రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా తగ్గే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం (జూన్ 20) 32 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 106 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 17 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 217 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. సోమవారం నెల్లూరు జిల్లా దగదర్తిలో 43.4 ప్రకాశం జిల్లా కురిచేడులో 43.2, పల్నాడు జిల్లా విజయపురిలో 43, ఎన్టీఆర్ జిల్లా చిలకల్లులో 42.8, గుంటూరు జిల్లా పొన్నూరులో 42.3 ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 11 మండలాల్లో తీవ్రవడగాల్పులు,88 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు. కాగా ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు సోమవారం నాటికి నైరుతి రుతుపవనాలు రాయలసీమ, దక్షిణాంధ్రలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక బుధవారం (జూన్ 21) శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు రాయలసీమలో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని చెప్పారు. అక్కడక్కడ ఈదురగాలులతో కురిసే వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు, పశువుల, గొర్రెల కాపరులు చెట్ల క్రింద ఉండరాదన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..