TTD: మరణాంతరం తన యావదాస్తిని శ్రీవారికి చెందేలా చేసిన అపర భక్తుడు, మాజీ IRS భాస్కర్ రావు

హైద‌రాబాద్ కు చెందిన‌ మాజీ ఐఆర్ఎస్ అధికారి స్వర్గీయ వై.వి.ఎస్.ఎస్. భాస్కర్ రావు త‌న మ‌ర‌ణానంత‌రం వీలునామా ద్వారా టీటీడీకి రూ.3 కోట్ల విలువైన నివాస గృహంతో పాటు త‌న బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న రూ.66 ల‌క్ష‌ల‌ను విరాళంగా అందించి అచంచ‌ల‌మైన భ‌క్తిని చాటుకున్నారు.

TTD: మరణాంతరం తన యావదాస్తిని శ్రీవారికి చెందేలా చేసిన అపర భక్తుడు, మాజీ IRS భాస్కర్ రావు
Donation To TTD

Edited By: Ram Naramaneni

Updated on: Jul 24, 2025 | 6:30 PM

తిరుమల శ్రీ‌వారిపై అచంచ‌ల‌మైన‌ భ‌క్తిని చాటుకున్నాడు ఒక భక్తుడు. మ‌ర‌ణానంత‌రం వీలునామా ద్వారా టీటీడీకి రూ.3 కోట్ల విలువైన ఇల్లు, రూ.66 ల‌క్ష‌లు విరాళం అందేలా చేశాడు. వివరాల్లోకి వెళ్తే..  హైద‌రాబాద్‌కు చెందిన‌ మాజీ ఐఆర్ఎస్ అధికారి, స్వర్గీయ వై.వి.ఎస్.ఎస్. భాస్కర్ రావు త‌న మ‌ర‌ణానంత‌రం వీలునామా ద్వారా టీటీడీకి రూ.3 కోట్ల విలువైన ఇంటితోపాటు త‌న బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న రూ.66 ల‌క్ష‌ల‌ను విరాళంగా అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇలా శ్రీవారిపై తనకున్న అపారమైన భ‌క్తిని చాటుకున్నారు. హైదరాబాద్ వనస్థలిపురం ప్రాంతంలో ఉన్న 3,500 చదరపు అడుగులు గల ఆనంద నిలయం భవనాన్ని..  ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఆయ‌న టీటీడీకి విరాళంగా ఇస్తున్న‌ట్లు వీలునామాలో పేర్కొన్నారు.

బ్యాంకులో దాచుకున్న సొమ్మును టీటీడీ శ్రీ వేంక‌టేశ్వ‌ర అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.36 ల‌క్ష‌లు, శ్రీ వేంక‌టేశ్వ‌ర స‌ర్వ శ్రేయాస్ ట్ర‌స్టుకు రూ.6 ల‌క్ష‌లు, శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద ప‌రిర‌క్ష‌ణ ట్ర‌స్టుకు రూ.6 ల‌క్ష‌లు, శ్రీ వేంక‌టేశ్వ‌ర గో సంర‌క్ష‌ణ ట్ర‌స్టుకు రూ.6 ల‌క్ష‌లు, శ్రీ‌వేంక‌టేశ్వ‌ర విద్యాదాన ట్ర‌స్టుకు రూ.6 ల‌క్ష‌లు, శ్రీ‌వాణి ట్ర‌స్టుకు రూ.6 ల‌క్ష‌లు విరాళంగా అందివ్వాల‌ని సంక‌ల్పించారు.

తన జీవితాంతం శ్రీ‌వేంకటేశ్వర స్వామి సేవలో అంకితమై ఉండాలని ఆకాంక్షించిన భాస్క‌ర్ రావు అంతిమ కోరిక మేరకు ఆయ‌న మ‌ర‌ణానంతరం ట్ర‌స్టీలు ఎం.దేవరాజ్ రెడ్డి, వి.సత్యనారాయణ, బి.లోకనాథ్‌లు వీలునామా ప్ర‌కారం టీటీడీకి చెందాల్సిన‌ ఆస్తి ప‌త్రాలు, చెక్కుల‌ను గురువారం అందజేశారు. శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయకుల మండ‌పంలో టీటీడీ అద‌న‌పు ఈవో సీ.హెచ్‌. వెంక‌య్య చౌద‌రికి ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను అందజేశారు స్వర్గీయ భాస్క‌ర్ రావు ట్ర‌స్టీల‌ను అద‌న‌పు ఈవో సత్కరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..