AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఎలక్షన్ కమిషన్ సీరియస్
గాల్లోకి ఫైరింగ్.. నాటుబాంబుల బ్లాస్టింగ్. రాళ్లదాడులు, లాఠీఛార్జీలు. తోపులాటలు, తన్నులాటలు. విజయమో వీరస్వర్గమో అన్నట్లు జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్నిచోట్ల ఘర్షణలు జరిగాయి. తలలు పగిలి రక్తంచిందేదాకా వెళ్లింది. పోలింగ్ ముగిశాక పల్నాడులో బాంబులు పేలుతున్నాయ్. పెట్రోల్ సీసాలు మంటలు రేపుతున్నాయ్. తాడిపత్రి మినహా రాయలసీమలో ప్రశాంతంగానే జరిగింది పోలింగ్. ఇక కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి.
వాగ్వాదాలతోనే ఆగలేదు. జబ్బలు కొట్టుకున్నారు. తొడలు చరుచుకున్నారు. రాళ్లు గాలిలోకి లేచాయి. కర్రలు రక్తం కళ్లచూశాయి. ఓటరు చైతన్యం పోటెత్తిన ఏపీలో కొన్నిచోట్ల అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఓ చోట ఎమ్మెల్యే ఓటరు చెంప ఛెళ్లుమనిపిస్తే.. ఆ ఓటరు అంతేవేగంగా స్పందించడంలో తెనాలి నియోజకవర్గంలో బ్రేకింగ్ న్యూస్‌గా మారిపోయిందా సీన్. ఎమ్మెల్యే ఎందుకు కొట్టారు.. అంతకుముందు ఓటరు ఏమన్నాడన్నదానికంటే పోలింగ్‌కేంద్రంలో ఈ చెంపదెబ్బ సీన్ మాత్రం క్షణాల్లో వైరల్ అయింది. ఈ ఘటనపై సీరియస్ అయిన ఈసీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌పై చర్యలకు ఆదేశించింది.
పంతాల పల్నాడులో ఊహించినట్లే పోలింగ్ కేంద్రాల దగ్గర పంతం నీదా నాదా అన్నట్లు తలపడ్డారు రెండుపక్షాల కార్యకర్తలు. మాచర్ల నియోజకవర్గంలోని రెంటాలలో వైసీపీ మద్దతుదారుల దాడిలో టీడీపీ ఏజెంట్ల తలలు పగిలాయి. కాస్త గ్యాప్‌లోనే సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని టీడీపీ టార్గెట్ చేసింది. పాల్వాయి జంక్షన్ దగ్గర పిన్నెల్లి కారుపై దాడి.. మాచర్ల మంటకు ఇంకాస్త ఆజ్యంపోసింది. పోలింగ్ పరిశీలించేందుకు వెళ్లినప్పుడు టీడీపీ కార్యకర్తలు వెళ్ళినప్పుడు టీడీపీ కార్యకర్తలు దాడికి దిగటంతో మాచర్ల ఎమ్మెల్యే కారు అద్దాలు పగిలాయి.
మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం జెట్టిపాలెంలో టీడీపీ కార్యకర్తలు EVMలని పగలగొట్టటంతో పోలింగ్ నిలిచిపోయింది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో దొంగ ఓట్లు వేస్తున్నారన్న ఆరోపణలతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీంగ్ కేంద్రానికి వచ్చిన రజిని, అప్పిరెడ్డి అధికారులతో వాగ్వివాదానికి దిగారు. పోలింగ్ కేంద్రం బయట గుమిగూడిన కార్యకర్తలను పోలీసులు లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు.
టీడీపీ, వైసీపీ పరస్పర దాడులతో రణరంగంగా మారింది పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట. టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు కారుపై పోలింగ్ కేంద్రం దగ్గర కొందరు దాడి చేశారు. తర్వాత వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడిచేయటంతో పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. గోపిరెడ్డి ఆస్పత్రిపై రాళ్లు రువ్వి.. కార్ల అద్దాలను ధ్వంసంచేశారు కొందరు యువకులు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని దొడ్లేరుతో పాటు మరికొన్ని గ్రామాల్లో రెండుపార్టీల మద్దతుదారులు ఘర్షణలకు దిగారు. పల్నాడులో మరికొన్ని చోట్ల కూడా చెదురుమదురు ఘటనలు జరిగాయి. పోలీసుల ఉదాసీనతతోనే వైసీపీ మద్దతుదారులు రెచ్చిపోయారని టీడీపీ ఆరోపిస్తే, ఓటమి భయంతోనే టీడీపీ ఘర్షణలు సృష్టించిందని ఆరోపించారు నర్సరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌యాదవ్.
పోలింగ్ ముగిసే సమయంలో కృష్ణాజిల్లాలోని గన్నవరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇక పెనమలూరు నియోజకవర్గంలో పోలింగ్ చివరి గంట హైడ్రామా చోటుచేసుకుంది. దొంగ ఓట్లు వేసేందుకు బయటి ప్రాంతాలనుంచి వచ్చారని ఆరోపిస్తూ టీడీపీ నిరసనకు దిగింది. వైసీపీ, టీడీపీ శ్రేణులు మోహరించటంతో పోరంకి పోలింగ్ కేంద్రం దగ్గర పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ అక్కడికి చేరుకోవటంతో వాతావరణం వేడెక్కింది. రాళ్లదాడికి దిగిన రెండు వర్గాలను లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్‌పై దాడికి కొందరు ప్రయత్నించటంతో తీవ్ర ఉద్రిక్తత రేగింది. పుల్లలచెరువు మండలంలోని పోలింగ్ కేంద్రంలో దాడిని అడ్డుకునేందుకు కానిస్టేబుల్ తుపాకీలోడ్ చేస్తుండగా మిస్‌ఫైర్ అయింది. ఈ ఘటనలో పోలీస్ సహా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో కాసేపు పోలింగ్ నిలిచిపోయింది. దర్శి మండలం బొట్లపాలెం గ్రామంలో కూడా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణతో కొందరు గాయపడ్డారు.
నీ పెతాపమో నా పెతాపమో అన్నట్టుండే రాయలసీమలోనూ పోలింగ్ ఘర్షణలు హడలెత్తించాయి. ఎప్పుడూ కాకమీదుండే తాడిపత్రి రాజకీయం పోలింగ్‌రోజు కూడా తొడలు కొట్టింది. ఉప్పునిప్పులాంటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎదురుపడటంతో తాడిపత్రి వణికిపోయింది. రెండువర్గాలు రాళ్లు రువ్వుకోవటంతో ఓ కానిస్టేబుల్‌కి గాయాలయ్యాయి. ఎమ్మెల్యే పెద్దారెడ్డి కారు అద్దాలు పగిలాయి. ఆ ఇద్దరికీ నచ్చజెప్పి అక్కడినుంచి పంపించేసరికి పోలీసుల తలప్రాణం తోకకొచ్చింది.
తిరుపతి జిల్లా బ్రాహ్మణకాకలో దొంగ ఓట్ల వివాదంతో రెండు పార్టీల మద్దతుదారులు ఘర్షణకు దిగటంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి చెదరగొట్టారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పోలీసుల తీరుకు నిరసనగా శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థి శంకర్ రోడ్డుపై బైఠాయించారు. విజయనగరంజిల్లాలోని రాజాం మండలం ఒమ్మి పోలింగ్ బూత్‌లో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తోపులాటతో పోలింగ్‌కి కాసేపు అంతరాయం కలిగింది. అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గంలో బాహాబాహీకి దిగారు వైసీపీ, టీడీపీ కార్యకర్తలు.
ఏపీలో హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికలసంఘానికి టీడీపీ ఫిర్యాదుచేసింది. పోలీసుల ఉదాసీనతతో తమ పార్టీ అభ్యర్థులపై దాడులు జరిగాయని ఆరోపించింది. తెనాలి, మాచర్ల, అనంతపురం ఘటనలపై ఈసీ సీరియస్ అయింది. పుంగనూరు ఎస్సై సస్పెన్షన్‌కి ఆదేశించింది. అవాంఛనీయ సంఘటనలపై తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించిన ఈసీ.. గృహనిర్బంధం తో పాటు కేసులు పెట్టాలని అధికారులను ఆదేశించింది. మొత్తానికి పోలింగ్ కేంద్రాలకు ప్రజలు పోటెత్తినా.. అక్కడక్కడా గొడవలు అందరినీ కలవరపరిచాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…