తిరుపతి అసెంబ్లీ బరిలో టీడీపీనా.. జనసేనా..? అభ్యర్థుల ఎంపికపై తీవ్ర ఉత్కంఠ..

| Edited By: Srikar T

Mar 04, 2024 | 7:41 PM

టెంపుల్ సిటీలో టిడిపి పోటీలో లేనట్టేననిపిస్తోంది. తిరుపతి నుంచి పోటీకి జనసేన పట్టు పడుతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ముందు నుంచి జరుగుతున్న ప్రచారపై స్పష్టత లేకపోయినా బలమైన అభ్యర్థి కోసం మాత్రం జనసేన కసరత్తు చేస్తోంది. బలిజ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కోసం ప్లాన్ చేస్తున్న జనసేన.. లోకల్ లేకపోతే నాన్ లోకల్‎కు ట్రై చేస్తోంది.

తిరుపతి అసెంబ్లీ బరిలో టీడీపీనా.. జనసేనా..? అభ్యర్థుల ఎంపికపై తీవ్ర ఉత్కంఠ..
TDP, Janasena Party
Follow us on

టెంపుల్ సిటీలో టిడిపి పోటీలో లేనట్టేననిపిస్తోంది. తిరుపతి నుంచి పోటీకి జనసేన పట్టు పడుతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ముందు నుంచి జరుగుతున్న ప్రచారపై స్పష్టత లేకపోయినా బలమైన అభ్యర్థి కోసం మాత్రం జనసేన కసరత్తు చేస్తోంది. బలిజ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కోసం ప్లాన్ చేస్తున్న జనసేన.. లోకల్ లేకపోతే నాన్ లోకల్‎కు ట్రై చేస్తోంది. జనసేన పరిశీలనలో ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన బలిజ నేతల పేర్లు పరిశీలనలో ఉండడంతో తిరుపతి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్న టిడిపి ఆశావాహుల్లో గందరగోళం నెలకొంది. జనసేన ప్రయత్నాలతో టిడిపి అశావాహుల్లో నిరుత్సాహం నెలకొంది.

తిరుపతి ఆధ్యాత్మికంగానే కాదు రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్. ఎన్టీఆర్, చిరంజీవి లాంటి సినీ రంగ ప్రముఖులను అసెంబ్లీకి పంపిన తిరుపతి నియోజకవర్గం అన్ని పార్టీలకు సెంటిమెంటే. దీంతో 2024 సార్వత్రిక ఎన్నికలు కీలకంగా మారాయి. వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తిరుపతి ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థిని అధిపతి చేస్తుందో అన్న ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికలకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దూరంగా ఉండగా ఆయన కొడుకు వారసత్వం అందిపుచ్చుకున్నారు. తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‎గా కొనసాగుతున్న భూమన అభినయ్ వైసీపీ సమన్వయకర్తగా బరిలో ఉన్నారు. ఇప్పటికే వైసీపీ అధిష్టానం కూడా భూమన అధినయ్‎ను తిరుపతి అభ్యర్థిగా ప్రకటించగా పెద్ద ఎత్తున ప్రచారం కూడా ప్రారంభమైంది.

డిప్యూటీ మేయర్‎గా రెండేళ్ల కాలంలో చేసిన అభివృద్ధితోపాటు మాస్టర్ ప్లాన్ రోడ్లతో తిరుపతి రూపురేఖలను మార్చామంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు అభినయ్. ఆత్మీయ సమావేశాలులతో వైసీపీ దూకుడు ప్రదర్శిస్తుండగా ప్రతిపక్షంలో ఉలుకు పలుకు లేని స్తబ్ధత నెలకొంది. పొత్తుల అంశంతో పేచీ ఏర్పడింది. టిడిపితో జత కట్టిన జనసేన, కూటమిలో బిజెపి పొత్తు ఉంటుందన్న ప్రచారం కొలిక్కి రాకపోవడంతో ప్రత్యర్థిగా నిలిచే పార్టీ ఏదన్న దానిపై స్పష్టత రావడంలేదు. అయితే టిడిపి జనసేన తొలి ఉమ్మడి జాబితా ప్రకటన తర్వాత తిరుపతి నుంచి జనసేననే పోటీలో ఉంటుందన్న ప్రచారం జోరందుకుంది. ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతి నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్‎ని పోటీ చేయించాలని టిడిపి హై కమాండ్ కూడా ఒత్తిడి తెస్తోందన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వకపోయినా టెంపుల్ సిటీలో జనసేననే పోటీలో ఉండాలన్న దానిపై ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

2009లో ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేసి గెలవడం, మరోవైపు బలిజ సామాజిక వర్గం అధికంగా ఉన్న తిరుపతిలో పవన్ కళ్యాణ్‎కు సంపూర్ణ మద్దతు ఉంటుందన్న అభిప్రాయం తిరుపతిలో జనసేన పోటీ చేసేందుకు కారణమన్న అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్‎లో పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఇందులో భాగంగానే తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసినా, చేయకపోయినా జనసేన మాత్రం ఆధ్యాత్మిక నగరంలో పొటీకి పట్టుబడుతున్నట్లు స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థి ఎంపికలో కసరత్తు చేస్తోంది. ఇప్పటికే తిరుపతి నుంచి అధినేత పోటీ చేయకపోతే టికెట్టును ఆశిస్తున్న వారిలో ప్రముఖంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానిగా తిరుపతి జనసేన ఇన్చార్జిగా కొనసాగుతున్న కిరణ్ రాయల్ ప్రధాన పోటీని ఇస్తున్నారు. మరోవైపు చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పసుపులేటి హరిప్రసాద్ కూడా టికెట్ కోసం ప్రయత్నించారు. తిరుపతి అసెంబ్లీ నుంచి లోకల్ లీడర్‎కు ప్రాధాన్యత ఇస్తే తిరుపతి అసెంబ్లీ జనసేన ఇన్చార్జ్ కిరణ్ రాయల్‎కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉండగా, ఆర్థికంగా బలమైన నాల్ లోకల్ కోసం జనసేన ప్రయత్నిస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నేతల పేర్లను పరిశీలించే అవకాశం ఉందని స్పష్టమవుతుంది.

ఇందులో భాగంగానే నిన్న చిత్తూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నిన్న పవన్ కళ్యాణ్‎తో భేటీ అయ్యారు. తిరుపతి నుంచి జనసేన అభ్యర్థిని బరిలో దింపాలన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు పవన్ కళ్యాణ్ భేటీ సమయంలో కిరణ్ రాయల్ కూడా ఉన్నారని తెలిసింది. కిరణ్ రాయల్‎ను హైదరాబాదుకు పిలిపించిన జనసేన అధినేత ఈ మేరకు చర్చించారని కూడా తెలుస్తోంది. గతంలో ప్రజారాజ్యం చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అరణి శ్రీనివాసులును పార్టీలో చేర్చుకొని తిరుపతి జనసేన టికెట్ కేటాయించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు పెద్ద చర్చే నడుస్తోంది. మరోవైపు గతంలో రాజంపేట పార్లమెంటు టిడిపి అభ్యర్థిగా ప్రకటించిన గంటా నరహరి పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తోంది. తిరుపతి టికెట్ జనసేనకు కేటాయిస్తే టిడిపిని వీడి పార్టీలో చేరెందుకు గంటా నరహరి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బలిజ సామాజిక వర్గానికి ఒకప్పుడు పెద్దదిక్కుగా ఉన్న డీకే ఆదికేశవులు కుటుంబం కూడా జనసేన టికెట్‎ను ఆశిస్తున్నట్లు పెద్ద ప్రచారమే జరుగుతుంది. డీకే ఆదికేశవులు కుటుంబం నుంచి వారసురాలిగా ఆయన మనవరాలు చైతన్య ఇప్పటికే జనసేనలో చేరారు. చిత్తూరు, శ్రీకాళహస్తి అసెంబ్లీ సెగ్మెంట్లను ఆశించిన చైతన్య అక్కడ అవకాశం దక్కకపోవడంతో తిరుపతిలో పోటీకి ఛాన్స్ ఇస్తారేమోనన్న ఆశతో చైతన్య ఉన్నారు.

ఇలా జనసేనలో పోటీకి ఒకరిద్దరు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో టిడిపి ఆశావాహుల్లో నిర్లిప్తత నెలకొంది. తిరుపతికి పెరిగిన పోటీ జనసేన టిడిపిలో పెరిగిపోవడంతో హఠాత్తుగా మరికొన్ని పేర్లు తెరమీదకి రావడం చర్చగా మారింది. తిరుపతి అసెంబ్లీ టిడిపికి సెంటిమెంట్‎గా మారిన నేపథ్యంలో అరడజను మంది ఆశావాహులు తిరుపతి నుంచి టిడిపినే బరిలో ఉంటుందన్న ఆశతో ఉన్నారు. తిరుపతి టిడిపి ఇన్చార్జిగా ఉన్న సుగుణమ్మతోపాటు తిరుపతి పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు నరసింహ యాదవ్, బలిజ సామాజిక వర్గానికి చెందిన సంఘం నేతలు ఊకా విజయ్ కుమార్, కోడూరు బాలసుబ్రమణ్యం, జెబీ శ్రీనివాస్ లాంటి వారు కూడా ఇంకా టికెట్ వస్తుందేమో ఈ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం దక్కుతుందేమోనన్న ఆశతో ఉన్నారు. ఇప్పటికే టిడిపి పలువురు పేర్లతో ఐవిఆర్ఎస్ కూడా నిర్వహించినా తిరుపతిలో టిడిపికి పోటీ చేసే ఛాన్స్ జనసేన ఇవ్వదన్న ప్రచారమే నడుస్తోంది. టిడిపి హై కమాండ్ పవన్ తప్ప మరొకరు పోటీ చేస్తే తిరుపతి టికెట్‎ను జనసేనకు కేటాయించే అవకాశం ఉండదన్న ఆశతోను ఆశావాహులు ఉన్నారు. ఏది ఏమైనా తిరుపతి అధిపతి అయ్యే అభ్యర్థి ఎవరన్నా దానిపై ఓటర్లలో కన్ఫ్యూజన్ మాత్రం పెద్ద ఎత్తునే ఉంది. తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశం జనసేనకేనా లేదంటే టిడిపినే పోటీలో ఉంటుందా అన్నదానిపై స్పష్టత ఇవ్వని రెండు పార్టీల అంతర్మధనం కేడర్‎లో అయోమయానికి కారణం అయ్యింది. అసలు పోటీ చేసేది ఎవరు బరిలో ఉండే పార్టీ ఏది అన్న కన్ఫ్యూజన్ తిరుపతి ప్రజలను పట్టిపీడిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..