Watch Video: 2 నెలల తరువాత సముద్రంలో చేపలవేటకు మత్స్యకారులు.. మొగదారమ్మకు ప్రత్యేక మొక్కులు..

| Edited By: Srikar T

Jun 17, 2024 | 7:38 PM

రెండు నెలల పాటు వేటకు మత్స్యకారులు విరామం ఇచ్చారు. సాగరంలోకి వెళ్లకుండానే జీవనాన్ని సాగించారు. చేపలు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేసే సమయంలో వేట సాగించడం వల్ల మత్స్య సంపద తగ్గిపోతుందన్న ఆలోచనతో మే, జూన్ నెలల్లో చేపల వేటకు ప్రభుత్వాలే విరామం ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే మత్స్యకారులు రెండు నెలల పాటు సంద్రంలోకి వెళ్లకుండా ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సహాకాలతో జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన విరామం అయిపోవడంతో మత్స్యకారులు సంద్రపైకి వెళ్లారు.

Watch Video: 2 నెలల తరువాత సముద్రంలో చేపలవేటకు మత్స్యకారులు.. మొగదారమ్మకు ప్రత్యేక మొక్కులు..
Fishermen
Follow us on

రెండు నెలల పాటు వేటకు మత్స్యకారులు విరామం ఇచ్చారు. సాగరంలోకి వెళ్లకుండానే జీవనాన్ని సాగించారు. చేపలు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేసే సమయంలో వేట సాగించడం వల్ల మత్స్య సంపద తగ్గిపోతుందన్న ఆలోచనతో మే, జూన్ నెలల్లో చేపల వేటకు ప్రభుత్వాలే విరామం ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే మత్స్యకారులు రెండు నెలల పాటు సంద్రంలోకి వెళ్లకుండా ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సహాకాలతో జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన విరామం అయిపోవడంతో మత్స్యకారులు సంద్రపైకి వెళ్లారు. సాంప్రదాయంగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ పెద్ద ఎత్తున ఈ రోజు తెల్లవారుజామున తమ కులదైవానికి ప్రత్యేక పూజలు చేశారు. నిజాంపట్నంలోని మొగదారమ్మ ఆలయానికి వచ్చిన జాలర్లు సముద్రంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులు చెల్లించుకున్నారు.

ప్రతి బోటుకు బొట్లు పెట్టి నెల రోజుల పాటు సరిపడా చిల్లర సరుకులు, బియ్యం తీసుకొని వేటకు బయలు దేరారు. నిజాంపట్నం నుండి సంద్రలోకి వెళ్లే ద్వారాన్నే మొగ అంటారు. నిజాంపట్నంలో చేపట్టిన హర్బర్ పనుల్లో భాగంగా మొగ సామార్ధ్యాన్ని పెంచారు. దీంతో సముద్రంలోకి వెళ్లడానికి వేట నుండి తిరిగి నిజాంపట్నంలోకి రావడానికి సులభంగా ఉంటుందని మత్స్యకారులు అంటున్నారు. అందుకే తమ కులదైవంగా ఉన్న మొగదారమ్మనే కొలుస్తారు. ఆమెకు మ్రొక్కులు చెల్లించుకున్న తర్వాత వేట సాగిస్తారు. రెండు నెలలు పాటు వేట లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడ్డామని ఇక నుండి తమకు ఆర్ధిక ఇబ్బందులు ఉండవని చెప్పారు. దాదాపు 200 పెద్ద బోట్లు, ఆరు వందల వరకూ మర బోట్లలో ఈ రోజు జాలర్లు వేటకు వెళ్లారు. రానున్న రోజుల్లో ప్రకృతి వైపరీత్యాలు ధరి చేరకుండా మత్స్య సంపద అధికంగా దొరికేలా దీవించాలని మొగదారమ్మకు పూజలు చేసిన అనంతరం సాగరంలోకి వెళ్లారు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..