నిడదవోలు టికెట్ కోసం సోషల్ మీడియా వేదికగా మైండ్‌గేమ్ నడుస్తోంది. టికెట్ తమదేనహో అంటూ అటు టీడీపీ, ఇటు జనసేన కార్యకర్తల సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. దీంతో టికెట్ తమదా, వాళ్లదా అనే కన్ఫ్యూజన్ రెండు పార్టీల్లోనూ మొదలైంది. 2019 వరకు నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. దీన్ని వైసీపీ బద్దలు కొట్టింది. అయినా సరే.. ఇప్పటికీ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. నాయకులతో సంబంధం లేకుండా టీడీపీ చాలా పటిష్టంగా ఉంది. అందుకే, నిడదవోలు టికెట్ దక్కించుకుంటే చాలు గెలిచేసినట్టేనన్న భావన టీడీపీ నేతల్లో ఉంది. బహుశా ఈ కారణంతోనే కాబోలు జనసేన కూడా టికెట్ రేసులోకి దూసుకొచ్చింది.
నిడదవోలు టీడీపీలో పోరు ప్రధానంగా ఇద్దరు నేతల మధ్యే. ఒకరు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు. ఈయన ప్రస్తుత నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ కూడా. మరో కీలక నాయకుడు కందుల సత్యనారాయణ. 2014, 2019 టికెట్ ఆశించినా అధిష్టానం కరుణించలేదు. అందుకే, ఈసారి టికెట్ పక్కా అని కందుల వర్గీయులు బలంగా నమ్ముతున్నారు. మరోవైపు బూరుగుపల్లి మాత్రం.. అధిష్టానం ఆదేశాలు, ఆశీస్సులు తనకే ఉన్నాయంటూ పార్టీ కార్యక్రమాలు చేస్తూ వెళ్తున్నారు. అమరావతి రైతుల పాదయాత్ర సమయంలో బూరుగుపల్లి శేషారావు క్రియాశీల పాత్ర పోషించారు. అదే సమయంలో కుందుల సత్యనారాయణ సైతం రైతుల పాదయాత్రలో తన అనుచరులు, సహచరులతో పాల్గొన్నారు. చంద్రబాబు నిడదవోలులో పర్యటించినప్పుడు ఇద్దరు నేతలు బల ప్రదర్శనకు దిగారు. చంద్రబాబు పర్యటన సమయంలో తన ప్రాభవం చూపించడానికి కుందుల పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. కాకపోతే ఆనాడు సత్యనారాయణను స్టేజీ ఎక్కనివ్వకుండా శేషారావు గ్రూప్ అడ్డుకోగలిగిందని చెబుతారు. పైగా పార్టీ ఇన్‌ఛార్జ్ పదవితో పాటు చంద్రబాబు అండ ఉండటం బూరుగుపల్లికి కలిసొస్తోంది. అందుకే, కందుల సత్యనారాయణ నారాలోకేష్‌తో రహస్య చర్చలు జరుపుతున్నట్లు ఆమధ్య వార్తలొచ్చాయి. హైకమాండ్‌లోని అత్యంత కీలక నేతను కలిసి, టికెట్‌పై గ్రీన్ సిగ్నల్ పొందినట్లు కందుల వర్గంలో టాక్ నడుస్తోంది. ఓవైపు బూరుగుపల్లి, కందుల మధ్య టికెట్ వార్ నడుస్తుంటే.. మధ్యలో జనసేన కూడా దూసుకొచ్చింది. టాలీవుడ్‌లో టాప్‌మోస్ట్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరైన ప్రసాద్.. ఈమధ్యే జనసేనలో చేశారు. ప్రసాద్ కూడా నిడదవోలు టికెట్ ఆశిస్తున్నారు.
జనసేన నిడదవోలు టికెట్ అడగడానికి ఓ కారణం ఉంది. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో జనసేనకు దాదాపు 23 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. అందుకే, అంత గట్టిగా టికెట్ అడుగుతోంది. టికెట్‌పై హోప్స్ పెట్టుకోడానికి మరో కారణం ఏంటంటే.. ఇప్పటికే రెండుసార్లు పోటీ చేసి గెలిచినందున.. ఈసారి జనసేనకు సీటును వదిలేస్తే ఎలా ఉంటుందని చంద్రబాబు సైతం ఆలోచిస్తున్నారట. అందుకే, టికెట్‌పై ధీమాతో నిర్మాత ప్రసాద్ కూడా జనంలో ఉంటున్నారు. ఇలా ఉంటే.. నిడదవోలులో టీడీపీ- జనసేన కార్యకర్తల మధ్య వాట్సప్ వార్ ఇటు చంద్రబాబు, అటు పవన్‌కు తలపోటు తెప్పిస్తోంది. బయట పొత్తులు, లోన కత్తులు అన్నట్టుగా ఉందిక్కడ వ్యవహారం. పొత్తు ధర్మం మీరు పాటించటం లేదంటే మీరు పాటించడం లేదంటూ ఒకరికొకరు వాట్సాప్ గ్రూప్ వేదికగా విమర్శించుకుంటున్నారు. దీంతో రెండు పార్టీల పెద్దలు దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లను, కార్యకర్తలు పెట్టిన పోస్టులను డిలీట్ చేసి, ఎవరి కార్యకర్తలను వారు అదుపులో ఉంచుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అని సీనియర్లు కొంత భయపడుతున్నారు కూడా. నిడదవోలు నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ. ఆ తరువాత ఎస్సీ, బీసీ, ఇతర సామాజిక వర్గాల ఓటర్లు ఉన్నారు. ఈసారి ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్దుల్లో బూరుగుపల్లి తప్ప అందరూ కాపు సామాజిక వర్గం వారే. సో, ఒకరికొకరు సహకరించుకోకపోతే, రెండు పార్టీల ఓట్లు బదిలీ కాకపోతే.. వైసీపీ అభ్యర్ధిని దగ్గరుండి గెలిపించినట్టు అవుతుందని భయపడుతున్నారు. మొత్తానికి నిడదవోలు టికెట్ ఎవరికి ఇస్తే ఏం జరుగుతుందో అన్న టెన్షన్ రెండు పార్టీలను వెంటాడుతోంది. మరో వారం పది రోజుల్లో టికెట్ ఎవరికి అనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..