బంధించి మున్సిపల్ కేంద్రానికి తరలిస్తున్నారు. అయితే, పట్టుబడిన శునకాలను హింసించకుండా జంతు సంరక్షణ నిబంధనల ప్రకారం మానవీయ కోణంలో చూస్తుండటం ఇక్కడ విశేషం. ఆపరేషన్ కేంద్రానికి తీసుకొచ్చిన వెంటనే వాటికి కడుపు నిండా నాణ్యమైన ఆహారాన్ని అందించి ‘రాజమర్యాదలు’ చేస్తున్నారు. అనంతరం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక ఆపరేషన్ థియేటర్‌లో అనుభవజ్ఞులైన పశువైద్యుల పర్యవేక్షణలో వీటికి అత్యంత జాగ్రత్తగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు (స్టెరిలైజేషన్) నిర్వహిస్తున్నారు.

గుర్తింపు కోసం ‘వి’ ఆకారం కటింగ్.. తిరిగి సొంత వీధికే చేరవేత

కుటుంబ నియంత్రణ సర్జరీ విజయవంతంగా పూర్తయిన తర్వాత, సదరు కుక్కకు ఆపరేషన్ జరిగిందనే విషయాన్ని సులభంగా గుర్తించేందుకు వైద్యులు ఒక పద్ధతిని పాటిస్తున్నారు. కుక్క చెవిపై చిన్నగా ‘వి’ (V) ఆకారంలో ఘాటు పెడతారు. ఇకపై వీధుల్లో తిరిగే కుక్కల చెవులపై ఈ మార్క్ కనిపిస్తే వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ పూర్తయిందని ప్రజలు అర్థం చేసుకోవచ్చు. సర్జరీ అనంతరం ఆ శునకాలను ఒక రోజు పాటు వైద్యుల నిఘాలో ఉంచి, కోలుకున్న తర్వాత మరుసటి రోజు వాటిని ఎక్కడైతే పట్టుకున్నారో, సరిగ్గా అదే వీధిలో సురక్షితంగా వదిలేస్తున్నారు. దీనివల్ల కుక్కల స్థానభ్రంశం జరగకుండా, వాటి స్వభావంలో వచ్చే మార్పులను కూడా గమనించే వీలుంటుంది.

లక్షల రూపాయల బడ్జెట్.. ఒక్కో కుక్కకు రోజుకు రూ. 1500 ఖర్చు

ఈ మూగజీవాల కుటుంబ నియంత్రణ ప్రాజెక్టు కోసం తణుకు పురపాలక సంఘం బడ్జెట్ విషయంలో ఎక్కడా వెనకాడటం లేదు. ఒక్కో కుక్క పట్టుబడినప్పటి నుంచి దానికి చేసే ఆపరేషన్, అందించే పౌష్టికాహారం, వైద్య సేవలు మరియు ఇతర నిర్వహణ ఖర్చుల కోసం రోజుకు సగటున రూ. 1,500 వరకు వ్యయం అవుతోంది. ఈ సర్జరీలు అత్యంత సురక్షితమైన వాతావరణంలో జరగాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీ భారీగా నిధులు వెచ్చించింది. కుక్కలను ఉంచేందుకు వీలుగా నిర్మించిన ఆధునిక షెడ్లు, హైటెక్ హంగులతో కూడిన ఆపరేషన్ థియేటర్ భవన నిర్మాణం కోసమే ఏకంగా రూ. 45 లక్షల ప్రజాధనాన్ని పురపాలక సంఘం వినియోగించింది.

వ్యాధుల నియంత్రణే ధ్యేయం.. అధికారుల భరోసా

ఈ వినూత్న ప్రాజెక్టుపై మున్సిపల్ అధికారులు స్పందిస్తూ.. కేవలం కుక్కల సంఖ్యను తగ్గించడమే కాకుండా పట్టణంలో రేబిస్ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలకుండా నివారించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. శాస్త్రీయ పద్ధతిలో జరుగుతున్న ఈ ఆపరేషన్ల వల్ల భవిష్యత్తులో వీధి కుక్కల జనాభా నియంత్రణలోకి వస్తుందని, ఫలితంగా పట్టణ ప్రజలకు శునకాల భయం వీడి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల పరిధిలో రోల్ మోడల్‌గా నిలుస్తున్న తణుకు మున్సిపాలిటీ ప్రయత్నంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Follow Us