AP News: పవన్‌ను సీఎం టార్గెట్‌ చేసినా.. వైసీపీ నేతలు బ్యాలెన్స్‌గా ఎందుకుంటున్నారు..?

|

Jun 30, 2023 | 6:04 PM

పవన్‌కల్యాణ్‌పై వైసీపీ నేతలు గతంలోలా విరుచుకుపడలేకపోతున్నారా? కాపు సామాజికవర్గం దూరమవుతుందనే కలవరం మొదలైందా? అందుకే పవన్‌ని టార్గెట్‌ చేయడంలో ఆచితూచి అడుగేస్తున్నారా? ముఖ్యమంత్రి పర్సనల్‌గా టార్గెట్‌ చేసినా.. వైసీపీ నేతలు బ్యాలెన్స్‌గా ఉండాలనుకుంటున్నారా? మాటలయుద్ధం ముదిరాక నోరు కుట్టేసుకోవడం సాధ్యమేనా?

AP News: పవన్‌ను సీఎం టార్గెట్‌ చేసినా.. వైసీపీ నేతలు బ్యాలెన్స్‌గా ఎందుకుంటున్నారు..?
Pawan Kalyan - CM Jagan
Follow us on

మొన్నటిదాకా వైసీపీ దృష్టిలో ఆయనో గెస్ట్‌ పొలిటిషియన్. ఎప్పుడన్నా అలా చుట్టపుచూపుగా వచ్చిపోతుంటారని పవన్‌కల్యాణ్‌ని టార్గెట్‌ చేసేది అధికారపార్టీ. పవన్‌కల్యాణ్‌కో ఎజెండానే లేదని దుమ్మెత్తిపోసేది. కానీ ఇప్పుడు వారాహి రోడ్డెక్కింది. అలావచ్చి ఇలా వెళ్లిపోలేదు జనసేన అధ్యక్షుడు. పక్కా ప్లాన్‌తో రూట్‌మ్యాప్‌ వేసుకున్నారు. గోదావరి జిల్లాలపై ప్రధానంగా ఫోకస్‌ పెట్టారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్‌ అంటున్నారు. ఆవేశంగా ప్రసంగిస్తున్నా ఆచితూచి పంచ్‌లు వేస్తున్నారు. పాత అనుభవాలతో ఈసారి మరింత జాగ్రత్తపడుతున్నారు. 2019 ఎన్నికల్లో పోటీచేసిన రెండుచోట్లా ఓడిపోయారు పవన్‌కల్యాణ్‌. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఓటమిని మర్చిపోలేదాయన. అందుకే ఈసారి గోదావరి జిల్లాలపై గట్టిగా దృష్టిపెట్టారు. వైసీపీ నేతలను టార్గెట్‌ చేసుకుంటున్నారు. వ్యక్తిగతంగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను ఎత్తిచూపుతున్నారు. గతంలో పవన్‌కల్యాణ్‌ ప్రతీ డైలాగ్‌కీ వైసీపీనుంచి రియాక్షన్‌ వచ్చేది. ఆయన ఒకటంటే వైసీపీ నేతలు నాలుగనేవారు. పవన్‌కల్యాణ్‌కి కౌంటర్లిచ్చేందుకు పోటీ పడేవారు. కానీ ఈసారి అధికారపార్టీ నేతల్లో అంత దూకుడు కనిపించడం లేదన్న చర్చ జరుగుతోంది. కాపు సామాజికవర్గానికి దగ్గరయ్యేందుకు పవన్‌కల్యాణ్‌ చేస్తున్న ప్రయత్నాలతో వైసీపీలోని ఆ వర్గంనేతలు.. కొంచెం జాగ్రత్తపడుతున్నారు.

అంబటిలాంటి నాయకుడు పెద్దగా తగ్గకపోయినా వైసీపీలోని కొందరు కాపునేతలు ఇదివరకటిలా విరుచుకుపడటం లేదు. గత ఎన్నికల్లో కాపులు పెద్దగా మద్దతివ్వకపోవటంతో ఈసారి తన సామాజికవర్గాన్ని దగ్గర చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు పవన్‌కల్యాణ్‌. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై పవన్‌ విమర్శలు చేస్తే .. వైసీపీతో సంబంధంలేని కాపు నేత ముద్రగడ పద్మనాభం స్పందించడం చర్చనీయాంశమైంది. దమ్ముంటే పిఠాపురంలో తనపై పోటీచేయాలని పవన్‌కల్యాణ్‌కి ముద్రగడ సవాల్‌విసిరారు. అయితే కాపు వర్గానికి చెందిన సీనియర్‌ నేత చేగొండి హరిరామజోగయ్య ముద్రగడను తప్పుపట్టడం కాపువర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. తన పర్యటనలో జనసేనశ్రేణులు ముద్రగడకు వ్యతిరేకంగా ప్లకార్డులు పడితే వారించడమే కాకుండా..ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్‌కల్యాణ్‌.

పవన్‌కల్యాణ్‌ మళ్లీ భీమవరంనుంచి పోటీచేస్తారన్న చర్చ జరుగుతోంది. గోదావరి జిల్లాల్లో పవన్‌ వారాహి యాత్రకు గట్టి మద్దతే లభిస్తోంది. జూన్ 14న ప్రత్తిపాడు నుంచి యాత్ర మొదలుపెట్టిన పవన్ కల్యాణ్ ప్రతీ నియోజకవర్గంలో స్థానిక సమస్యలను లేవనెత్తుతున్నారు. అక్కడి ఎమ్మెల్యేల వైఫల్యాలను ప్రస్తావిస్తున్నారు. ఇదివరకు పవన్‌కల్యాణ్‌ విమర్శలను తిప్పికొట్టేందుకు వైసీపీలో కాపు నేతలు క్యూ కట్టేవారు. కానీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ప్రజల మూడ్‌తో పాటు, తమ సామాజికవర్గంలో జరుగుతున్న చర్చను గమనిస్తున్నారట వైసీపీ కాపు నేతలు. పవన్‌కల్యాణ్‌పై పదేపదే ఒకే తరహా విమర్శలు చేస్తూపోతే తమ సామాజికవర్గంలో వ్యతిరేకత వస్తుందన్న ఆందోళన కూడా కొందరిలో ఉందంటున్నారు.

కేవలం కేడర్‌ని ఉత్సాహపరిచేలా కాకుండా, ప్రజలను ఆలోచింపజేసేలా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు పవన్‌కల్యాణ్‌. కాపు సామాజికవర్గం ఈసారి చేజారిపోకూడదన్న పట్టుదలతో ఆయన ఉన్నారు. వైసీపీ ఎన్ని ఎత్తుగడలేసినా కాపులు చీలొద్దన్న మాట చెబుతున్నారు. చంద్రబాబు జేబులో మనిషిఅనో, ఆయన వ్యక్తిగత జీవితంపైనో విమర్శలు చేస్తూ పోతే జనంలో ప్రతికూలత వస్తుందన్న ఆందోళన కూడా కొందరు వైసీపీ నేతలకు ఉందన్న మాట వినిపిస్తోంది. అందుకే తప్పదన్నట్లు ప్రతి విమర్శలుచేస్తున్నా.. ఆ మాటల్లో గతంలో ఉన్నంత ఘాటైతే లేదని పార్టీ శ్రేణులే గుసగుసలాడుతున్నాయి. స్వయానా ముఖ్యమంత్రే పబ్లిక్‌మీటింగ్‌లో పవన్‌కల్యాణ్‌ని ఓ రేంజ్‌లో టార్గెట్‌ చేసుకున్నా.. నేతలు మాత్రం అంతదూకుడుగా వెళ్లడంలేదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి