
పార్వతీపురం మన్యం జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంతో హడలెత్తిపోతున్నారు మన్యం వాసులు. గత కొన్నేళ్లుగా ఏజెన్సీ వాసులను ముప్పుతిప్పలు పెడుతోంది ఏనుగుల గుంపు. నిన్న మొన్నటి వరకు ఎనిమిది ఏనుగుల గుంపు కలిసికట్టుగా సంచరిస్తే.. ఇప్పుడు ఆ గుంపు నుండి హరి అనే ఏనుగు విడిపోయి గుంపుకు దూరంగా ఉంటుంది. నిత్యం గుంపులో ఉండే ఏనుగు ఒక్కసారిగా దూరం కావడంతో రెచ్చిపోయి నానా హంగామా చేస్తోంది. ఏనుగు సంచారంతో స్థానికులు భయాందోళనలకు లోనవుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా పెద్దఎత్తున ఘీంకారాలు చేస్తూ గ్రామాలపై పడుతుంది ఏనుగు. పంట నష్టం చేయడంతో పాటు గ్రామాల్లోని పశువుల పై దాడి చేస్తుంది. పశువుల సాలలను, పంట పొలాలను ధ్వంసం చేస్తుంది.
ఎప్పుడైనా గుంపు నుండి తప్పిపోతే ఒక రోజు, రెండు రోజుల్లో గుంపులో కలిసిపోయే ఏనుగు ఈ సారి మాత్రం సుమారు పది రోజులు దాటినా గుంపు వైపు కన్నెత్తి చూడటం లేదు. గుంపులో కలవడానికి కూడా ప్రయత్నించడం లేదు. అంతేకాకుండా రెచ్చిపోయి హల్ చల్ చేస్తుంది. దీంతో అటవీశాఖ అధికారులు ఒంటరిగా తిరుగుతున్న ఏనుగు పై దృష్టి సారించారు. అలాగే ఏనుగుల గుంపు పై కూడా ట్రాకర్స్ తో మరింత నిఘా పెంచారు. అలా ఏనుగుల పై పర్యవేక్షణ పెంచడంతో ఏనుగుల గుంపు నుండి హరి అనే ఏనుగు దూరం కావడానికి ఓ ఆసక్తికర విషయాన్న తెలుసుకున్నారు.
ఆ ఏనుగు గుంపుకు దూరంగా ఎందుకు ఉంటుంది..
ఏజెన్సీలో సంచరిస్తున్న ఏనుగులు మొత్తం ఎనిమిది. ఈ ఎనిమిది ఏనుగుల గుంపులో ఒక మగ ఏనుగు ఉండగా, మిగతా ఏనుగులు అన్నీ ఆడ ఏనుగులే. అయితే ఆ ఆడ ఏనుగుల్లో ఇప్పుడు రెండు ఏనుగులు గర్భం దాల్చాయి. అలా ఆడ ఏనుగులు గర్భం దాలిస్తే మగ ఏనుగు సంతానోత్పత్తి సమయం వచ్చే వరకు వాటికి దూరంగా ఉంటుంది. గర్భం దాల్చిన తరువాత సుమారు మూడు వందల రోజుల తరువాత సంతానోత్పత్తి జరుగుతుంది. అలా ఆడ ఏనుగులు గర్భం దాల్చడంతో అందుకు కారణమైన మగ ఏనుగు ఆడ ఏనుగులకు దూరంగా ఉంది. అలా దూరం అయిన ఏనుగు తిరిగి సంతానోత్పత్తి సమయంలో మాత్రమే గుంపులోకి వస్తుంది. అలా గుంపుకు దూరం అయిన ఏనుగు ప్రస్తుతానికి ఒంటరిగా ఉంటూ తీవ్ర వేదనకు గురవుతుంది.
Elephants
మగ ఏనుగు.. తమ ఏనుగుల గుంపును గుర్తు చేసుకుంటూ రెచ్చిపోయి ఘీంకారాలు చేస్తూ గ్రామాలపై పడుతుంది. దీంతో కొమరాడ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లో ఏనుగు సంచారంతో స్థానికులకు కంటి మీద కునుకు ఉండటం లేదు. బయటకు రావాలంటేనే భయపడి పోతున్నారు. మరోవైపు అటవీశాఖ ట్రాకర్స్ ఏనుగుల గుంపుతో పాటు ఒంటరిగా ఉన్న మగ ఏనుగును కూడా ట్రాక్ చేస్తూ స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న భయానక పరిస్థితుల నేపథ్యంలో ఇలా ఎన్నాళ్లు గడపాలి, ఏమి చేయాలో తెలియక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు జిల్లావాసులు. ఇప్పటికే ఎనిమిది ఏనుగుల గుంపుతో ప్రాణాలు గుప్పెట్లో బ్రతుకుతున్న జిల్లా వాసులకు మరో రెండు ఏనుగులు జన్మిస్తే ఏనుగుల సంఖ్య పెరిగి మరింత ఇబ్బందికర పరిస్థితులు తప్పవని భయపడిపోతున్నారు స్థానికులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..