Konaseema district news: జాలరి ఆశతో వల వేశాడు.. అదృష్టం చేప రూపంలో వేల రూపాయలను తెచ్చిపెట్టింది. తాజాగా.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరో పండుగప్ప చేప దొరికింది. మత్స్యకారుల వలకు చిక్కిన ఈ భారీ పండుగప్ప చేపను రాజోలు మండలం తాటిపాక చేపల మార్కెట్‌కు తీసుకొచ్చారు. భారీ పండుగప్ప చేపను చూసి వినియోగదారులు, వ్యాపారులు ఆశ్చర్యపోయారు. 16 కేజీల బరువు ఉన్న ఈ పండుగప్ప చేపను వేలంలో పెట్టగా భారీగా డిమాండ్ ఏర్పడింది. చివరకు 12వేల రూపాయలకు చేజిక్కించుకున్నారు చేప ప్రియుడు కాసు. తనకు ఈ చేపంటే చాలా ఇష్టమని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
సముద్రంలో మాత్రమే దొరికే ఈ పండుగప్ప చేప.. రుచిలో రారాజు. రేటులోను మెనగాడే. ఇదిలాఉంటే.. ఈనెల 5వ తేదీన కోనసీమ జిల్లాలో ఐ.పోలవరం మండలం భైరవపాలెంలో దీనికన్నా ఎక్కువ బరువున్న.. భారీ పండుగప్ప చేప మత్స్యకారుల వలకు చిక్కింది. ఇది దాదాపు 25 కేజీల బరువు ఉంది. దీన్ని కొందరు వ్యాపారులు కలిసి కొనుగోలు చేశారు. వాళ్లు మరికొంత లాభం వేసుకుని దీన్ని అమ్మేశారని స్థానికులు తెలిపారు. సాధారణంగా రెండు కేజీల నుంచి 10.. 20 కేజీలు.. అంతకుమించి బరువు ఉండే ఈ పండుగప్ప చేపలు సముద్రంలో అరుదుగా దొరుకుతుంటాయని మత్య్సకారులు పేర్కొన్నారు.
గతంలో 20,15 కేజీల పండుగప్ప చేపలు దొరకగా ఇప్పుడు 25 కేజీల వరకు దొరకడంతో మత్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పండుగప్ప చేప సముద్రంతో పాటు నదుల్లో కూడా దొరుకుతుంది. శుభకార్యాలలో పులస పులుసు తరహాలో పండుగప్ప చేప కూర, వేపుడు ముక్కల వంటకాలను మాంస ప్రియులు ఎంతో ఇష్టంగా తింటారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..