Andhra Pradesh: అనంతపురం ఎస్పీ ఫకీరప్ప, మరో ఇద్దరు పోలీసు అధికారులపై కేసు నమోదు.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..
అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పపై కేసు నమోదు చేశారు. ఎస్పీతో పాటు, ఏఎస్పీ హనుమంతు, డీఎస్పీ మహబూబ్ బాషాలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

FIR filed against Anantapur Sp Fakirappa: ఏపీలో పోలీసు ఉన్నతాధికారులపై కేసు సంచలనంగా మారింది. ఏఆర్ కానిస్టేబుల్ భానుప్రకాశ్ ఫిర్యాదుతో అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పపై కేసు నమోదు చేశారు. ఎస్పీతో పాటు, ఏఎస్పీ హనుమంతు, డీఎస్పీ మహబూబ్ బాషాలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎస్పీ, ఇతర పోలీసు అధికారులపై అనంతపురం టూటౌన్ పీఎస్‌లో కానిస్టేబుల్ ప్రకాష్ ఫిర్యాదు చేశాడు. కాగా.. ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్‌ను సర్వీస్ నుంచి ఎస్పీ ఫకీరప్ప డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే.. అయితే, కానిస్టేబుల్‌పై ఐదు క్రిమినల్ కేసులు ఉండటంతో పోలీసు ఉన్నతాధికారుల కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలపై ప్రకాష్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దళితుడిననే చిన్నచూపుతో కుట్రపూరితంగా తనపై తప్పుడు విచారణ జరిపి.. వాంగ్మూలాన్ని రికార్డు చేశారని ప్రకాష్ పేర్కొన్నాడు. ఇందుకు బాధ్యులైన పోలీసు అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
కాగా.. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్న సమయంలో ఎస్పీ ఫక్కీరప్ప టూ టౌన్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. కొద్దిసేపటి తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం సిఐ శివరాముడు ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీపై నమోదైన కేసుకు సంబంధించి డీఐజీ ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతుందని సీఐ వెల్లడించారు. అయితే.. ఇతర జిల్లాకు చెందిన ఉన్నతాధికారితో విచారణ జరిపించాలని డీఐజీ నిర్ణయించినట్లు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే.. ఏఆర్ కానిస్టేబుల్ భానుప్రకాష్ వివాదం.. రోజురోజుకు ముదురుతుండటం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



