MLC Anantha Babu: అనంతబాబు అంతులేని కథలు.. రంగు రాళ్ల నుంచి డెడ్ బాడీ డోర్ డెలివరీ దాకా..

MLC Anantha Babu Arrest: ఎమ్మెల్సీ అనంత బాబు.. గత నాలుగురోజులుగా తెలుగురాష్ట్రాల్లో ఈ పేరు మారుమోగిపోతోంది. ఏకంగా డ్రైవర్ ని హత్య చేసి.. డెడ్ బాడీని వాళ్ల ఇంటికి తానే తనకారులో డోర్ డెలివరీ చేసి కటకటాలపాలయ్యాడు.

MLC Anantha Babu: అనంతబాబు అంతులేని కథలు.. రంగు రాళ్ల నుంచి డెడ్ బాడీ డోర్ డెలివరీ దాకా..
MLC Anantha Babu
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: May 23, 2022 | 7:09 PM

Driver Subramayam Murder Case: ఎమ్మెల్సీ అనంతబాబు.. గత నాలుగురోజులుగా తెలుగురాష్ట్రాల్లో ఈ పేరు మారుమోగిపోతోంది. ఏకంగా డ్రైవర్ ని హత్య చేసి.. డెడ్ బాడీని వాళ్ల ఇంటికి తానే తనకారులో డోర్ డెలివరీ చేసి కటకటాలపాలయ్యాడు. 47 ఏళ్ల అనంతబాబు.. స్వల్ప వ్యవధిలోనే ఎమ్మెల్సీ స్థాయికి ఎదిగాడు. డీసీసీబీ ఛైర్మన్ గానూ ఈస్ట్ గోదావరి జిల్లాలో పెత్తనం చెలాయించాడు. ఈస్ట్ గోదావరి మారేడుమిల్లి అడవుల్లో రంపచోడవరం ఏజెన్సీలో తెలుగు వీరప్పన్ గానూ చెలరేగిపోయాడు. నిన్నటి వరకూ అతను ఏం చేసినా..ఎంతగా చెలరేగిపోయినా..ఎన్ని అరాచకాలు చేసినా అది మారేడుమిల్లి అడవుల్లో సాగిపోయింది..కానీ అడవిని దాటి మైదానంలో అతను చేసిన హత్య ఇప్పుడు అతని జీవితాన్ని మార్చేసింది. బహుశా రాజకీయ భవిష్యత్తును నాశనం చేసింది. హత్య చేయడానికి అతని దగ్గర వంద కారణాలుండొచ్చు కానీ.. చట్టం ముందు ఇవేమీ నిలబడవ్..నువ్వు ఎమ్మెల్సీవైనా…ఎమ్మెల్యేవైనా..ఎంపీవైనా ఎవరివైనా సరే ఒక్కటే.. నిండు ప్రాణాన్ని బలితీసుకున్న కేసులో సెక్షన్ 302 కింద అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ గా రికార్డుల్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు అనంతబాబు..

అనంతబాబు రాజకీయ ప్రస్థానం ఇది..

అనంతబాబు తండ్రి అనంత చక్రరావు అడ్డతీగల పూర్వ సమితి అధ్యక్షుడు. ఇప్పుడు అనంతబాబు మాదిరిగానే ఏజెన్సీ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించేవాడు..అమాయక గిరిజనులను తన బానిసలుగా చేసుకుని ఇష్టారాజ్యంగా చెలరేగిపోయేవాడు.. ఆదివాసీలను భూములను కబ్జా చేశాడు.. ఇతని అరాచకాలను గమనించిని అప్పటి పీపుల్స్‌ వార్‌ నక్సల్స్‌ 1986లో చక్రరావును కాల్చి చంపారు..తన తండ్రి ఆదివాసీ అని అనంతబాబు చెప్పుకునేవాడు.. కాపు కులానికి చెందిన మాజీ మంత్రి జ్యోతుల నెహ్రూకు సోదరిని…చక్రరావు వివాహం చేసుకున్నారు.. అయితే తల్లి కాపు అయినప్పటికీ తండ్రి కులం తనకు వర్తిస్తుందంటాడు అనంతబాబు..అందుకే అనంతబాబు కూడా గతంలో తాను షెడ్యూల్డ్‌ తెగలకు (ఎస్టీ లేదా ఆదివాసీ) చెందిన వ్యక్తినని చెప్పి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు.ఇది కూడా వివాదాస్పదమైంది.. అటు మరో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు సైతం అనంతబాబుకు మేనమామే అవుతారు..ఇటు జ్యోతుల నెహ్రూ అటు వరుపుల సుబ్బారావులకు ముద్దుల మేనల్లుడు అనంతబాబు.. అటు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో కొనసాగిన అనంతబాబు తర్వాత వైసీపీలో చేరాడు..రంపచోడవరం,అడ్డతీగల ప్రాంతాలను తనకు అడ్డాగా చేసుకున్నాడు.. ఇప్పుడు ఏజెన్సీ గ్రామాల్లో అనంతబాబు ఫొటోతో ఉన్న బ్యానర్ లేని గ్రామం అంటూ ఉండదు.. చాలామంది సెల్ ఫోన్ లలో అతని ఫొటో స్క్రీన్ సేవర్ గా పెట్టుకుంటారు..ఇందుకు కారణం ఏంటో ఎవరికీ తెలీదు.. ఏజెన్సీలో చాలామంది వాలీబాల్ ఆడుతుంటారు..అక్కడ వాళ్లు ఆడే ఆటలో వినియోగించే నెట్ , బాల్ సహా అన్నీ అనంతబాబే ఉచితంగా పంపిణీ చేస్తాడట.. ఏజెన్సీలో జరిగే సంతల్లో, బొంగు చికెన్ అమ్మే షాపుల ముందు అతని బ్యానర్ ఉండాల్సిందే.. ఇప్పుడంటే ఎమ్మెల్సీ పదవి వచ్చింది అంతకుముందు అది కూడా లేదు అయినా సరే రంపచోడవరం ఏజెన్సీలో గోదావరి ఒడ్డున ఉన్న గ్రామాలన్నింటిలో అతని బ్యానర్లు కనిపించేవి..ఏజెన్సీలో మావోయిస్టుల అలజడి తగ్గిపోయాక వీరప్పన్ గా అవతారమెత్తాడు అనంతబాబు..కలపస్మగ్లింగ్, అటవీ ఉత్పత్తుల ఎగుమతులు, రంగురాళ్ల వ్యాపారం ఇలా ఒకటేమిటి అడవిని నమ్ముకుని అడవిలో దొరికే అన్ని వస్తువలకు ఆయనే ఓనర్..ఆయనే జమీందార్..ఆయనే వ్యాపారి.. గతంలో ఆయనపై రౌడీషీట్ కూడా తెరిచారు పోలీసులు..కానీ మూడేళ్ల క్రితం ఆ రౌడీషీట్ ను ఎత్తేయించుకున్నాడు అనంతబాబు.

ఇవి కూడా చదవండి

జెడ్పీటీసీ నుంచి నేరస్తుడి దాకా…

రంపచోడవరం నియోజకవర్గం నుంచి గెలవడానికి అనంతబాబు ఆశీర్వాదమేనని చెబుతారు. ఆయన ఎవరికి ఓటేయమంటే వారికి అక్కడి గిరిజనులు వారికి ఓటేస్తారని చెబుతుంటారు. అందుకే ఆ నియోజకవర్గం మొత్తాన్ని తన కనుసైగలతో శాసిస్తారు. వాస్తవానికి తానే ఎమ్మెల్యే కావాలనేది అనంత బాబు కోరిక.. అందుకే 2014ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తానే నామినేషన్ వేశాడు..అయితే జెడ్పీటీసీగా ఉన్నప్పటి కులవివాదం అతనికి అడ్డుకట్ట అయింది. అతని నామినేష్ తిరస్కరణకు గురైంది. అదే సమయంలో తనకు డమ్మీ నామినేషన్ వేయించిన వంతల రాజేశ్వరి ఏకంగా ఎమ్మెల్యే అయిపోయారు. అయితే ఎమ్మెల్యే రాజేశ్వరి అయినప్పటికీ ఆమె లెటర్ హెడ్ మీద అనంతబాబే సంతకం చేసేవాడని విమర్శలు ఉన్నాయి. డమ్మీ నామినేషన్ మాదిరిగా ఎమ్మెల్యేను కూడా డమ్మీని చేసి పెత్తనం అంతా తానే చెలాయించేవాడని చెబుతారు. అయితే చివర్లో వంతలరాజేశ్వరి అనూహ్యంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరడంతో అనంతబాబుకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. మొదట్లో అమాయకురాలనుకున్న వంతలరాజేశ్వరి కాళికాదేవిలా మారారు.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఈసారి ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్న ధనలక్ష్మిని ఉద్యోగానికి రిజైన్ చేయించి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వంతలరాజేశ్వరిపై పోటీ చేయించి 37వేలకు పైగా భారీ మెజారిటీతో ధనలక్ష్మిని గెలిపించారు అనంతబాబు.. తాను గెలిపిస్తే తన మాట కాదని పార్టీ మారిన వంతలరాజేశ్వరిని ఈ విధంగా రాజకీయంగా దెబ్బ కొట్టారు అనంతబాబు.. అప్పుడైనా ఇప్పుడైనా రంపచోడవరానిక అనఫిషియల్ ఎమ్మెల్యే అనంతబాబేనని చెబుతారు. అయితే అనూహ్యంగా అతన్నిఆర్నెల్ల క్రితం స్థానిక సంస్థల నుంచి ఏపీ శాసనమండలికి అనంతబాబును ఎన్నుకుంది వైసీపీ..

రంగు రాళ్ల నుంచి డెడ్ బాడీ డోర్ డెలివరీ దాకా..

ఏజెన్సీలో దొరికే అమూల్యమైన రూబీలను అనంతబాబు సప్లై చేస్తుంటారని చెబుతుంటారు. ఈ స్మగ్లింగ్ లోనే అతనిపై రౌడీషీట్ కూడా తెరిచారు. అయితే ఇప్పుడు డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసే స్థాయికి అనంతబాబు ఎందుకు మారిపోయాడనేది ఇప్పుడు ఎవరికీ అర్థం కాని పరిస్థితి..ఈ హత్య వెనుక ఏదో బలమైన కారణమే ఉందని తెలుస్తోంది. గతంలో అనేక కేసులు ఉన్నప్పటికీ ఇలా హత్య కేసులు మాత్రం లేవు.. అప్పటి అరకు ఎంపీ కొత్తపల్లి గీత సైతం అనంతబాబు తనపై దాడి చేయించారంటూ ఫిర్యాదు చేస్తే ఆ కేసు అరెస్టై వైజాగ్ జైల్లో కూడా గడిపారు అనంతబాబు.. ఏజెన్సీ మహిళలను వేధించిన ఆరోపణలు ఉన్నాయి..అయితే హత్యలు చేసిన చరిత్ర మాత్రం లేదు..అయితే తన దగ్గర ఎంతో నమ్మకంగా ఆరేళ్లకు పైగా పని చేసిన దళితుడైన సుబ్రమణ్యంని ఇప్పుడు ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అవుతోంది. తన వ్యక్తిగత వ్యవహారాల్లో తల దూర్చాడు కాబట్టే హత్య చేశానని స్వయంగా పోలీసుల విచారణలో అనంతబాబు ఒప్పుకున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు..అయితే అవి ఏరకమైన వ్యక్తిగత మైన వ్యవహారాలు.. అవి అంతటి ప్రమాదకరమైన అంశాలా..ఏకంగా ఒక నిండుప్రాణాలు బలితీసుకునేంతటి వ్యక్తిగత వ్యవహారాలా అన్నది ఇప్పుడు ప్రశ్న..ఆరేళ్లకు పైగా పని చేసిన డ్రైవర్ అకస్మాత్తుగా జాబ్ ఎందుకు మానేశాడు..అనేది తేలాల్సి ఉంది. ఆ తర్వాత తానే రాత్రిపూట అతని ఇంటికి వెళ్లి మరీ డ్రైవర్ ను ఎక్కించుకుని తీసుకెళ్లి కాకినాడ సముద్ర తీరప్రాంతంలోకి తీసుకెళ్లి మర్మావయాల మీద దాడి చేసి దారుణంగా కొట్టి చంపాల్సినంత కోపం ఎందుకొచ్చిందనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. పైగా తానే హత్య చేసి అదే శవాన్ని తన కారులోనే వెనుక సీట్లో వేసుకుని అతని ఇంటికి తీసుకొచ్చి కుటుంబసభ్యులకు అప్పగించడం మరో విచిత్రం.. నేరాల్లో ఇదో కొత్త శకం.. మర్డర్ చేసి స్వయంగా డెడ్ బాడీని డోర్ డెలివరీ చేయడం మరింత విడ్డూరం..

హత్య చేస్తే పొలిటికల్ కెరీర్ నాశనం అవుతుందని తెలీదా..

అవును.. హత్య చేశాక డెడ్ బాడీని వాళ్ల ఇంటికే డోర్ డెలివరీ చేశాక కుటుంబసభ్యులు గొడవ చేయడంతో కారును అక్కడే వదిలే పారిపోయిన ఎమ్మెల్సీ అనంతబాబు.. ఆతర్వాత కూడా చాలా కూల్ గా ఉన్నాడు. తాను చంపిన మనిషి మృతదేహం దగ్గర వాళ్ల బంధువులు శోకసంద్రంలో మునిగి తేలుతుంటే అతను మాత్రం కాకినాడలోనే ఒక పెళ్లికి హాజరై ఆనందడోలికల్లో మునిగి తేలుతూ చిరుదరహాసంతో ఫొటోలకు ఫోజులిచ్చాడు. అతనిపై ఆరోపణలు వచ్చిన కాసేపటికే ఆ ఫొటోలు వాట్సాప్ లలో చక్కర్లు కొట్టాయి. బహుశా ఆ పెళ్లికి పిలిచినవాళ్లు కూడా ఇప్పుడు అవాక్కయి ఉంటారు. ఎందుకంటే అక్కడ మర్డర్ చేసిన చేత్తోనే ఇక్కడు అక్షింతలు వేశాడా అని.. ఆ తర్వాత కూడా అతను తాను మీడియా ముందుకు వస్తున్నానంటూ అందరికీ మెసేజ్ పంపాడు. కాకినాడలోనే ప్రెస్ మీట్ కు ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి.అయితే అనూహ్యంగా ఆ ప్రెస్ మీట్ కు హాజరుకాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు అనంతబాబు.ఏ దైర్యంతో అతను ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాడు..ఒకవేళ ప్రెస్ మీట్ కు హాజరైనప్పటికీ ఏం చెప్పాలనుకున్నాడనేది ఆసక్తికర అంశమే.. అయితే న్యాయం కోసం సుబ్రమణ్యం తల్లి,అతని భార్య చేసిన పోరాటం అంతా ఇంతా కాదు..అనంతబాబు తరఫున మహామహులు,ఉద్దండులు రంగంలోకి దిగి వారిని కాంప్రమైజ్ కావాలని రాయాబారాలు నడిపారు. ఏకంగా రెండు కోట్ల నగదు,రెండెకరాల భూమి కూడా ఇస్తామని ఆశ చూపారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయినా సరే తన కొడుకుని చంపిన ఆ ఎమ్మెల్సీని అరెస్ట్ చేసేవరకూ పోరాటం చేస్తామని గట్టిగా నిలబడింది ఆ తల్లి.. పోస్ట్ మార్టం విషయంలోనూ పోలీసుల తీరు విమర్శలపాలైంది.. ఎమ్మెల్సీని అరెస్ట్ చేసేవరకూ పోస్ట్ మార్టంకు అంగీకారపత్రంపై సంతకం చేసేది లేదని సుబ్రమణ్యం తల్లి, భార్య మొండికేశారు..ఒక దశలో పోస్టుమార్టం రూమ్ కి తీసుకెళ్లి మహిళా పోలీసులతో తమకు కొట్టించి బలవంతంగా సంతకాలు చేయిస్తున్నారంటూ అక్కడి నుంచే సుబ్రమణ్యం భార్య ఆడియో రిలీజ్ చేసింది. దీంతో ఈ వ్యవహారం పోలీసులకు మరింత తలనొప్పిగా మారింది.

చివరికి ఎస్పీ రంగంలోకి దిగి అనుమానాస్పద కేసును కాస్తా హత్య కేసుగా మార్చి ఎమ్మెల్సీపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తున్నామని ప్రకటించడంతో కుటుంబసభ్యులు శాంతించి పోస్టుమార్టంకు అంగీకరించారు. ఇంత హడావిడి తర్వాత ఎస్సీ సంఘాలు, టీడీపీ నేతల ఆందోళనల తర్వాత ఎట్టకేలకు అనంతబాబు పోలీసులకు లొంగిపోయాడు. అతనికి అతనే లొంగిపోయాడా లేక పోలీసులు అరెస్ట్ చేశారా అనేదానిపై క్లారిటీ లేదు.ఇక హత్య చేస్తే తన పొలిటికల్ కెరీర్ నాశనమవుతుందని ఇద్దరు ఆడపిల్లల తండ్రైన అనంతబాబుకు తెలీదా అంటే..అది కూడా ఆలోచించాల్సి న విషయమే…ప్రస్తుతానికి ఈ కేసులో అతను నిందితుడు మాత్రమే..నేరస్తుడు కాదు.. అంటే కోర్టులో విచారణ జరిగి శిక్షపడినప్పుడు మాత్రమే అతను నేరస్తుడు అవుతాడు.. అంటే శిక్షపడేలోపు చాలా జరగొచ్చు.. ఏదైనా జరగొచ్చు.. అప్పటి వరకూ వేచి చూద్దాం..ఈ డెడ్ బాడీ డోర్ డెలివరీ వ్యవహారం తేలేదాకా…

-అశోక్ వేములపల్లి, డిప్యూటీ ఇన్ పు ట్ ఎడిటర్, టీవీ9 తెలుగు

మరిన్ని ఏపీ వార్తలు ఇక్కడ చదవండి..

అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!
డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!
ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.
ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.