Andhra Pradesh: ఓరి మీ దుంపతెగ.. డెడ్‌ బాడీని కూడా వదిలిపెట్టరా..? సాయంత్రం వేళ మార్చురీలో..

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్ల తరచుగా వివాదాలు వెలుగులోకి వస్తున్నాయి. నాలుగు సంవత్సరాల క్రితం ఆసుపత్రి మార్చురీలో మృత దేహంను ఎలుకలు కళ్ళు, కాలి వేళ్ళు తినేయడంతో ఆ సంఘటన అప్పట్లో కలకలం రేపింది.

Andhra Pradesh: ఓరి మీ దుంపతెగ.. డెడ్‌ బాడీని కూడా వదిలిపెట్టరా..? సాయంత్రం వేళ మార్చురీలో..
Eluru Government Hospital
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 19, 2024 | 9:38 PM

స్మశానంలో ఏముంటాయి దోచుకుపోవటానికి.. చనిపోయిన మనిషుల దేహాలను భద్రపరిచే మార్చురీ గదిలో ఏముంటుంది.. అపహరించటానికి అనుకుంటున్నారా..? కానీ శవాలను సైతం మాయం చేసే ఘనులు తయారయ్యారు. అందు కలరు ఇందులేరను సందేహం వలదు.. ఎందెందు వెతికినా అందందు అక్రమార్కులు ఉందురు అని మరోసారి నిజం చేస్తున్నారు. తాజాగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో పని చేసే అవుట్ సో ర్సింగ్ ఉద్యోగి ఒక అనాధ మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా మాయం చేసేందుకు ప్రయత్నం చేశాడు. అంబులెన్సులో తరలిస్తుండగా మరో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి గుర్తించి ఆసుపత్రి అధికారులకు సమాచారం ఇవ్వటంతో శవం తరలింపుకు బ్రేక్ పడింది. దీంతో నిందితుడు వెంటనే ఆ మృతదేహాన్ని మళ్ళీ మార్చరీ యథాస్థానంలో పెట్టేశాడు. ఈ మృతదేహం తరలింపు విషయాన్ని కొద్ది రోజుల పాటు ఆ విభాగానికి సంబందించిన అదికారులు గుట్టు చప్పుడు కాకుండా దాచారు. విషయం బయటకి పొక్కడంతో ఆ తర్వాత చర్యలు చేపట్టారు.

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్ల తరచుగా వివాదాలు వెలుగులోకి వస్తున్నాయి. నాలుగు సంవత్సరాల క్రితం ఆసుపత్రి మార్చురీలో మృత దేహంను ఎలుకలు కళ్ళు, కాలి వేళ్ళు తినేయడంతో ఆ సంఘటన అప్పట్లో కలకలం రేపింది. ఆ తరువాత ఏడాది క్రితం మార్చురీ వద్ద పోస్టుమార్టం చేయాలంటే వేలాది రూపాయలు వసూలు చేస్తున్న సంఘటన వెలుగులోకి రావడంతో అక్కడ పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని శాశ్వతంగా తొలగించారు. అయితే తాజాగా మార్చురీలో ఉన్న ఒక శవాన్ని బయటకు తరలించేందుకు అశోక్ అనే ఉద్యోగి ప్రయత్నం చేసాడు. ఆరోజు సాయంత్రం మార్చురీ అసిస్టెంట్ గా మహిళా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చంద్రావతి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె డ్యూటీ ముగించుకుని వెళ్లిపోయే క్రమంలో అశోక్ అనే మరో ఔట్సోర్సింగ్ ఆమె వద్దకు వచ్చి మార్చురీలో చార్జర్ మర్చిపోయినట్లు చెప్పాడు.. అది తీసుకోవటానికి తాళాలు ఇవ్వమని ఆమెను అడిగాడు. అశోక్ కి తాళాలు ఇచ్చి డ్యూటీ మరొకరికి చంద్రావతి అప్పగిస్తున్న సమయంలో మార్చురీ వద్ద నుంచి ఒక వ్యాన్ వెళ్ళటాన్ని ఆమె గమనించింది. అశోక్ కి ఫోన్ చేసి మార్చురిలో ఉండవలసిన శవం ఉందా లేదా..? అని ప్రశ్నించటంతో అతడు సరిగా సమాధానం చెప్పలేదు. దీంతో ఆమె మార్చురీ తాళాలు తీసి తనకు శవాన్ని చూపించాలని అశోక్ తో వాదించింది. అతడు తాళాలు తీసేందుకు నిరాకరించడంతో డ్యూటీలో ఉన్న మరో మహిళా ఉద్యోగికి విషయం చెప్పి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చింది. అయితే ఘటన జరిగిన అనంతరం తెల్లారి మార్చురీలో తిరిగి శవం దర్శనమిచ్చింది.

అయితే, ఆస్పత్రి అధికారులు మాత్రం ఇందుకు భిన్నంగా జవాబిస్తున్నారు. ఈనెల 14న మార్చురీలో జరిగిన ఘటన గురించి సమాచారం వచ్చిందని, దాంతో వెంటనే విచారణ చేపట్టామని, శవాన్ని తరలించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న అశోక్ అనే ఔట్సోర్సింగ్ ఉద్యోగిని కూడా ప్రిన్సిపల్ ఆఫీస్ కి సరెండ్ చేసామని చెబుతున్నారు. గతంలో జిల్లా ఆసుపత్రిగా ఉన్న సమయంలో మార్చురిలో శవాలు మాయం అయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఏలూరులోనే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రారంభం అవ్వటంతో ఈ కాలేజీకి సంవత్సరానికి 20 వరకు శవాలు అవసరం అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఎవరికైనా బయట కాలేజీలకు మృతదేహాలు అవసరమైతే పోలీస్ క్లియరెన్స్ తీసుకుని, కలెక్టర్ ద్వారా రేటు ఫిక్స్ చేసి బయటకు నిభంధనల ప్రకారం పంపాలి. శవాన్ని బయటకు ఇవ్వడం అంటే చాలా పెద్ద ప్రాసెస్, దీంతో కొందరు ఇలాంటి అక్రమాలకు సైతం తెరలేపారు.

అయితే, తాజాగా జరిగిన ఘటనపై మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కు తెలియజేసినట్లు ఫారెన్సిక్ హెచ్ ఓ డి భాస్కర్ చెబుతున్నారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శశిధరు రాతపూర్వకంగా ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ ఏలూరు ప్రభుత్వాసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ కు ప్రిన్సిపాల్ సిఫార్సు చేసారు.

సాధారణంగా మృతదేహాలను ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కొనుగోలు చేసి తమ కళాశాలలో వైద్య విద్యార్దుల ప్రాక్టికల్ పరిక్షలకోసం వినియోగిస్తారు. దీనికి సంభందించి కొందరు తమ తమ శరీరాలను మరణం తరువాత దానం చేసేవారు ఉన్నారు. మరికొందరు కొన్ని నమ్మకాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. కానీ ప్రమాదాలు, వాగులు, నదుల్లో కొట్టుకువచ్చి ఎవ్వారూ క్లెయిమ్ చేయని శవాలు పోస్టుమార్టం తరువాత మార్చురీలో ఉంటాయి. ఇలాంటి మృతదేహాలకు నిబంధనల మేరకు స్థానిక మున్సిపల్ సిబ్బంది ఖననం చేస్తారు. దీనికి సంభందించిన రికార్డ్స్ ను సక్రమంగా నిర్వహించాలి. అయితే ప్రైవేటు మెడికల్ కాలేజ్లు ఇలాంటి నిబంధనలు పాటించకుండా మార్చురీ సిబ్బందికి ఆశ చూపించి అక్రమాలకు తెరదీస్తున్నారు. ఇలా మృతదేహాలను ఇతర రాష్ట్రాలకు సైతం వీటిని గుట్టుచప్పుడు కాకుండా తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో తేరా వెనుక ఉన్న వాళ్లు బయటకు రావాలంటే పోలీస్ దర్యాప్తు జరగాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..